మున్సిపల్ కార్యాలయ ఆవరణలోనే వంటలు చేస్తున్న బాధితులు
ధర్మవరం : ‘మాకు ఇంటి స్థలం చూపి ఇంటి నిర్మాణం చేసే వరకు మేము మున్సిపల్ కార్యాలయం ఆవరణంలోనే నివసిస్తాం. వంటా ఇక్కడే.. స్నానాలు ఇక్కడే.. నిద్రించేది ఇక్కడే.. చివరికి తమ పిల్లలకు పాఠశాలలకు పంపాలన్నా ఇక్కడి నుంచే పంపిస్తాం’ అంటూ పట్టణంలోని లక్ష్మీనగర్‌లో ఇళ్లు కోల్పోయిన బాధితులు చెబుతున్నారు. పట్టణంలోని లక్ష్మీనగర్‌లో మున్సిపల్ అధికారులు వాటర్ ట్యాంక్ నిర్మించాలని అక్కడ కొన్నేళ్లుగా నివసిస్తున్న వారిని బుధవారం పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు ఇళ్లను జేసీబీలతో కూల్చేసిన విషయం తెలిసిందే.
ఇళ్లులేక రోడ్డున పడ్డ బాధితులు తమ సామాన్లను తీసుకుని మున్సిపల్ కార్యాలయం ఆవరణంలోకి చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయం గేట్ వద్దనే స్టౌవ్‌లు పెట్టుకుని వంటా వార్పు చేసుకుంటున్నారు. బుధవారం రాత్రి కార్యాలయం ఆవరణంలోనే నిద్రించిన బాధితులు గురువారం ఉదయం కూడా అక్కడే స్నానాలు చేశారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపించారు. వంటా వార్పు అక్కడే చేసుకున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు కార్యాలయానికి రావడానికి వెనుకంజ వేసి ఎవరూ కార్యాలయంలోకి రాలేదు. పట్టణ పోలీసులు వచ్చి మీకు న్యాయం జరుగుతుందని మీరు మున్సిపల్ కార్యాలయం నుంచి వెళ్లిపోవాలని సర్దిచెప్పినా వారు వినలేదు. తమకు న్యాయం జరిగే వరకు మున్సిపల్ కార్యాలయంలోనే నివసిస్తామని బాధితులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment