ప్రణాళికలు తయారు చేయాలి
ఆదిలాబాద్ అర్బన్ : అదిలాబాద్ పట్టణ అభివృద్ది కోసం మున్సిపల్ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించి పట్టణాభివృద్ది కోసం ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ జ్యోతిబుద్ద ప్రకాష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ’అర్బన్-డే’ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంటి పన్ను వసూళ్లు, ట్రాఫిక్ సమస్యలు, మున్సిపల్ భూముల లీజులు, హరితహారం పథకం అమలు, స్వచ్చభారత్, మున్సిపల్ భూముల రక్షణకై తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానంగా అధిక మొత్తంలో ప్రాపర్టీ ట్యాక్సులు చెల్లించని వారిపై చర్యలు తీసుకొని వసూళ్లు చేయాలని మున్సిపల్ ఇంజనీర్లను, సిబ్బందిని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. స్వచ్చభారత్ పథకంలో భాగంగా పూర్తి స్థారుులో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడానికి ఎస్‌హెచ్‌జీలను భాగస్వాములను చేయాలన్నారు. సంయుక్త కలెక్టర్ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మంగతయారు, ఇఇ నాగమల్లేశ్వర్‌రావు, డీపీవో పోచయ్య, డీఎస్పీ కెఎన్. రెడ్డి, ట్రాఫిక్ సీఐ షేర్ అలీ, అధికారులు పాల్గొన్నారు.