హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ వి.రామసుబ్రమణియన్ ప్రమాణం చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే మంగళవారం ఉదయం ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు, జస్టిస్ రామసుబ్రమణియన్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
అనంతరం న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావులతో కలిసి ఆయన కేసుల విచారణ చేపట్టారు. మద్రాసు హైకోర్టు నుంచి ఉమ్మడి హైకోర్టుకు జస్టిస్ రామసుబ్రమణియన్‌ను బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
జస్టిస్ రామసుబ్రమణియన్ 1958 జూన్30న జన్మించారు. మద్రాసు వివేకానంద కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. సీనియర్ న్యాయవాదులు కె.సార్వభౌమన్, టి.ఆర్.మణిల వద్ద న్యాయ మెళకువలు నేర్చుకున్నారు . 2006 జూలై 31న మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు . 2009 నవంబర్ 9న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ రామసుబ్రమణియన్‌కు మంచి వక్తగా పేరుంది.