కరవనంతవరకు వీధికుక్కల సమస్య గురించి ఎవరూ పట్టించుకోరని నానుడి. వీధికుక్కల్లో రోగక్రిములను హరించే సమర్థ విధానం దేశంలోని అన్ని పురపాలక సంస్థల్లో ఇంకా ఆవిర్భవించాల్సి ఉంది.
తన వీధుల్లో వీధికుక్కలు లేని ఒక నగరం, పట్టణం లేదా గ్రామం పేరు చెప్పండి. తన దారిన తాను పోతున్న వాడి జీవితాన్ని కల్లోలపర్చే కుక్క కాట్ల వల్ల అతగాడు రేబిస్ వ్యాధిబారిన పడి మరణించవచ్చు. గ్రామ పంచాయతీ నుంచి పెద్ద మునిసిపల్ కార్పొరేషన్ల దాకా వీధికుక్కల నిర్వహణలో కాస్తంత వైవిధ్యం ప్రదర్శించగల పౌర సంస్థను చూపించండి మరి.
వ్యవస్థీకృతం అని మనం చెప్పుకుంటున్న మన సమాజంలో కుక్కల వల్ల కలుగుతున్న ఉపద్రవాలను సరైన నిష్పత్తిలో గుర్తించడం లేదు. భారత్‌లో 30 కోట్ల వీధి కుక్కలు ఉన్నట్లు కొన్ని సంవత్సరాల క్రితం బీబీసీ పేర్కొంది. ప్రతి సంవత్సరం 20 వేలమంది రేబిస్ వ్యాధి కారణంగా చనిపోతున్నారని కూడా తెలిపింది. అయితే ఈ ప్రకటన వివాదం రేపింది. వీధికుక్కల కంటే పెంపుడు కుక్కలే మనుషులను ఎక్కువగా కరుస్తున్నాయని వాదనలు ఉన్నాయి కూడా. కాబట్టి వీధికుక్కలు పెద్ద సమస్యేమీ కాదు.
కొన్నేళ్ల క్రితం ముంబై, ఠాణే నగరాల్లో ఒక పిల్లాడిని కుక్క కరిచింది. ఆ పిల్లాడికి నూరు కుట్లు పడ్డాయి. మరో ఘటనలో ఒక కుక్క ఆ ప్రాంతంలోని మరో కుక్కతో కలిసి ఒక చిన్న పిల్లాడిని అకారణంగా కరిచింది. ఇక పోతే, ప్రపంచంలోని ఏకైక పట్టణ ప్రాంత జాతీయ పార్కు అయిన సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లోని చిరుతపులులు పార్క్ నుంచి బయటకు వచ్చి పరిసర ప్రాంతాల్లో వేటాడేవి. ఎందుకంటే వేటాడ్డానికి వాటికి సమృద్ధిగా వీధికుక్కలు దొరికేవి.
దీంతో ఆ చిరుతపులులను కాల్చి చంపాలని లేక పట్టుకోవాలని, వాటిని మరోచోటికి పంపాలని జనం అభిప్రాయాలు చెప్పేవారు. అంతే కానీ వీధికుక్కల ఉపద్రవాన్ని అరికట్టాల్సిందని డిమాండ్ చేస్తూ వీరిలో ఒక్కరు కూడా పురపాలక శాఖ అధికారులను ఒత్తిడికి గురిచేసేలా ఏ చర్యలకూ దిగేవారు కాదు. నిజానికి ఈ సమస్యను నిర్లక్ష్యం చేసేవారు లేదా జనం ప్రేమతో తిండి పెడుతుండటం వల్ల వీధికుక్కల జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగేది. అయితే, కుక్కలకు టీకాలు వేయడం కానీ, వాటిలో రోగక్రిములు లేకుండా జాగ్రత్తలు చేపట్టడం కానీ చేసేవారు కాదు.
కుక్కల్లోని రోగక్రిములను నాశనం చేయడం ఒక్కటే వీధికుక్కల జనాభాను నివారించలేదని కొన్నేళ్ల క్రితం, ముంబై పురపాలక సంస్థకు చెందిన ఆరోగ్యవిభాగం అధికారి వివరించారు. అలాగని ఇతర సమర్థవంతమైన కార్యక్రమాలు లేకపోవడంతో కష్టాలు మరింతగా పెరిగేవి. కేవలం రోగక్రిముల నివారణ అనే ఒక్క చర్య ద్వారా కుక్కల జనాభాను అరికట్టడానికి పదేళ్ల కాలం పట్టింది. అయితే విస్తృతస్థాయిలో స్టెరిలైజేషన్, రేబిస్ నిరోధక చర్యలను చేపట్టడం నిలకడగా సాగించాలనే ఆలోచనను పురపాలక సంస్థ అస్సలు పట్టించుకునేది కాదు.
ఇది మరొక పరిణామానికి దారితీసేది. పెంపుడు కుక్కలను పెంచుకోని శునక ప్రేమికులు రెండు కారణాలవల్ల వాటికి తిండి పెట్టేవారు. వాటిపై మమత లేక పేరు కోసం వారు వీధికుక్కలకు అలా తిండి పెట్టేవారు. ఇక పెంపుడు కుక్కలతో కరిపించుకునే యజమానులు (రాజ్‌థాక్రే భార్యకు పెంపుడు కుక్క కరిస్తే 60 కుట్లు పడ్డాయి) వీధికుక్కల నుంచి వచ్చే ప్రమాదాన్ని అసలు చూడలేరు. రాజకీయంగా పలుకుబడి కలిగిన థాక్రే వంటి నేతలు (ఎన్నికల్లో గెలుపు సాధనకు ఇది పనిచేయదనుకోండి) ఆచరణ సాధ్యమయ్యే వీధికుక్కల పాలసీపై ఎలాంటి ఒత్తిడీ చేయరు. సమాజంలో న్యూసెన్స్ కలిగిస్తున్న వీధి కుక్కలను ఏరిపారేయడానికి ముంబై హైకోర్టు అనుమతించింది. కానీ అపెక్స్ కోర్టు దీనిపై స్టే విధించి వీధికుక్కల్లో రోగ క్రిములను తొలగించే కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో అమలుచేసే విధానాన్ని తీసుకురావాలని ఆదేశించింది.
దేశంలోని అన్ని పురపాలక సంస్థల్లో అన్ని స్థాయిల్లో ఇలాంటి విధానం ఇంకా ఆవిర్భవించాల్సి ఉంది. ఎందుకంటే ఎవరినైనా కుక్క కరవకుంటే వీధికుక్కల సమస్య గురించి ఎవరూ పట్టించుకోరన్న అభిప్రాయం ఉంది. అలాగే అకారణంగా తన నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసిన కుక్కను చంపుతానని ఆ తండ్రి ప్రమా ణం చేశాడు. మరొక పిల్లాడిని కూడా కుక్క కరిస్తే వందలాది కుట్లు వేయించాల్సి వచ్చింది. ఇదీ కుక్కకాటు కథ. వీధికుక్కల వల్ల కలుగుతున్న ఉపద్రవం కథ.
మహేశ్ విజాపుర్కర్, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్: mvijapurkar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment