ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : ‘అమ్మా బాగున్నారా.. అన్న తిన్నవా.. ఈ మధ్య కనిపించడం లేదు..’ ఇవీ ప్రస్తుతం పట్టణంలోని వార్డుల్లో వినిపిస్తున్న పలకరింపులు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో ఆశావహులు ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కౌన్సిలర్‌గా బరిలో దిగేందుకు సిద్ధమైన అభ్యర్థులు క్షేమ సమాచారాలతో వార్డు బాట పట్టారు. ఒక్క రోజు కూడా మాట్లాడని వ్యక్తులు పిలిచి మరీ పలకరించడంతో ఓటర్లు అవాక్కవుతున్నారు.
విషయమేంటోనని ఆరా తీస్తే.. అసలు విషయం బయటపడి ముక్కున వేలేసుకుంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రతి రోజు రాత్రి ఈ పలకరింపులు సర్వసాధారణమయ్యాయి. ఎప్పుడు కనిపించి నా సరే ఏం విశేషాలు ఉన్నాయంటూ మాటలు కలిపేస్తున్నారు. మరికొంత మంది ఓ అడుగు ముందుకేసి తాను కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నానని, మీ ఓటుతోపాటు బంధువుల ఓట్లు కూడా వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నడూ ఎలాంటి సాయం చేయని వారు సైతం ఎన్నికల్లో గెలవాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అంటూ కాలనీలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇంటి ముందు వాలిపోతున్నారు. పిలవని పేరంటానికి వచ్చినట్లు.. ఎవరింట్లో ఏ శుభకార్యం ఉన్నా ముందుగానే వచ్చి అక్కడి పనులు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అభ్యర్థులు కావలెను..?
మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 36 వార్డులు ఉన్నాయి. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. వార్డుల్లో పర్యటిస్తూ ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుందనే విషయమై సర్వే చేస్తున్నారు. కొన్ని వార్డుల్లో బలమైన అభ్యర్థి దొరక్కపోవడంతో ప్రజల్లో ఎంతో కొంత పేరుండి.. పార్టీలో పనిచేసే వారిలో ఒకరికి అవకాశం కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీల పరిస్థితి ఇలా ఉంటే.. స్వతంత్ర అభ్యర్థులు చాలామందే పోటీకి ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ తరఫున అవకాశం దక్కని వారూ బరి లో నిలిచేందుకు సన్నాహా లు చేసుకుం టున్నారు.
ఓటు పలకరింపులు
Published Fri, Mar 7 2014 1:57 AM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM
Advertisement
Advertisement