rebis
-
‘భౌ’బోయ్.. కరుస్తున్నాయ్!
సాక్షి, అమరావతి: కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 82 శాతం మంది ప్రజలు నిత్యం వీధి, పెంపుడు శునకాలతో దాడి ముప్పు పొంచి ఉందని భయపడుతున్నారట. ఇందులో 61 శాతం మంది ఇలాంటి దాడులు సర్వ సాధారణమని చెప్పగా.. ఇది గతంతో పోలిస్తే 31 శాతం పెరుగుదలను చూపిస్తోంది. లోకల్ సర్కిల్స్ దేశవ్యాప్తంగా 326 జిల్లాల్లో 53 వేల మందికిపైగా ప్రజల నుంచి ప్రతి స్పందనలు స్వీకరించింది. వీరిలో 67 శాతం పురుషులు, 33 శాతం మహిళలు ఉన్నారు. ప్రతి 10 మందిలో 8 మంది కుక్కల బెడదను తొలగించడంలో అధికారుల సహకారం దూరమైందని అభిప్రాయపడ్డారు. వీధి కుక్కల నియంత్రణ, పెంపుడు కుక్కల డేటా సేకరణలోనూ నిర్లక్ష్యంగా ఉన్నట్టు సర్వే తెలిపింది. కేవలం 10 శాతం మంది మాత్రమే అధికార యంత్రాంగంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 71 శాతం మంది ప్రజలు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద విచ్చలవిడి జంతు నిర్వహణకు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం విశేషం. 36 శాతం రేబిస్ మరణాలు భారత్‌లోనే! దేశంలో జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం–1960 ప్రకారం జంతువులను హింసించడం, చంపడం చట్టవిరుద్ధం. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్–2001 ప్రకారం.. వాటి జనాభాను తగ్గించడానికి వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, టీకాలు వేయాల్సి ఉంటుంది. అయితే, చాలా రాష్ట్రాల్లో నిధుల కొరతతో వీధి కుక్కలకు టీకాలు వేయడంలో విఫలమవుతున్నట్టు సర్వే చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా రేబిస్ మరణాలలో 36 శాతం భారతదేశం నుంచే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అంటే 18వేల నుంచి 20వేల మరణాలు సంభవిస్తున్నాయి. 30నుంచి 60 శాతం మృతుల్లో 15 ఏళ్లలోపు చిన్నారులే ఎక్కువగా ఉంటున్నారు. వీధి శునకాలకు వేటాడే స్వభావం వీధి శునకాలకు విచ్చలవిడిగా వేటాడే స్వభావం ఉంటుందని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవి సంచరిస్తున్న ప్రదేశంలో ఆహారం లభించకుంటే చిన్నచిన్న జంతువులను చంపి తింటాయని.. ఆ ప్రక్రియ వాటి మానసిక ప్రవృత్తిని ప్రభావితం చేస్తోందని వాదిస్తున్నారు. ఏటా ఆడ శునకం 20 పిల్లలకు జన్మనిస్తుంది. ఒక్కసారి కారు, బైక్ ప్రమాదంలో శునకం పిల్ల చనిపోతే ఆ వాహనాన్ని శత్రువుగా భావిస్తుంది. అలాంటి వాహనాలు వస్తే దూకుడుగా వెంబడించడం.. దాడి చేయటం వాటికి అలవాటుగా మారుతుందంటున్నారు. గతేడాది మహారాష్ట్రలో అత్యధికంగా 3,46,318 శునకాల దాడుల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 3,30,264 కేసులతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. ఏపీలో 1,69,378, ఉత్తరాఖండ్‌లో 1,62,422, కర్ణాటకలో 1,46,094, గుజరాత్లో 1,44,855, బీహార్‌లో 1,18,354 కేసులొచ్చాయి. -
జంతువులతో జాగ్రత్త.. విస్తుగొలిపే విషయాలు
ప్రాచీన కాలం నుంచి జంతువులతో మానవుని సహచర్యం కొనసాగుతూనే ఉంది. ప్రతి మనిషి పశు పక్షాదుల నుంచి ఉత్పత్తి అయ్యే పాలు, గుడ్లు, మాంసంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్నాడు. అంతే కాదు.. పెంపుడు కుక్కను మించిన విశ్వాసపాత్రమైన జంతువు మరొకటి ఉండదని పలువురు చెబుతుంటారు. ఈ సహచర్యంలో కొన్ని వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు తెలియకనే సంక్రమిస్తున్నాయి. ఆధునిక వైద్య పరిజ్ఞానం ఎంత పెరిగినప్పటికీ కొన్ని వ్యాధులకు ఇప్పటికీ వైద్యం లేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం సంక్రమిస్తున్న స్వైన్‌ఫ్లూ, బర్డ్‌ఫ్లూ, రేబిస్, హెచ్ఐవీ, ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్–19) కూడా జంతువుల నుంచే మానవులకు సంక్రమించింది. మనుషులకు వచ్చే ప్రతి మూడు జబ్బుల్లో రెండు జంతువుల నుంచే సంక్రమిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల(జూనోటిక్ వ్యాధులు)పై ప్రత్యేక కథనం. సాక్షి, ఖమ్మం : జంతువుల నుంచి మనుషులకు, వారి నుంచి జంతువులకు 190 రకాల వ్యాధులు సోకుతాయని నిపుణులు చెబుతున్నారు. బర్డ్‌ఫ్లూ, స్వైన్‌ప్లూ వంటి వ్యాధులతో పాటు రేబిస్, టీబీ, జపనీస్ ఎన్‌సఫలైజేషన్ వంటి వ్యాధులు సంక్రమించే ప్రమా దం ఉంది. కుక్కకాటు ద్వారా రేబిస్, పందుల ద్వారా జపనీస్ ఎన్‌సఫలైజేషన్ (మొదడువాపు), పశువులు, గొర్రెలు వంటి ద్వారా టీబీ సోకుతున్నాయి. జంతువుల నుంచి సంక్రమించే వ్యాధు లను జూనోటిక్ వ్యాధులు అంటారు. రేబిస్‌కు సంబంధించి వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తలు మినహా, వ్యాధి సోకిన తర్వాత వైద్యం లేదు. మూడేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రపదేశలో జబ్బు చేసిన మేకను తినడం వల్ల ఆంత్రాక్స్ ప్రబలిన విషయం తెలిసిందే. బర్డ్‌ఫ్లూ సైతం దేశంలో పలు ప్రాంతాల వ్యక్తులను వణికించిన విషయం కూడా తెలిసిందే. అడవి గబ్బిలం ద్వారా సోకే నిఫా వైరస్ కేరళలో 10 జూన్ 2018లో బయటపడి ఆ రాష్ట్రాన్ని వణికించింది. బర్డ్‌ప్లూ వ్యాధి: బర్డ్‌ప్లూ లేదా ఇన్ప్లూయెంజా వ్యాధి కోళ్లను, ఇతర పక్షులను ఆశిస్తుంది. ఇది వైరస్ వల్ల కలిగే వ్యాధి. ఈ వైరస్‌లో 144 ఉప రకాలున్నాయి. ఇది కోళ్లు, పక్షుల నుంచి మానవాళికి సంక్రమిస్తు్తంది. 