సాక్షి, అనంతపురం : స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలు గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ప్రశాంతంగా ముగియడంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అయితే.. ఫలితాలు వెలువడిన తర్వాత గ్రామాల్లో అసలు ‘రాజకీయం’ మొదలైంది. ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధికారం వచ్చేసిందన్న అహంతో రెచ్చిపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై భౌతిక దాడులకు దిగుతున్నారు. ఆస్తులను నష్టపరుస్తున్నారు.
ఏజెంట్లుగా కూర్చొన్నారని ఒక చోట, ఆ పార్టీకి ఓట్లు వేశారని మరో చోట... ఇలా ఒక్కో గ్రామంలో ఒక్కో కారణంతో ‘టార్గెట్’ చేస్తున్నారు. దాడులను ఆపి తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు స్పందించడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
మరీ ముఖ్యంగా తాడిపత్రి, రాప్తాడు, కదిరి, ధర్మవరం నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో టీడీపీ శ్రేణుల ఆగడాలు శ్రుతిమించాయి. ఇటీవల తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లిలో బాణాసంచా కాల్చొద్దన్నందుకు చిన్న బాలన్న, చంద్రశేఖర్‌రెడ్డి అనే వారిపై దాడి చేశారు. వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపారనే అక్కసుతో ఆత్మకూరు మండలం పి.సిద్దరాంపురంలో రామాంజి, ఎర్రిస్వామి, సంజన్నలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
నల్లచెరువు మండలం గొర్లవాండ్లపల్లిలో మారెమ్మ దేవాలయం అభివృద్ధికి టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ రూ.3 లక్షల విరాళం ప్రకటించారు. మొదటి దఫా రూ.లక్ష ఇచ్చారు. మిగిలిన మొత్తం అడిగినందుకు ‘టీడీపీకి ఓట్లు వేయకుండా డబ్బు అడుగుతారా’ అంటూ ఆ పార్టీ కార్యకర్తలు గ్రామానికి చెందిన నరసింహులు, వెంకటరమణపై దాడి చేశారు.
ఏజెంట్‌గా కూర్చొన్నారనే ఉద్దేశంతో యాడికి మండలం వెంగన్నపల్లిలో భాస్కర్‌రెడ్డిపై దాడి చేశారు. టీడీపీకి ఓటు వేయలేదనే కారణంతో ఎన్‌పీ కుంట మండలం జౌకల గ్రామానికి చెందిన బాబురెడ్డికి మాజీ సర్పంచ్ హనుమంతరెడ్డి ఫోన్ చేసి చంపుతామంటూ బెదిరించారు. ఆపై దాడి కూడా చేశారు. బత్తలపల్లి మండలం రామాపురంలో బాకీ విషయంలో గొడవ జరగ్గా, దానికి రాజకీయ రంగు పులిమి హరేరాం, రామాంజనే యులు అనే వ్యక్తులపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు భౌతిక దాడులకు పాల్పడ్డారు.
ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి విజయం సాధించ డాన్ని జీర్ణించుకోలేక కూడేరు మండలం ముద్దలాపురం గ్రామానికి చెందిన మదన్‌మోహన్‌రెడ్డిపై పయ్యావుల కేశవ్ వర్గీయులు దాడి చేశారు.
వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారన్న కోపంతో కుందుర్పి మండలం బోదపల్లికి చెందిన కావెలమ్మ గుడిసెకు, తాడిమర్రి మండలం పూల ఓబయ్యపల్లికి చెందిన పుల్లారెడ్డి గడ్డివామికి నిప్పుపెట్టారు. పెద్దవడుగూరు మండలం రావులుడికి, భీమునిపల్లికి చెందిన రమేష్, శ్రీనివాస్ అనే రైతుల తోటలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేశారు. ఇలా జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతూనే ఉన్నాయి.
బరి తెగింపు
Published Wed, May 21 2014 2:07 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement