
డిగ్రీ ఉంటేనే ఓటు
సొంత ఇల్లు ఉన్నా ఓకే...
1934 మొదటి కార్పొరేషన్ సభ్యులు 30 మందే..
1937 అయ్యంగార్ కమిటీతో మార్పులు
1965 అమల్లోకి మున్సిపాలిటీ చట్టం
► ఇప్పుడు 18 ఏళ్లు నిండితే అందరికీ ఓటు హక్కు... మరి 1934లో... గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారికి మాత్రమే ఆ భాగ్యం... కనీసం సొంత ఇల్లైనా ఉండాలి. ఓటు హక్కు కల్పించినా... ఎక్కువమంది సామాన్యులకు వేసే భాగ్యం దక్కలేదు.
► 1934 లో మొదటి కార్పొరేషన్‌లో సభ్యులు 30... ఓటర్లు 13 మందిని మాత్రమే ఎన్నుకోవాలి. మరో 13 మందిని జాగీర్ల ప్రతి నిధులుగా, నలుగురిని ప్రభుత్వ తరఫున నామినేట్ చేసేవారు. మొదట్లో కొత్వాల్ చేతుల్లో నగరం పాలన సాగింది. తర్వాత బ్రిటిష్ ఇండియా విధానాల్ని అమలు చేశారు. పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణ, మున్సిపాలిటీ ముఖ్య బాధ్యతల్ని హెల్త్ ఆఫీసర్లు, మునిసిపల్ ఇంజినీర్లు పర్యవేక్షించేవారు. కమిషనర్ ఎక్స్‌అఫీషియో సెక్రటరీగా విధులు నిర్వహించేవారు. మౌలికసదుపాయాలు కావాలంటే ప్రజలు ప్రత్యేక పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడది ఆస్తిపన్నుగా వసూలు చేస్తున్నారు. 1934కు ముందు కార్పొరేషన్‌లో కేవలం 21 మంది మాత్రమే సభ్యులుండేవారు.వీరందరిని నిజాం ప్రభుత్వమే నామినేట్ చేసేది. ప్రస్తుతం నగర్ కార్పొరేషన్‌లో సభ్యుల సంఖ్య 150 మందికి చేరింది.
1937లో అయ్యంగార్ కమిటీ...
► దీవాన్ బహదూర్ అరవమడ్ సిఫార్సు మేరకు మెరుగైన మున్సిపాలిటీ పాలనకు విధానాలు సూచించాలని నిజాం 1937లో అయ్యంగార్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ‘హైదరాబాద్ మున్సిపాలిటీ అండ్ టౌన్ కమిటీస్ యాక్ట్ (ఏ) ఆఫ్ 1941’ ను రూపొందించింది.
► నగరాన్ని రెండుగా విభజించి.... జనాభా 15 వేలకు పైగా ఉంటే సిటీ మున్సిపాలిటీ, 5 నుంచి 15 వేల వరకైతే టౌన్ మున్సిపాలిటీగా వ్యవహరించేవారు.
పురపాలనంలో ప్రజాస్వామ్యం
► 1951లో కార్పొరేషన్ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ప్రజాస్వామ్య విధానాలు అమల్లోకొచ్చాయి. కౌన్సిల్ అధికారాల అమలు, పాలన కోసం ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమించారు. పూర్తి స్థాయి మునిసిపాలిటీగా మార్చారు. 1965లో ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ అమల్లోకి వచ్చింది. పురపాలన విభాగాలన్ని ఇందులో చేర్చారు. మొత్తం 391 సెక్షన్లు రూపొందించారు.