1997లో ఖండాతర వ్యాధిగా రూపొంది చాలా దేశాల్లో కోట్ల కొలది కోళ్లు మరణించాయి. ప్రధానంగా వీటి పెంకందారులు, షెడ్లలో పనిచేసే వారికి త్వరితగతిన ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకిన కోళ్లు, పక్షులు అకస్మాత్తుగా మరణిస్తాయి. వ్యాధి సోకిన మనుషుల్లో జలుబు, గొంతునొప్పి, దగ్గు, కండ్లకలకతో మొదలై ఊపిరితిత్తుల్లో రక్తం చేరి మరణానికి దారి తీస్తుంది. ఈ వ్యాధి నివారణకు కచ్చితమైన టీకా మందును ఇంతవరకు కనుగొన లేదు. టామిప్లూ వంటి వైరస్ నిరోధక మందులు వ్యాధి తీవ్రతను, వ్యాధి వ్యాప్తిని అదుపులో ఉంచేందుకు కొంత మేరకు ఉపయోగపడుతాయి. ఆంత్రాక్స్ వ్యాధి: ఈ వ్యాధి బాసిల్లస్ ఆంత్రాసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. జంతువులు, మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో ఇది చాలా ప్రమాదకరమైనది. వ్యాధి సోకిన పశువుల పొట్ట ఉబ్బి అకస్మాత్తుగా చనిపోతాయి. వ్యాధి సోకిన మనుషుల్లో జ్వరం, న్యూమోనియా వస్తుంది. బ్రూసెల్లోసిస్: ఈ వ్యాధి పశువుల్లో బ్రూసెల్లా అబార్టస్ బ్రూసెల్లా మెలిటెన్సిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి అన్ని జాతుల పశువులకు, మనుషులకు సోకుతుంది. వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వచ్చి ఈసుకుపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మగ పశువుల్లో తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వంధ్యత్వం ఏర్పడుతుంది. ఇవిగాక మైకో బ్యాక్టీరియా బ్యుటర్క్యులోసిస్ బ్యాక్టీరియా వల్ల క్షయ లేదా టీబీ, లెప్టాస్పైరా ఇక్టిరోహియో రేజికా బ్యాక్టీరియా వల్ల లెప్టోస్పైరోసిస్ వ్యాధులు వ్యాపిస్తాయి. కుక్కకాటుకు గురైతే ఏం చేయాలి.. కుక్కకాటుకు గురైనప్పుడు తక్షణమే ఆ గాయాన్ని సబ్బు నీటితో కానీ, మంచి నీటితో కానీ నిరంతరాయంగా పది నిమిషాల పాటు కడగాలి. కుక్క కరిచిన గాయానికి కట్టు కట్టడం, కుట్లు వేయడం, అయింట్మెంట్లు రాయడం కానీ చేయకూడదు. వీలైనంత త్వరగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. గాయాలు పెద్దవిగా ఉన్నా, తలకు దగ్గరకు కరిచినా ఏఆర్వీతో పాటు ఇమ్యునోగ్లోబ్యులిన్స్ ఇంజెక్షన్లు తీసుకుంటే రేబిస్ సోకకుండా 95 శాతం రక్షణ ఉంటుంది. ప్రస్తుతం దీనిని ప్రభుత్వాస్పత్రిలో ఉచితంగా వేస్తున్నారు. కుక్క కరవడమే కాకుండా కాళ్లతో గీరినప్పుడు రక్తం వచ్చినా, శరీరంపై ఉన్న గాయాలపై కుక్క నాలుకతో నాకినా రేబిస్ వ్యాధి వచ్చే ఆవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో వెంటనే ఏఆర్వీ వేయించుకోవాలి. రేబిస్ సోకిన వ్యక్తి ద్వారా కూడా ఇతరులకు వ్యాధి సోకే ఆవకాశం ఉంది. రేబిస్ వ్యాధి.. రేబిస్ వ్యాధి సోకితే చికిత్స లేదనేది వాస్తవమే కానీ అన్ని కుక్కల వల్ల రేబిస్ వస్తుందనేది అపోహ మాత్రమే. అవగాహన లోపం కారణంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రేబిస్ వ్యాధి రాబ్డో అనే వైరస్ వల్ల సోకుతుంది. ఈ వైరస్ ఎక్కువగా అడవుల్లో ఉండే క్రూర జంతువులు, గబ్బిలాల్లో ఎటువంటి లక్షణాలు చూపించకుండా ఉంటుంది. ఈ వైరస్ గాలి, నీటి ద్వారా మార్పు చెందుతుంది. మృగాలు, గబ్బిలాలు చనిపోవడం, వాటిని కుక్కలు తినడం వల్ల వాటిలో ఉన్న వైరస్ కుక్కలకు వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ ఉన్న కుక్కలు మనుషులను, పశువులను కరవడం వలన లాలాజలం ద్వారా సంక్రమిస్తుంది. రేబిస్ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా 35 వేల మంది మరణిస్తున్నారు. ఈ మరణాలు 60 శాతం భారతదేశంలోనే సంభవిస్తున్నాయి. ఈ వైరస్ మనుషులకు, పశువులకు వ్యాప్తి చెందడంలో కుక్కలు వారధిగా పనిచేస్తుంటాయి. చనిపోయిన రేబిస్ వ్యాధి సోకిన పశువులను, గబ్బిలాల కళేబరాలను కుక్కలు తినడం వలన ఈ వైరస్ కుక్కలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధితో కుక్కలు మానసిక స్థితిని కోల్పోయి, విచిత్రంగా ప్రవర్తిస్తాయి. వ్యాధిని గుర్తించకపోవడంతో కొన్ని రోజుల్లో జీవులు మరణిస్తాయి. పెంపుడు కుక్కలతో పాటు వాటిని పెంచేవారికి, డాక్టర్లు కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. జూనోటిక్ వ్యాధి కారకాలు 7 రకాలు ∙ బ్యాక్టీరియా: ఆంత్రాక్స్, బ్రూసెల్లోసిస్ లెప్టోస్పైరోసిస్, క్షయ ∙ వైరస్: రేబిస్, బర్డ్‌ఫ్లూ, మెదడు వాపు, సార్స్, మేడ్‌కౌడిసీజ్ ∙ ప్రొటోజువా: టాక్సోప్లాస్మోడియా, లైష్మెనియాసిస్ ∙ రెకెట్షియా: టిక్, టైఫస్, క్యూఫీవర్ ∙ హెల్మెంథ్స్: ఎకైనోకోకోసిస్, టీనియాసిస్ ∙ ఎక్టోపారాసైట్స్: స్కేజిస్ పశువుల్లో రేబిస్ లక్షణాలు రేబిస్ వ్యాధి సోకడం వల్ల పశువుల ప్రవర్తనలో తేడా వస్తుంది. మూలగడం, ఒంటరిగా ఉండడం లాంటివి కనిపిస్తాయి. శరీరంపై దురద, కోపం, ఉలికిపాటుకు గురవడం. అరుపులు ఆవలింతలా వస్తాయి. నీటిని తీసుకోవు. పక్షవాతంలా వచ్చి మరణిస్తాయి. ఇవన్నీ 11 రోజుల్లో జరిగిపోతాయి. మనుషుల్లో.. జ్వరం రావడం, కాళ్లు పట్టుకుపోవడం, చూపులో మార్పు రావడం, భయపడిపోవడం, పక్షవాతం వచ్చి శరీరం పనిచేయకుండా పోయి మరణిస్తారు. నివారణ చర్యలు.. ఈ వైరస్ సోకకుండా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలి. అలానే కుక్కల్లో పునరుత్పత్తి జరగకుండా ఇంజక్షన్లు చేయాలి. కుక్కలతో తీసుకోల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు కుక్కల వల్ల కలిగే వ్యాధుల గురించి వివరించాలి. రేబిస్ వ్యాధి సోకి కుక్క, పశువులు మరణిస్తే వాటి కళేబరాలను పూడ్చకుండా దహనం చేయాలి. జూనోసిస్ డే.. లూయిస్‌పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా 1885 జూలై 6న పిచ్చికుక్క కాటుకు గురైన బాలుడికి నిరోధక టీకా ఇవ్వడం ద్వారా రేబిస్ వ్యాధి రాకుండా కాపాడగలిగాడు. దీంతో అప్పటి నుంచి ఏటా జూలై 6న జూనోసిస్ దినోత్సవంగా జరుపుతున్నాం. ఈ సందర్భంగా వ్యాధులు, సంక్రమణ విధానం, వాటి పట్ల అవగాహన కలిగించడంతో పాటు, నివారణపై ప్రజలకు అవగాహన కలిగించాలి. -
అడుగు బయటపెడితే బతుకు కుక్కలపాలే!
సాక్షి, అమరావతి : ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయం.. ఓ వైపు రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తుంటే మరోవైపు చీకటి పడితే చాలు కుక్కలు ప్రాణాలు తోడేస్తున్నాయి. వెంటాడి.. వేటాడి మరీ కరుస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేదు.. అందరిదీ ఇదే సమస్య. హఠాత్తుగా మీదపడి ఎక్కడ కాటేస్తాయోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా చిన్నారుల పాలిట యమపాశాలవుతున్నాయి. వీటి బారినపడి మృత్యువాత పడిన ఘటనలూ అనేకం. ఇలాంటి విషాద ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నా సమస్య పరిష్కారంపై అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడింది. రాష్ట్రవ్యాప్తంగా కుక్కల భయం జనాన్ని వణికిస్తోంది. సగటున రోజుకు 387 మంది కుక్క కాటుతో వివిధ ఆస్పత్రులకు వస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అంచనా వేయ్యొచ్చు. మారుమూల ప్రాంతాల్లో ఆసుపత్రుల వరకు రాని కేసులు వీటికి అదనం. వారం రోజుల కిందట కడప చిన్నచౌక్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాల నుంచి వస్తుండగా ఏడుగురు స్కూలు విద్యార్థులను కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. అలాగే, విజయవాడలో అయితే రోజూ పదుల సంఖ్యలో కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. ఇలా రాష్ట్రంలోని అన్నిచోట్లా కుక్కకాటు బాధితులు నిత్యం నమోదు అవుతూనే ఉన్నారు. సకాలంలో ఆస్పత్రికి వెళ్లకపోతే దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించడం కష్టం. పట్టణాల్లోనే ఎక్కువ.. కుక్కకాటు బాధితుల సంఖ్య పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటోంది. విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, కర్నూలు వంటి నగరాల్లో ఈ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వాస్తవానికి కుక్కలను చంపకూడదని చట్టం చెబుతోంది. దీనిబదులు వాటికి స్టెరిలైజేషన్ (కుటుంబ నియంత్రణ) విధిగా చేయాలి. కానీ, ఈ పనిచేయాల్సిన మున్సిపల్, పశుసంవర్ధక శాఖ అధికారులు దీనిపై దృష్టిపెడుతున్న దాఖలాలు చాలా తక్కువే. గత కొన్ని నెలలుగా మున్సిపల్ శాఖ ఈ ప్రక్రియ చేపట్టకపోవడంతో కుక్కల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో బాధితుల సంఖ్య కూడా అదే నిష్పత్తిలో పెరుగుతోంది. కాగా, కుక్క కాటుకు గురవుతున్న వారిలో ఎక్కువగా చిన్నారులే ఉండడం గమనార్హం. కుక్కల సంఖ్యపై కాకిలెక్కలు పట్టణాల్లో లక్షా 55వేల కుక్కలు మాత్రమే ఉన్నాయని మున్సిపల్ శాఖ చెబుతోంది. వీటిలో ఇప్పటివరకూ 1.30 లక్షల కుక్కలకు కుటుంబ నియంత్రణ చేశామని, ఇంకా పాతిక వేల కుక్కలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆ శాఖ చెబుతోంది. కానీ, తాజా లెక్కల ప్రకారం కేవలం పట్టణాల్లోనే 3 లక్షల కుక్కలకు పైగానే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో కుక్కల నియంత్రణ అంశాన్ని మున్సిపల్ శాఖ పూర్తిగా విస్మరించడంతో వాటి బాధ భరించలేక ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. 