ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : బల్దియాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఇక నోటిఫికేషన్ రావడమే ఆలస్యం. శనివారం రాత్రి మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు ఉండగా మందమర్రికి ఎన్నికలు నిర్వహించడం లేదు. రిజర్వేషన్‌పై హైకోర్టులో కేసు కొనసాగుతుండడంతో ఎన్నికలకు పోలేదు. మిగిలిన ఆరు మున్సిపాలిటీల్లో నిర్మల్ మినహా అన్నింటి చైర్మన్ స్థానాలను మహిళ (జనరల్)గా రిజర్వేషన్ ఖరారు చేశారు.
నిర్మల్ జనరల్ (అన్ రిజర్వ్‌డ్)గా ప్రకటించారు. నాలుగు వారాల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని హై కోర్టు, సుప్రీం కోర్టు ఆదేశించడం, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్‌కు శనివారం గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో ఈసారి మున్సిపల్ ఎన్నికలు జరగడం ఖాయమైంది. చైర్మన్ ఎన్నిక ఇదివరకటిలా పరోక్షంగానే నిర్వహించనున్నారు. వార్డు రిజర్వేషన్లను గతేడాది జూలైలో ప్రకటించారు. అవే కొనసాగే అవకాశాలు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికలు జరగనుండడంతో కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకుంటున్న గల్లీ లీడర్లలో ఉత్సాహం కనిపిస్తోంది. ఇక నోటిఫికేషన్ రావడమే తరువాయి అన్నట్టు ఆశావాహులు ఎదురుచూస్తున్నారు.
మారిన నే‘తల’ రాతలు
2010 సెప్టెంబర్ 29తో పాలక వర్గాల పదవి కాలం ముగిశాక, ప్రభుత్వం పురపాలక ఎన్నికల నిర్వహణకు మొగ్గుచూపలేదు. ప్రత్యేక అధికారుల పాలన ప్రతి ఆరు నెలలకోసారి పొడగిస్తూ వచ్చింది. గత జూలైలో వార్డుల రిజర్వేషన్ ప్రకటించినా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం విడుదల కాలేదు. ఎట్టకేలకు మున్సిపల్ ఎన్నికలు జరగనుండడంతో స్థానిక నాయకుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. చైర్మన్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో కాకుండా పరోక్షంగా నిర్వహిస్తుండడంతో చైర్మన్ పదవిపై ఆసక్తి పెట్టుకున్న నేతలు తప్పనిసరి కౌన్సిలర్‌గా పోటీ చేయక తప్పని పరిస్థితి.
గతంలో ఆదిలాబాద్ బీసీ జనరల్, భైంసా బీసీ, మంచిర్యాల జనరల్, కాగజ్‌నగర్ జనరల్, బెల్లంపల్లి జనరల్‌గా ఉండగా ఈ ఐదు మున్సిపాలిటీల్లో చైర్మన్ రిజర్వేషన్ మహిళలకే కేటాయించడంతో చైర్మన్ స్థానంపై ఆశలు పెట్టుకున్న పురుష అభ్యర్థుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. కౌన్సిలర్ స్థానాల్లో 94 మహిళలకు రిజర్వ్‌డ్ అయినందున పెద్ద ఎత్తున మహిళ అభ్యర్థులు పోటీకి దిగే ఆస్కారం ఏర్పడింది. పతుల స్థానంలో సతీమణులు బరిలోకి దిగనున్నారు. చైర్‌పర్సన్ ఆశలకు పలువురు మహిళ అభ్యర్థులు బరిలోకి దిగే ఆస్కారం ఉంది. కిందటిసారి నిర్మల్ (బీసీ మహిళ) ఉండగా ఈసారి అన్ రిజర్వ్‌డ్ చేయడంతో అక్కడ పురుష అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది.
గతంలోనే వార్డుల రిజర్వేషన్
వార్డుల రిజర్వేషన్లను గత జూలైలో కలెక్టర్ జారీ చేశారు. ఇవే రిజర్వేషన్లు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సోమవారం పూర్తిప్రకటించనున్నారు. జిల్లాలో ఆరు మున్సిపాలిటీల్లో ఆదిలాబాద్‌లో 36 వార్డులు, బెల్లంపల్లిలో 34, భైంసాలో 23, కాగజ్‌నగర్‌లో 28, మంచిర్యాలలో 32, నిర్మల్‌లో 36, మొత్తంగా 189 వార్డులు ఉన్నాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు 147 వార్డులను రిజర్వ్ చేశారు. మిగిలిన 42 వార్డులు అన్ రిజర్వ్‌డ్ (జనరల్)గా ప్రకటించారు. 189 వార్డుల్లో బీసీలకు 63, మహిళలు 94, ఎస్సీలకు 27, ఎస్టీలకు 7 వార్డులను రిజర్వ్ చేశారు.
నేడు ఫొటో ఓటర్ల జాబితా ప్రదర్శన
2014 జనవరి 1 వరకు ఓటర్‌గా నమోదు చేసుకున్న వారి వివరాలతో కూడిన జాబితాను ఆదివారం అన్ని మున్సిపాలిటీల్లో ప్రదర్శించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో శనివారం అన్ని బల్దియాల్లో అధికారులు జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. తహశీల్దార్ నుంచి నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ జాబితా తీసుకుని వాటిలో నుంచి మున్సిపాలిటీ ఓటర్లను విభజించనున్నారు. ఆ జాబితాను రాత్రి వరకు తయారుచేసి ఆదివారం బల్దియాల్లో వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. ఓటరు నమోదు ప్రక్రియలో జిల్లావ్యాప్తంగా 2 లక్షల మంది కొత్తగా నమోదు చేసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ అత్యధికంగా నమోదు చేసుకున్నారు. దీంతో గత జూలైలో రూపొందించిన ఓటరు జాబితాను సవరించి కొత్త ఓటరు జాబితా విడుదల చేయనున్నారు.
‘ఆమె’కు పెద్దపీట
Published Sun, Mar 2 2014 12:38 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement