సాక్షి, అనంతపురం : జిల్లాలో ఎన్నికల కోలాహలం ముగియడంతో కుర్చీ పోరు ప్రారంభమైంది. రాష్ట్రంలో 1987లో మొదటి సారి మునిసిపల్, ప్రాదేశిక ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఈసారి వాటితో పాటు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. వీటన్నింటి ఫలితాలు ఒకదాని వెనుక ఒకటి వెలువడ్డాయి. ఒకేసారి అధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులు కొలువు దీరనున్నారు. మూడున్నరేళ్లుగా మునిసిపాలిటీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్‌లలో ప్రత్యేకాధికారుల పాలన సాగుతూ వచ్చింది. జూన్ 2 తరువాత సీమాంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకాధికారుల పాలనకు తెరపడి ప్రజాప్రతినిధుల పాలన రానుంది. మరో విశేషమేమిటంటే కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రంలో తొలి ప్రజాప్రతినిధులుగా కూడా వీరు ఘనత సాధించబోతున్నారు.
మేయర్ పీఠాన్ని అధిష్టించేదెవరో?
పరోక్ష పద్ధతిపై ఎన్నుకునే పదవులపై నేతలు కన్నేశారు. ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. ఎన్నికలకు ముందే అనంతపురం నగర పాలక సంస్థ మేయర్ పదవికి 20వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మదమంచి స్వరూప పేరును టీడీపీ ఖరారు చేసింది. అయితే ప్రస్తుతం ఈ పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరి.. నాలుగో డివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందిన శ్రీదేవిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టేందుకు ఆమె భర్త కోగటం విజయభాస్కర్‌రెడ్డి జేసీ సోదరుల ద్వారా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు బలిజ సామాజిక వర్గానికి చెందిన గుజిరీ గోపాల్ తన భార్య పద్మావతికి పదవి ఇప్పించేందుకు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే.. మదమంచి స్వరూపకు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఓ సీనియర్ ఐపీఎస్ అధికారితో బంధుత్వం ఉండడంతో మేయర్ పదవి ఆమెకే దక్కవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 33వ డివిజన్ కార్పొరేటర్ గంపన్న ఉప మేయర్ పదవిపై కన్నేశారు.
మునిసిపాలిటీల్లోనూ అదే పోటీ
మునిసిపాలిటీల్లోనూ పదవుల కోసం చాలా మంది పోటీపడుతున్నారు. హిందూపురంలో 38 వార్డులకు గానూ 19 వార్డులు కైవసం చేసుకున్న టీడీపీ.. చైర్మన్ అభ్యర్థిగా వేవిళ్ల లక్ష్మిని ఖరారు చేసింది. వైస్ చైర్మన్ స్థానానికి మాజీ వైస్ చైర్మన్ రోషన్‌అలీ, జేపీకే రాము, ఎస్సీ సామాజిక వర్గం నుంచి రామమూర్తి, బీసీ సామాజికవర్గం నుంచి నంజప్ప పోటీపడుతున్నారు. గుంతకల్లు మునిసిపాలిటీలో 37 వార్డులకు గానూ 22 వార్డులను టీడీపీ దక్కించుకుంది.
ఇక్కడ చైర్మన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో 11వ వార్డు కౌన్సిలర్ కోడెల అపర్ణ, 31 వార్డు కౌన్సిలర్ సుజాత పోటీపడుతున్నారు. వైస్ చైర్మన్ రేసులో 30వ వార్డు కౌన్సిలర్ అంజి ఉన్నారు. రాయదుర్గం మునిసిపాలిటీలో 31 వార్డులు ఉండగా.. 27 వార్డులు టీడీపీ వశమయ్యాయి.
బీసీ జనరల్‌కు రిజర్‌వ అయిన చైర్మన్ పీఠం కోసం టంకశాల హనుమంతు, రాజశేఖర్, వరాల పురుషోత్తం పోటీ పడుతున్నారు. అయితే.. తొలి నుంచి పోటీలో ఉన్న 8వ వార్డు కౌన్సిలర్ ముదిగల్లు రాము ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే రాము భార్య జ్యోతిని కౌన్సిలర్‌గా గెలిపించి చైర్మన్ పీఠం కట్టబెట్టడానికి దీపక్‌రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కళ్యాణదుర్గం మునిసిపాలిటీలో 23 వార్డులుండగా టీడీపీ 20 దక్కించుకుంది. చైర్మన్ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో 7వ వార్డు కౌన్సిలర్ వైసీ రమేష్, 15వ వార్డు కౌన్సిలర్ రామలక్ష్మి (గోవిందప్ప భార్య) పోటీ పడుతున్నారు. వైస్ చైర్మన్ రేసులో శ్రీనివాస్‌రెడ్డి, అబ్దుల్హ్రీం ఉన్నారు.
పుట్టపర్తి నగర పంచాయతీలో 20 వార్డులు ఉండగా.. టీడీపీ 15 కైవసం చేసుకుంది. చైర్మన్ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో 4వ వార్డు కౌన్సిలర్ బెస్త చలపతి, 2వ వార్డు కౌన్సిలర్ పీసీ గంగమ్మ పోటీలో ఉన్నారు. వైస్ చైర్మన్ కోసం 6వ వార్డు కౌన్సిలర్ కడియాల రాము, 20వ వార్డు కౌన్సిలర్ వారాధిగారి సుబ్బమ్మ పోటీ పడుతున్నారు. మడకశిర నగర పంచాయతీలో 20 వార్డులు ఉండగా టీడీపీ 16 కైవసం చేసుకుంది. ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయిన చైర్మన్ పదవికి 17వ వార్డు కౌన్సిలర్ శరణ్య, 15వ వార్డు కౌన్సిలర్ రాధమ్మ, 5వ వార్డు కౌన్సిలర్ ప్రకాష్ పోటీపడుతున్నారు.
కుర్చీ పోరు
Published Sun, May 25 2014 2:06 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement