సాక్షి, అనంతపురం : జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు బుధవారం చేపట్టిన ‘సమైక్య సమర దీక్ష’ గురువారం రెండో రోజు కొనసాగింది. సమైక్య రాష్ట్రం కోరుతూ చేపట్టిన దీక్షకు ప్రజాదరణ, మద్దతు వెల్లువెత్తింది. దీక్షా శిబిరాల్లో అదే ఊపు.. అదే జోరు కొనసాగింది. సమైక్యాంధ్ర నినాదాలతో దీక్షా శిబిరాలు మార్మోగాయి. వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల దీక్షకు కార్మిక, కర్షక, ప్రజాసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీలు మద్దతు తెలిపాయి. జిల్లా వ్యాప్తంగా గురువారం 1033 మంది నేతలు, కార్యకర్తలు దీక్షల్లో పాల్గొన్నారు.
రాయదుర్గంలో.. స్థానిక పాత మునిసిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన శిబిరంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగింది. ఎమ్మెల్యే ఆమరణ దీక్షకు మద్దతుగా పార్టీకి చెందిన 15 మంది నాయకులు, కార్యకర్తలు ఇదే శిబిరంలో రిలే దీక్షలు చేశారు. ఎమ్మెల్యే దీక్షకు పార్టీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, నాయకులు మీసాల రంగన్నతో పాటు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు, రైతులు, ఐకేపీ మహిళలు, విద్యార్థి సంఘాలు, ముస్లింలు, ఎన్‌జీఓలు, మున్సిపాలిటీ, ఉపాధ్యాయ, రాజకీయ జేఏసీ నాయకులు, మొబైల్, క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు మద్దతు తెలిపారు.
హిందూపురంలో.. స్థానిక అంబేద్కర్ సర్కిల్‌లో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగింది. మద్దతుగా చిలమత్తూరు నాయకులు మగ్బూల్‌సాబ్, టేకలూరు సర్పంచ్ జబీఉల్లా, నాయకులు పీఎస్ వేణుగోపాల్‌రెడ్డి, దాదాపీర్, ఆమీర్‌ఖాన్, సయ్యద్ అన్వనర్ ఆమరణ దీక్షలు కూడా రెండో రోజు కొనసాగాయి.
వీరితో పాటు మరో 30 మంది పార్టీ కార్యకర్తలు ఇదే శిబిరంలో రిలేదీక్ష చేశారు. కాగా వీరి దీక్షలకు పార్టీ సీజీసీ సభ్యుడు గిర్రాజు నగేష్, సమన్వయకర్త ఇనయతుల్లా, నాయకులు నవీన్‌నిశ్చల్, డాక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.
రాప్తాడులో.. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన శిబిరంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గురువారం ఆమరణ దీక్ష చేపట్టారు. ఈయనకు మద్దతుగా జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు వెన్నపూస రవీంద్రరెడ్డితో పాటు మరో 20 మంది ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా.. మరో 40 మంది రిలే దీక్ష చేశారు. అంతకుముందు ప్రకాష్‌రెడ్డి వేలాది మంది పార్టీ శ్రేణులతో కలసి రాప్తాడులో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకర్‌నారాయణ, సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత, గిర్రాజు నగేష్, కళ్యాణదుర్గం సమన్వయకర్త ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ బోరంపల్లి అంజినేయులు, జిల్లా సేవాదళ్ కన్వీనర్ మిద్దె భాస్కర్‌రెడ్డి తదితరులు మద్దతు తెలిపారు.
అనంతపురంలో.. సుభాష్‌రోడ్డులోని వైఎస్సార్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి చేపట్టిన దీక్ష రెండో రోజూ కొనసాగింది. గురునాథరెడ్డికి మద్దతుగా బోయ తిరుపాలు, మారుతీ నాయుడు, కొర్రపాడు హుసేన్‌పీరా, డాక్టర్ వైడీ వర్మ దీక్షలు కొనసాగించారు. వీరి దీక్షలకు మద్దతుగా 12 మంది రిలేదీక్ష చేశారు.
పార్టీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డిలతో పాటు పార్టీ లీగల్‌సెల్ జిల్లా కన్వీనర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు ఎమ్మెల్యే దీక్షకు మద్దతు తెలిపారు. అధికారుల జేఏసీ అధ్యక్షుడు డీఆర్‌ఓ హేమసాగర్, రమణారెడ్డి మద్దతు ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగులు, విద్యాసంస్థలు యాజమాన్యం, విద్యార్థులు, గుంతకల్లు రిటైర్డ్ డీఎస్పీ వన్నూరు సాహెబ్, కణేకల్లు మోహన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.
తాడిపత్రిలో.. స్థానిక వైఎస్సార్ సర్కిల్‌లో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వి.ఆర్.రామిరెడ్డి చేపట్టిన 48 గంటల దీక్ష రెండో రోజు కొనసాగింది. ఈయనకు మద్దతుగా మరో ఏడుగురు దీక్ష కొనసాగించగా.. 8 మంది రిలేదీక్షలు చేశారు.
కదిరిలో.. స్థానిక మారుతీ సర్కిల్‌లో పార్టీ సమన్వయకర్తలు ఎస్‌ఎండీ ఇస్మాయిల్, మహమ్మద్‌షాకీర్‌లతో పాటు వీరికి మద్దతుగా పట్టణ, రూరల్ కన్వీనర్లు చాంద్‌బాషా, లోకేశ్వరరెడ్డి, పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల కమిటీ సభ్యుడు సుధాకర్‌రెడ్డి, కేఎం ఖాదర్‌బాషా, జేకే జాఫర్‌ఖాన్, నూర్‌మహమ్మద్, జిలాన్‌బాషా చేపట్టిన 36 గంటల దీక్ష గురువారం సాయంత్రం విరమించారు.
వీరితో పాటు రిలేదీక్ష చేపట్టిన 20 మంది కూడా దీక్ష విరమించారు. సెయింట్ మేరీ విద్యార్థులు సాయంత్రం 5 గంటలకు దీక్షాపరులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
ఉరవకొండలో.. స్థానిక క్లాక్ టవర్ సర్కిల్‌లో సీఈసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన 30 గంటల దీక్ష గురువారం సాయంత్రం విరమించారు. విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా దీక్ష చేపట్టిన ఉరవకొండ, బెళుగుప్ప, కూడేరు, విడపనకల్లు మండలాల కన్వీనర్లు సుంకన్న, రామాంజినేయులు, రామచంద్ర, హనుమంతు కూడా దీక్ష విరమించారు. వీరికి మద్దతుగా గురువారం 800 మంది రిలేదీక్ష చేశారు. సాయంత్రం 4 గంటలకు ఉరవకొండకు చెందిన స్వాతంత్య్ర సమరయోధురాలు ఎంసీ ముత్యాలమ్మ దీక్షాపరులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
కళ్యాణదుర్గంలో.. స్థానిక గాంధీ సర్కిల్‌లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తిప్పేస్వామి చేపట్టిన 30 గంటల దీక్ష గురువారం సాయంత్రం విరమించారు. మద్దతుగా మరో 50 మంది రిలేదీక్ష చేశారు. సాయంత్రం ఐదు గంటలకు సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, నాయకుడు మీసాల రంగన్న నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
ఓడీ చెరువులో.. పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఓడీ చెరువులో పార్టీ నాయకులు డాక్టర్ హరికృష్ణ, ఓడీ చెరువు మండల కన్వీనర్ శ్రీనివాస్‌రెడ్డి, బయపురెడ్డి, తిప్పేపల్లి పంచాయతీ సర్పంచ్ సూర్యనారాయణరెడ్డి, ఓడీసీ సింగిల్ విండో ఉపాధ్యక్షుడు మధుసూదన్‌నాయుడు, పార్టీ మైనార్టీ మండల కన్వీనర్ వెల్డింగ్ బాషా, జేకే పల్లి సర్పంచ్ రాజప్పనాయుడు చేపట్టిన 36 గంటల దీక్ష గురువారం సాయంత్రం 5 గంటలకు విరమించారు. వీరికి మద్దతుగా పది మంది రిలేదీక్ష చేశారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి దీక్షాపరులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
పెనుకొండలో.. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సానిపల్లి మంగమ్మ చేపట్టిన 30 గంటల దీక్ష గురువారం సాయంత్రం విరమించారు. ఈమెకు మద్దతుగా పార్టీ నాయకులు దాదూ, సరస్వతి, సుశీలమ్మ, మల్లిక, గజేంద్ర, గోవిందు, అమీర్ చేపట్టిన దీక్ష కూడా విరమించారు. సాయంత్రం 4 గంటలకు కిసాన్‌సెల్ జిల్లా కన్వీనర్ జీవీపీ నాయుడు జిల్లా కమిటీ సభ్యులు ఆదినారాయణరెడ్డి, లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి దీక్షాపరులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
గుంతకల్లులో.. స్థానిక పొట్టి శ్రీరాములు సర్కిల్‌లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి చేపట్టిన 36 గంటల దీక్ష గురువారం రాత్రి 9 గంటలకు విరమించారు. ఈయనకు మద్దతుగా రెండో రోజు పార్టీకి చెందిన 48 మంది కార్యకర్తలు, నాయకులు రిలేదీక్ష చేశారు. వీరికి సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. వీరికి మద్దతుగా గుత్తిలో వైఎస్సార్‌సీపీ మునిసిపల్ అధ్యక్షుడు వేణు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సీవి రంగారెడ్డి జలదీక్ష చేశారు.
శింగనమలలో.. స్థానిక రామాలయం ఎదుట ఏర్పాటు చేసిన శిబిరంలో దీక్ష చేపట్టిన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డి చేపట్టిన 36 గంటల దీక్ష గురువారం సాయంత్రం విరమించారు. ఈయనకు మద్దతుగా మరో 23 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన దీక్ష కూడా విరమించారు. రాత్రి 8 గంటలకు సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అంతకుముందు జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వీరికి సంఘీభావం తెలిపారు.
సడలని దీక్ష
Published Fri, Oct 4 2013 3:16 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement