అనకాపల్లి అర్బన్, న్యూస్‌లైన్ : పురపాలక సంఘం అభివృద్ధిలో తీవ్ర జాప్యం కారణంగా ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన ఎస్.మురళీధరరావును ప్రభుత్వం సరెండర్ చేసింది. ఆయన స్థానంలో గాజువాక జోనల్ కమిషనర్ శ్రీనివాసరావును నియమించింది. రెవెన్యూ పరిపాలనా విభాగానికి చెందిన మురళీధరరావును ఏడాది పాటు ఇన్‌చార్జి కమిషనర్‌గా అనకాపల్లి మున్సిపాల్టీకి ప్రభుత్వం నియమించింది.
ఈ కాలంలో వివిధ రాజకీయ పక్షాల నాయకులతో వివాదాలు, పట్టణ అభివృద్ధిలో తీవ్ర జాప్యం వంటి కారణాల రీత్యా ఇటీవల ప్రభుత్వం కమిషనర్ బాధ్యతల నుంచి మురళీధరరావును తొలగిస్తూ సరెండర్ చేసింది. ఇదే మున్సిపాల్టీలో గతంలో పనిచేసిన వెంకటేశ్వరరావు, అప్పలనాయుడులను కూడా ప్రభుత్వం సరెండర్ చేసిన విషయం తెలిసిందే. అనకాపల్లి మున్సిపాల్టీని ఇటీవల గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయడంతో చిట్టచివరి కమిషనర్‌గా పనిచేస్తూ సరెండర్ అయిన వ్యక్తిగా మురళీధరరావు నిలిచిపోయారు. అయితే రెవె న్యూ విభాగానికి చెందిన మురళీధరరావు తిరిగి తన మాతృసంస్థకు వెళ్లిపోయినట్లు విశ్వసనీయంగా తెలిసింది.