సాక్షి, అమరావతి: కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 82 శాతం మంది ప్రజలు నిత్యం వీధి, పెంపుడు శునకాలతో దాడి ముప్పు పొంచి ఉందని భయపడుతున్నారట. ఇందులో 61 శాతం మంది ఇలాంటి దాడులు సర్వ సాధారణమని చెప్పగా.. ఇది గతంతో పోలిస్తే 31 శాతం పెరుగుదలను చూపిస్తోంది. లోకల్ సర్కిల్స్ దేశవ్యాప్తంగా 326 జిల్లాల్లో 53 వేల మందికిపైగా ప్రజల నుంచి ప్రతి స్పందనలు స్వీకరించింది. వీరిలో 67 శాతం పురుషులు, 33 శాతం మహిళలు ఉన్నారు.
ప్రతి 10 మందిలో 8 మంది కుక్కల బెడదను తొలగించడంలో అధికారుల సహకారం దూరమైందని అభిప్రాయపడ్డారు. వీధి కుక్కల నియంత్రణ, పెంపుడు కుక్కల డేటా సేకరణలోనూ నిర్లక్ష్యంగా ఉన్నట్టు సర్వే తెలిపింది. కేవలం 10 శాతం మంది మాత్రమే అధికార యంత్రాంగంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 71 శాతం మంది ప్రజలు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద విచ్చలవిడి జంతు నిర్వహణకు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం విశేషం.
36 శాతం రేబిస్ మరణాలు భారత్‌లోనే!
దేశంలో జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం–1960 ప్రకారం జంతువులను హింసించడం, చంపడం చట్టవిరుద్ధం. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్–2001 ప్రకారం.. వాటి జనాభాను తగ్గించడానికి వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, టీకాలు వేయాల్సి ఉంటుంది. అయితే, చాలా రాష్ట్రాల్లో నిధుల కొరతతో వీధి కుక్కలకు టీకాలు వేయడంలో విఫలమవుతున్నట్టు సర్వే చెబుతోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా రేబిస్ మరణాలలో 36 శాతం భారతదేశం నుంచే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అంటే 18వేల నుంచి 20వేల మరణాలు సంభవిస్తున్నాయి. 30నుంచి 60 శాతం మృతుల్లో 15 ఏళ్లలోపు చిన్నారులే ఎక్కువగా ఉంటున్నారు.
వీధి శునకాలకు వేటాడే స్వభావం
వీధి శునకాలకు విచ్చలవిడిగా వేటాడే స్వభావం ఉంటుందని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవి సంచరిస్తున్న ప్రదేశంలో ఆహారం లభించకుంటే చిన్నచిన్న జంతువులను చంపి తింటాయని.. ఆ ప్రక్రియ వాటి మానసిక ప్రవృత్తిని ప్రభావితం చేస్తోందని వాదిస్తున్నారు. ఏటా ఆడ శునకం 20 పిల్లలకు జన్మనిస్తుంది. ఒక్కసారి కారు, బైక్ ప్రమాదంలో శునకం పిల్ల చనిపోతే ఆ వాహనాన్ని శత్రువుగా భావిస్తుంది.
అలాంటి వాహనాలు వస్తే దూకుడుగా వెంబడించడం.. దాడి చేయటం వాటికి అలవాటుగా మారుతుందంటున్నారు. గతేడాది మహారాష్ట్రలో అత్యధికంగా 3,46,318 శునకాల దాడుల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 3,30,264 కేసులతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. ఏపీలో 1,69,378, ఉత్తరాఖండ్‌లో 1,62,422, కర్ణాటకలో 1,46,094, గుజరాత్‌లో 1,44,855, బీహార్‌లో 1,18,354 కేసులొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment