చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో కంప్యూటర్లు, ఫ్యాన్లు జప్తు చేసేందుకు గురువారం న్యాయశాఖ అధికారులు, సిబ్బంది నోటీసులతో రావడం అధికారులను పరుగులు పెట్టించింది. ఓ కేసులో న్యాయవాది ఫీజును ఇవ్వనందుకు కార్పొరేషన్‌కు సంబంధించిన సామగ్రిని జప్తు చేయడానికి న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడమే ఇందుకు కారణం.
చిత్తూరు కార్పొరేషన్‌కు 2002-2005 మధ్య కాలంలో మునిసిపల్ స్టాండింగ్ కౌన్సిల్ (ఎంఎస్‌సీ) ఏపీ రఘుపతి పనిచేశారు. ఈ కాలంలో కార్పొరేషన్ తరపున ఆస్తిపన్ను కేసులు ఈయన వాదించారు. అందుకు కార్పొరేషన్ రుసుము చెల్లించలేదు. దీంతో తనకు రూ.3.30 లక్షల ఫీజులు, వడ్డీ చెల్లించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం రఘుపతికి రూ.3.60 లక్షలు చెల్లించాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో చిత్తూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి న్యాయమూర్తి సత్యప్రభాకరరావు తీర్పునిచ్చారు.
అయితే, ఆ తీర్పును అమలు చేయలేదంటూ, ఫీజు ఇవ్వలేదని కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని రఘుపతి మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కార్పొరేషన్ కార్యాలయంలో 20 కంప్యూటర్లు, 20 ఫ్యాన్లు జప్తు చేయాలని న్యాయమూర్తి మురళీకృష్ణ ఈనెల 6న తీర్పునిచ్చారు. న్యాయస్థానం ఆదేశాలతో న్యాయశాఖ సిబ్బంది కార్పొరేషన్ అధికారులకు జప్తు నోటీసులు అందచేశారు. చివరికి బకాయి చెల్లిస్తామంటూ కార్పొరేషన్ అధికారులు సంజాయిషీ ఇవ్వడంతో జప్తు వాయిదా పడింది.