అడుగు బయటపెడితే బతుకు కుక్కలపాలే! Dogs terror in Andhrapradesh | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 24 2018 10:35 AM

Dogs terror in Andhrapradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయం.. ఓ వైపు రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తుంటే మరోవైపు చీకటి పడితే చాలు కుక్కలు ప్రాణాలు తోడేస్తున్నాయి. వెంటాడి.. వేటాడి మరీ కరుస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేదు.. అందరిదీ ఇదే సమస్య. హఠాత్తుగా మీదపడి ఎక్కడ కాటేస్తాయోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా చిన్నారుల పాలిట యమపాశాలవుతున్నాయి. వీటి బారినపడి మృత్యువాత పడిన ఘటనలూ అనేకం. ఇలాంటి విషాద ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నా సమస్య పరిష్కారంపై అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడింది. రాష్ట్రవ్యాప్తంగా కుక్కల భయం జనాన్ని వణికిస్తోంది. సగటున రోజుకు 387 మంది కుక్క కాటుతో వివిధ ఆస్పత్రులకు వస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అంచనా వేయ్యొచ్చు. మారుమూల ప్రాంతాల్లో ఆసుపత్రుల వరకు రాని కేసులు వీటికి అదనం. వారం రోజుల కిందట కడప చిన్నచౌక్‌ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాల నుంచి వస్తుండగా ఏడుగురు స్కూలు విద్యార్థులను కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. అలాగే, విజయవాడలో అయితే రోజూ పదుల సంఖ్యలో కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. ఇలా రాష్ట్రంలోని అన్నిచోట్లా కుక్కకాటు బాధితులు నిత్యం నమోదు అవుతూనే ఉన్నారు. సకాలంలో ఆస్పత్రికి వెళ్లకపోతే దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించడం కష్టం.

పట్టణాల్లోనే ఎక్కువ..
కుక్కకాటు బాధితుల సంఖ్య పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటోంది. విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, కర్నూలు వంటి నగరాల్లో ఈ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వాస్తవానికి కుక్కలను చంపకూడదని చట్టం చెబుతోంది. దీనిబదులు వాటికి స్టెరిలైజేషన్‌ (కుటుంబ నియంత్రణ) విధిగా చేయాలి. కానీ, ఈ పనిచేయాల్సిన మున్సిపల్, పశుసంవర్ధక శాఖ అధికారులు దీనిపై దృష్టిపెడుతున్న దాఖలాలు చాలా తక్కువే. గత కొన్ని నెలలుగా మున్సిపల్‌ శాఖ ఈ ప్రక్రియ చేపట్టకపోవడంతో కుక్కల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో బాధితుల సంఖ్య కూడా అదే నిష్పత్తిలో పెరుగుతోంది. కాగా, కుక్క కాటుకు గురవుతున్న వారిలో ఎక్కువగా చిన్నారులే ఉండడం గమనార్హం.

కుక్కల సంఖ్యపై కాకిలెక్కలు
పట్టణాల్లో లక్షా 55వేల కుక్కలు మాత్రమే ఉన్నాయని మున్సిపల్‌ శాఖ చెబుతోంది. వీటిలో ఇప్పటివరకూ 1.30 లక్షల కుక్కలకు కుటుంబ నియంత్రణ చేశామని, ఇంకా పాతిక వేల కుక్కలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆ శాఖ చెబుతోంది. కానీ, తాజా లెక్కల ప్రకారం కేవలం పట్టణాల్లోనే 3 లక్షల కుక్కలకు పైగానే ఉన్నాయని అధికారులు  చెబుతున్నారు. ఇటీవలి కాలంలో కుక్కల నియంత్రణ అంశాన్ని మున్సిపల్‌ శాఖ పూర్తిగా విస్మరించడంతో వాటి బాధ భరించలేక ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు.

48 నెలల్లో ఎప్పుడైనా రేబిస్‌!
ఇదిలా ఉంటే.. కుక్క కరిస్తే వచ్చే రేబిస్‌ వ్యాధి 14 రోజుల నుంచి 48 నెలల్లోపు ఎప్పుడైనా సోకవచ్చు. చిన్న గాటు కూడా పడలేదని సాధారణంగా చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ, రేబిస్‌కు కారణమయ్యే వైరస్‌ అత్యంత ప్రమాదకారి. నెమ్మదిగా వ్యాపిస్తుంది. నిర్లక్ష్యం వహిస్తే మృత్యువాత పడే ప్రమాదం ఉంది. ఈ వైరస్‌ నరాల వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తుంది. కాగా, భుజం, మెడ, వీపు.. ఇలా ఏదైనా తలకు సమీపంలో గాటు పడితే రేబిస్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకి సురక్షితంగా బయటపడిన దాఖలాలు లేవు.


కుక్క కరిస్తే ప్రాథమిక చికిత్స ఇలా..

  •  కుక్క కరవగానే గాయాన్ని శుభ్రంగా కడగాలి
  • కుళాయి నుంచి నేరుగా గాయం మీద నీళ్లు పడేలా చూడాలి. దీనివల్ల సొంగ కొట్టుకుపోతుంది
  • సబ్బు నీటితో శుభ్రంగా కడగడం వలన వైరస్‌ లక్షణాలను వీలైనంత ఎక్కువగా నిర్మూలించవచ్చు
  • డెటాల్‌ వంటి మందులను గాయంపై వేయడం మంచిది
  • కుక్కకాటు గాయానికి కుట్లు వేయడంగానీ, ఆయింట్‌మెంట్‌ రాయడం కానీ చేయకూడదు
  • కుక్కలలో నోటి నుంచి సొంగ కారడం, నాలుక బయటపెట్టడం, మతిలేకుండా తిరగడం, కనపడిన వస్తువులను, మనుషులను, పశువులను కరవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని పిచ్చి కుక్కగా పరిగణించవచ్చు
  •  ఇలాంటి కుక్కలు కరచిన వెంటనే 30 నిముషాల్లోపు ఏఆర్‌వీ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి
  • రేబిస్‌ వ్యాధి ఒకరికి సోకితే కుటుంబ సభ్యులకు, ఇరుగు పొరుగు వారికి కూడా సోకే అవకాశం ఉంటుంది
  • కుక్క కరచిన రోజు నుండి 0 డోసు నుండి ఏఆర్‌వీ వేయించుకోవాలి. కరచిన రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు, 90వ రోజున యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ వేయించాలి
  • గాయం బాగా పెద్దదిగా ఉంటే రేబిస్‌ ఇమ్యున్లోబిలిన్‌ యాంటీ సీరంలను వేయాలి
  • రేబిస్‌ వ్యాక్సిన్‌ ప్రభుత్వాసుపత్రుల్లో లభిస్తుంది. అక్కడ లభించలేదంటే ఒక్కో డోసు రూ.600 నుంచి రూ.700 వరకూ అవుతుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement