సంతకం చేయవద్దని సతాయిస్తున్నారు..!
ఇప్పటికే పీకలలోతు వివాదాలలో కూరుకుపోయిన కోదాడ మున్సిపల్ కార్యాలయం తాజాగా మరో వివాదానికి తెరలేపింది.
కోదాడ మున్సిపాలిటీలో కొత్త వివాదం
పాత కమిషనర్ చేర్చుకున్నారు..
కొత్తాయన వద్దంటున్నారు
సంతకం చేయకుండానే విధుల నిర్వహణ
ఈఎన్‌సీని ఆశ్రయించిన నూతన ఏఈ
కోదాడ: ఇప్పటికే పీకలలోతు వివాదాలలో కూరుకుపోయిన కోదాడ మున్సిపల్ కార్యాలయం తాజాగా మరో వివాదానికి తెరలేపింది. కమిషనర్ల తమ ఆధిపత్య పోరులో కొత్తగా ఉద్యోగంలో చేరిన ఓ యువ ఇంజనీర్‌తో ఫుట్‌బాల్ ఆడుతున్నారు. పాత కమిషనర్ ఉద్యోగంలో చేర్చుకోగా కొత్త కమిషనర్ మాత్రం రిజిస్టర్‌లో సంతకం పెట్టనీయడంలేదు. దీంతో 15 రోజులుగా ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే ఉన్న మున్సిపల్ ఉద్యోగుల హాజరు పట్టికలో మాత్రం సదరు ఇంజనీరు సంతకం చేయనీడం లేదు.
అసలు విషయం ఏమిటంటే...
కోదాడ మున్సిపాలిటీకి ఇటీవల ఇద్దరు ఏఈలను, ఒక టెక్నికల్ ఆఫీసర్‌ను ప్రభుత్వం కేటాయించింది. జూన్ 29న వీరు మున్సిపల్ కార్యాలయంలో రిపోర్టు చేశారు. ఆ రోజు ఈ ముగ్గురిని పాత కమిషనర్ విధుల్లో చేర్చుకున్నారు. అదే సమయంలో కోదాడలో ఏఈగా పని చేస్తున్న సత్యారావును బోడుప్పల్‌కు బదిలీ చేసింది. కాని చైర్‌పర్సన్ సదరు ఏఈ సత్యారావుని ఇక్కడే ఉండనీయ్యాలని పాత కమిషనర్‌ను కోరింది. చైర్‌పర్సన్‌తో ఉన్న వివాదంతో పాత కమిషనర్ సదరు ఏఈని వెంటనే విధులనుంచి రిలీవ్ చేశారు. కాని పాత ఏఈ సత్యారావుని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి తీసుకురావాలని పట్టుదలతో ఉన్న పెద్దలు ఒక పోస్టును ఖాళీగా చూపాలని బావించి కొత్త ఏఈ పి.గుణాకర్‌ను రిజిష్టర్‌లో సంతకం పెట్టనియ్యడం లేదని సమాచారం. కాని మరోపక్క అతడికి మాత్రం మున్సిపల్ విధులను కేటాయిస్తున్నారు.
ఈఎన్‌సీని ఆశ్రయించిన నూతన ఏఈ
ఇదీలా ఉండగా కోదాడ మున్సిపాలిటీలో కొత్తగా చేరిన ఏఈ గుణాకర్ స్థానిక అధికారుల, పాలకుల వైఖరితో బెంబేలెత్తి శుక్రవారం హైదరాబాద్‌లోని ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను ఆశ్రయించాడు. తనను విధుల్లో చేర్చుకొని రిజిస్టర్‌లో మాత్రం సంతకం చేయనియ్యడం లేదని, తనకు వేరే చోట పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం.
నా దృష్టికి వచ్చింది.. పరిశీలిస్తాను: అనురాధ, మున్సిపల్ ఏడీ
కోదాడలో కొత్త ఏఈని విధుల్లో చేర్చుకొని సంతకం చేయనీయకం పోవడంపై నాకు కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై స్థానిక అధికారులతో మాట్లాడి త్వరలో సమస్యను పరిష్కరిస్తాము.