వారి అసంతృప్తిని పరిగణనలోకి తీసుకోవద్దు
టీడీఎల్పీ సమావేశంలో సీఎం చంద్రబాబు
వందమందిలో ఒకరికి లబ్ధి కలగకుంటే ఆ ఒక్కరూ అసంతృప్తి తెలపడం సహజం
దానిని ప్రజలందరి అసంతృప్తిగా భావించొద్దు..
ఎమ్మెల్యేలకు హితబోధ
హైదరాబాద్: ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందని ఎవరో ఒకరు వ్యక్తం చేసిన అసంతృప్తిని పరిగణనలోకి తీసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. గురువారం శాసనసభ నిరవధికంగా వాయిదా పడిన అనంతరం నిర్వహించిన టీడీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలద్వారా 99 మందికి లబ్ధి చేకూరి ఒకరికి లబ్ధి కలగకుంటే ఆ ఒక్కరూ బహిరంగసభలో లేదా ఎమ్మెల్యేల పర్యటన సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేయటం సహజమన్నారు. అయితే ఆ ఒక్కరి అసంతృప్తిని ప్రజలందరి అసంతృప్తిగా భావించి ఎమ్మెల్యేలూ అదేతీరుగా మాట్లాడి ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించొద్దని సూచించారు. ప్రభుత్వ పథకాలద్వారా లబ్ధిపొందిన 99 మంది బయటికొచ్చి తమకు చేకూరిన లబ్ధిని చెప్పే పరిస్థితి లేకపోవటంతో ఒక్కరి అసంతృప్తే ప్రజల్లోకి పోతోందన్నారు. అందువల్ల లబ్ధిదారులు బయటికొచ్చి చెప్పేలా ఎమ్మెల్యేలు వారిని సంసిద్ధుల్ని చేయాలని సూచించారు. ఆర్థికపరమైన ఇబ్బందులవల్ల కొన్ని పథకాల్ని అమలు చేయలేకపోతున్నామని, త్వరలో దాన్ని అధిగమించి మిగిలిన పథకాలనూ అమలు చేస్తామని చెప్పారు.
పురపాలకలను పెంచుదాం
రాష్ట్రంలో పురపాలక సంఘాల సంఖ్యను గణనీయంగా పెంచుదామని సీఎం చెప్పారు. పట్టణీకరణ ద్వారా కేంద్రం నుంచి పెద్దమొత్తంలో నిధులు పొందవచ్చన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన అమృత్, స్మార్ట్ సిటీ పథకాల్లో తమిళనాడు నుంచి పెద్దమొత్తంలో నగరాలు, పట్టణాలు ఎంపికయ్యాయని తెలిపారు. ఇలాంటి పథకాలద్వారా భారీ మొత్తంలో నిధులు పొందేందుకు పురపాలక సంఘాల్ని పెంచటమే ఏకైకమార్గమని, త్వరలో అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యేలు వెంటనే ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
అన్నీ మాద్వారానే అందేలా చూడండి: సీఎంతో ఎమ్మెల్యేలు
ప్రభుత్వ పథకాలద్వారా ప్రజలకందే ఆర్థికపరమైన లబ్ధి అంతా తమద్వారానే చేరేలా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను కోరారు. సీఎం సహాయనిధి, ఎస్సీ,ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ల ద్వారా రుణసాయం తదితరాలన్నీ లబ్ధిదారులకు తామే అందచేస్తామన్నారు. ప్రస్తుతం ఆన్‌లై న్ విధానం ద్వారా, లేదంటే ఏజెంట్లను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అందచేస్తున్నారని, దీంతో ప్రభుత్వమే వీటిని చేస్తుందనే భావన వారిలో కలగట్లేదని తెలిపారు. లబ్ధిదారుల్లో ఆ భావన కలగాలంటే పథకాల అమలు నేరుగా తమద్వారానే జరగాలన్నారు. అందుకు సీఎం సమ్మతించారు. వివిధ పథకాలపై నిర్వహించిన సర్వేలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని సీఎం చెప్పారు. ఫించన్లపై 98 శాతం మంది సంతృప్తిగా ఉన్నారన్నారు. ఇతర పథకాలపైనా ప్రజలు గతం కంటే సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. అవినీతిలో రెవిన్యూ, పురపాలక, వైద్య, పోలీస్ శాఖలు తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయన్నారు. ఇకనుంచీ ప్రతినెలా టీడీఎల్పీ సమావేశం రాజధాని నగరం అమరావతిలో ఉంటుందని తెలిపారు.