48 నెలల్లో ఎప్పుడైనా రేబిస్! ఇదిలా ఉంటే.. కుక్క కరిస్తే వచ్చే రేబిస్ వ్యాధి 14 రోజుల నుంచి 48 నెలల్లోపు ఎప్పుడైనా సోకవచ్చు. చిన్న గాటు కూడా పడలేదని సాధారణంగా చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ, రేబిస్‌కు కారణమయ్యే వైరస్ అత్యంత ప్రమాదకారి. నెమ్మదిగా వ్యాపిస్తుంది. నిర్లక్ష్యం వహిస్తే మృత్యువాత పడే ప్రమాదం ఉంది. ఈ వైరస్ నరాల వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తుంది. కాగా, భుజం, మెడ, వీపు.. ఇలా ఏదైనా తలకు సమీపంలో గాటు పడితే రేబిస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకి సురక్షితంగా బయటపడిన దాఖలాలు లేవు. కుక్క కరిస్తే ప్రాథమిక చికిత్స ఇలా.. కుక్క కరవగానే గాయాన్ని శుభ్రంగా కడగాలి కుళాయి నుంచి నేరుగా గాయం మీద నీళ్లు పడేలా చూడాలి. దీనివల్ల సొంగ కొట్టుకుపోతుంది సబ్బు నీటితో శుభ్రంగా కడగడం వలన వైరస్ లక్షణాలను వీలైనంత ఎక్కువగా నిర్మూలించవచ్చు డెటాల్ వంటి మందులను గాయంపై వేయడం మంచిది కుక్కకాటు గాయానికి కుట్లు వేయడంగానీ, ఆయింట్మెంట్ రాయడం కానీ చేయకూడదు కుక్కలలో నోటి నుంచి సొంగ కారడం, నాలుక బయటపెట్టడం, మతిలేకుండా తిరగడం, కనపడిన వస్తువులను, మనుషులను, పశువులను కరవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని పిచ్చి కుక్కగా పరిగణించవచ్చు ఇలాంటి కుక్కలు కరచిన వెంటనే 30 నిముషాల్లోపు ఏఆర్వీ వ్యాక్సిన్ వేయించుకోవాలి రేబిస్ వ్యాధి ఒకరికి సోకితే కుటుంబ సభ్యులకు, ఇరుగు పొరుగు వారికి కూడా సోకే అవకాశం ఉంటుంది కుక్క కరచిన రోజు నుండి 0 డోసు నుండి ఏఆర్వీ వేయించుకోవాలి. కరచిన రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు, 90వ రోజున యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలి గాయం బాగా పెద్దదిగా ఉంటే రేబిస్ ఇమ్యున్లోబిలిన్ యాంటీ సీరంలను వేయాలి రేబిస్ వ్యాక్సిన్ ప్రభుత్వాసుపత్రుల్లో లభిస్తుంది. అక్కడ లభించలేదంటే ఒక్కో డోసు రూ.600 నుంచి రూ.700 వరకూ అవుతుంది. -
కుక్క కాటు అనివార్యమేనా?
కరవనంతవరకు వీధికుక్కల సమస్య గురించి ఎవరూ పట్టించుకోరని నానుడి. వీధికుక్కల్లో రోగక్రిములను హరించే సమర్థ విధానం దేశంలోని అన్ని పురపాలక సంస్థల్లో ఇంకా ఆవిర్భవించాల్సి ఉంది. తన వీధుల్లో వీధికుక్కలు లేని ఒక నగరం, పట్టణం లేదా గ్రామం పేరు చెప్పండి. తన దారిన తాను పోతున్న వాడి జీవితాన్ని కల్లోలపర్చే కుక్క కాట్ల వల్ల అతగాడు రేబిస్ వ్యాధిబారిన పడి మరణించవచ్చు. గ్రామ పంచాయతీ నుంచి పెద్ద మునిసిపల్ కార్పొరేషన్ల దాకా వీధికుక్కల నిర్వహణలో కాస్తంత వైవిధ్యం ప్రదర్శించగల పౌర సంస్థను చూపించండి మరి. వ్యవస్థీకృతం అని మనం చెప్పుకుంటున్న మన సమాజంలో కుక్కల వల్ల కలుగుతున్న ఉపద్రవాలను సరైన నిష్పత్తిలో గుర్తించడం లేదు. భారత్‌లో 30 కోట్ల వీధి కుక్కలు ఉన్నట్లు కొన్ని సంవత్సరాల క్రితం బీబీసీ పేర్కొంది. ప్రతి సంవత్సరం 20 వేలమంది రేబిస్ వ్యాధి కారణంగా చనిపోతున్నారని కూడా తెలిపింది. అయితే ఈ ప్రకటన వివాదం రేపింది. వీధికుక్కల కంటే పెంపుడు కుక్కలే మనుషులను ఎక్కువగా కరుస్తున్నాయని వాదనలు ఉన్నాయి కూడా. కాబట్టి వీధికుక్కలు పెద్ద సమస్యేమీ కాదు. కొన్నేళ్ల క్రితం ముంబై, ఠాణే నగరాల్లో ఒక పిల్లాడిని కుక్క కరిచింది. ఆ పిల్లాడికి నూరు కుట్లు పడ్డాయి. మరో ఘటనలో ఒక కుక్క ఆ ప్రాంతంలోని మరో కుక్కతో కలిసి ఒక చిన్న పిల్లాడిని అకారణంగా కరిచింది. ఇక పోతే, ప్రపంచంలోని ఏకైక పట్టణ ప్రాంత జాతీయ పార్కు అయిన సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లోని చిరుతపులులు పార్క్ నుంచి బయటకు వచ్చి పరిసర ప్రాంతాల్లో వేటాడేవి. ఎందుకంటే వేటాడ్డానికి వాటికి సమృద్ధిగా వీధికుక్కలు దొరికేవి. దీంతో ఆ చిరుతపులులను కాల్చి చంపాలని లేక పట్టుకోవాలని, వాటిని మరోచోటికి పంపాలని జనం అభిప్రాయాలు చెప్పేవారు. అంతే కానీ వీధికుక్కల ఉపద్రవాన్ని అరికట్టాల్సిందని డిమాండ్ చేస్తూ వీరిలో ఒక్కరు కూడా పురపాలక శాఖ అధికారులను ఒత్తిడికి గురిచేసేలా ఏ చర్యలకూ దిగేవారు కాదు. నిజానికి ఈ సమస్యను నిర్లక్ష్యం చేసేవారు లేదా జనం ప్రేమతో తిండి పెడుతుండటం వల్ల వీధికుక్కల జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగేది. అయితే, కుక్కలకు టీకాలు వేయడం కానీ, వాటిలో రోగక్రిములు లేకుండా జాగ్రత్తలు చేపట్టడం కానీ చేసేవారు కాదు. కుక్కల్లోని రోగక్రిములను నాశనం చేయడం ఒక్కటే వీధికుక్కల జనాభాను నివారించలేదని కొన్నేళ్ల క్రితం, ముంబై పురపాలక సంస్థకు చెందిన ఆరోగ్యవిభాగం అధికారి వివరించారు. అలాగని ఇతర సమర్థవంతమైన కార్యక్రమాలు లేకపోవడంతో కష్టాలు మరింతగా పెరిగేవి. కేవలం రోగక్రిముల నివారణ అనే ఒక్క చర్య ద్వారా కుక్కల జనాభాను అరికట్టడానికి పదేళ్ల కాలం పట్టింది. అయితే విస్తృతస్థాయిలో స్టెరిలైజేషన్, రేబిస్ నిరోధక చర్యలను చేపట్టడం నిలకడగా సాగించాలనే ఆలోచనను పురపాలక సంస్థ అస్సలు పట్టించుకునేది కాదు. ఇది మరొక పరిణామానికి దారితీసేది. పెంపుడు కుక్కలను పెంచుకోని శునక ప్రేమికులు రెండు కారణాలవల్ల వాటికి తిండి పెట్టేవారు. వాటిపై మమత లేక పేరు కోసం వారు వీధికుక్కలకు అలా తిండి పెట్టేవారు. ఇక పెంపుడు కుక్కలతో కరిపించుకునే యజమానులు (రాజ్‌థాక్రే భార్యకు పెంపుడు కుక్క కరిస్తే 60 కుట్లు పడ్డాయి) వీధికుక్కల నుంచి వచ్చే ప్రమాదాన్ని అసలు చూడలేరు. రాజకీయంగా పలుకుబడి కలిగిన థాక్రే వంటి నేతలు (ఎన్నికల్లో గెలుపు సాధనకు ఇది పనిచేయదనుకోండి) ఆచరణ సాధ్యమయ్యే వీధికుక్కల పాలసీపై ఎలాంటి ఒత్తిడీ చేయరు. సమాజంలో న్యూసెన్స్ కలిగిస్తున్న వీధి కుక్కలను ఏరిపారేయడానికి ముంబై హైకోర్టు అనుమతించింది. కానీ అపెక్స్ కోర్టు దీనిపై స్టే విధించి వీధికుక్కల్లో రోగ క్రిములను తొలగించే కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో అమలుచేసే విధానాన్ని తీసుకురావాలని ఆదేశించింది. దేశంలోని అన్ని పురపాలక సంస్థల్లో అన్ని స్థాయిల్లో ఇలాంటి విధానం ఇంకా ఆవిర్భవించాల్సి ఉంది. ఎందుకంటే ఎవరినైనా కుక్క కరవకుంటే వీధికుక్కల సమస్య గురించి ఎవరూ పట్టించుకోరన్న అభిప్రాయం ఉంది. అలాగే అకారణంగా తన నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసిన కుక్కను చంపుతానని ఆ తండ్రి ప్రమా ణం చేశాడు. మరొక పిల్లాడిని కూడా కుక్క కరిస్తే వందలాది కుట్లు వేయించాల్సి వచ్చింది. ఇదీ కుక్కకాటు కథ. వీధికుక్కల వల్ల కలుగుతున్న ఉపద్రవం కథ. మహేశ్ విజాపుర్కర్, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్: mvijapurkar@gmail.com -
ఫీవర్ ఆసుపత్రిలో రేబీస్ కేసు నమోదు
నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో ఆదివారం ఓ నమోదైంది. వివరాలు... నల్లగొండ జిల్లా మోత్కూరు గట్టు సింగారం గ్రామానికి చెందిన కిష్టయ్య(50)ను రెండు నెలల క్రితం ఓ వీధికుక్క కరిచింది. ఆ సమయంలో అతను సరైన చికిత్సలు తీసుకోలేదు. కాగా శనివారం సాయంత్రం నుంచి వింతగా ప్రవర్తిస్తున్న అతన్ని స్థానిక ఆస్పత్రికి తీసుకు వెళ్లగా అనుమానంతో మెరుగైన చికిత్సల కోసం హైదరాబాద్‌కు తీసుకు వెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు శనివారం రాత్రి నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. కిష్టయ్యను పరీక్షించిన అక్కడి వైద్యులు రేబీస్‌గా నిర్ధారించి ఇన్‌పేషంట్‌గా చేర్చుకుని చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్థుతం రోగి పరిస్థితి ఆందోళన కరంగానే ఉంది, 24 గంటలకు మించి బతకడం కష్టమని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. -
ఫీవర్ ఆస్పత్రిలో రేబీస్‌తో యువకుడి మృతి
హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో రేబీస్‌తో చికిత్స పొందుత్ను ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. నల్లగొండ జిల్లా నేరేడుచర్ల చింతబండకు చెందిన కొంగరి భాస్కర్(28) సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇరవై రోజుల క్రితం అతనిపై ఓ వీధి కుక్క దాడిచేసి గాయపరిచింది.అతను వెంటనే చికిత్సల కోసం స్థానిక ఆస్పత్రికి వెళ్లగా టీటీ, ఏఆర్వీ ఇంజక్షన్ ఇచ్చి పంపేశారు. కుక్క కరిచిన వారికి రేబీస్ సోకకుండా రేబీస్ ఇమ్యునొ గ్లోబులిన్ (రిగ్) ఇంజక్షన్ చేయించుకోవాలనే విషయం తెలియని అతను అలాగే ఉండి పోయాడు.. గత రెండు రోజులుగా వింతగా ప్రవర్తిస్తున్న భాస్కర్‌ను కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అతన్ని పరీక్షించిన వైద్యులు రేబీస్‌గా నిర్ధారించి ఇన్ పేషంట్‌గా చేర్చుకుని చికిత్సలు ప్రారంభించారు. అక్కడ చికిత్సలు పొందుతున్న అతను బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు రోధిస్తూ భాస్కర్ మృత దేహాన్ని స్వగ్రాహానికి తీసుకుని వెళ్లిపోయారు.