ఐదు నిమిషాల్లో ముగించారు..
మున్సిపల్ సర్వసభ్య సమావేశం తీరు ఇదీ..
ఆదిలాబాద్ కల్చరల్: ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో మున్సిపల్ సర్వసభ్య సమావేశం మంగళవారం ఐదు నిమిషాల్లో ముగిసింది. మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీష అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ అలువేలు మంగతాయారు, మున్సిపల్ వైస్‌చైర్మన్ ఫరూక్ అహ్మద్ పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమవగానే ఉరీ ఘటనలో మృతిచెందిన అమర జవాన్‌లకు నివాళులర్పించి రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్లు అందరు ఎజెండా పాస్ చేస్తున్నామంటూ కౌన్సిల్ నుంచి వెళ్లి పోయారు. దీంతో అధికారులు సైతం వెళ్లి పోయారు. కాగా మున్సిపల్ వైస్‌చైర్మన్ ఫరూక్ అహ్మద్ టౌన్‌ప్లానింగ్ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీపీవో శ్రీనివాస్ గతంలో పని చేసిన ప్రాంతాల్లో అక్రమాలకు పాల్పడి సస్పెండ్‌కు గురయ్యారని చెప్పారు. ద్వారనగర్‌లో అక్రమంగా నిర్మాణానికి అనుమతులిచ్చారని, అన్ని సంక్రమంగా ఉన్న భవనాలకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. వారంతా మద్దతునిస్తున్నట్లు ఆరోపించారు. దీనిపై త్వరలో హైకోర్టును సంప్రదించనున్నట్లు తెలిపారు.