‘మీ విభాగంలో గత ఐదేళ్లలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి పేర్లతో సహా మొత్తం వివరాలు సాఫ్ట్ కాపీలో పెట్టి పంపండి. ఎవరెవరికి ఏమేం లబ్ధిచేశామో వివరించడంతో పాటు భవిష్యత్తులో ఫలానావి చేస్తామంటూ సీఎం చంద్రబాబు డిజిటల్ సంతకంతో ప్రతి లబ్ధిదారునికి లేఖలు తయారుచేసి సమాచార పౌరసంబంధాల శాఖ/రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్)కు పంపిం చండి. గత ఐదేళ్లలో మీ శాఖ/ విభాగం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన ప్రయోజనాలపై రెండు నుంచి నాలుగు పేజీలతో బుక్‌లెట్స్/ కరపత్రాలు తక్షణమే రూపొందించి పంపండి’.
– సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసే అన్ని శాఖలకు సీఎంఓ మౌఖిక ఆదేశాలు
లబ్ధిదారులకు పంపేందుకు అన్ని శాఖల నుంచి వచ్చిన లేఖలు, ప్రచారం కోసం వచ్చిన సమాచారంతో చక్కటి డిజైన్లు, ఫొటోలతో కరప త్రాలు, బుక్‌లెట్లను రూపొందించండి. వాటిని పెద్దఎత్తున ముద్రించి విస్తృత ప్రచారానికి రూపకల్పన చేయండి. టీడీపీకి అనుకూలంగా విజువల్ మీడియాలో ప్రచారానికి మంచి డిజైన్లతో వీడియోలు, ప్రకటనలు కూడా రూపొందించండి. ఇందుకోసం అనుభవజ్ఞులైన ప్రైవేటు వ్యక్తుల సేవలను వినియోగించుకోండి. సమయం ఎక్కువ లేనందున త్వరగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలి.
– సమాచార పౌర సంబంధాల శాఖ, ఆర్టీజీఎస్‌కు సీఎంఓ మౌఖిక సందేశం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఈ ఆదేశాలతో అన్ని సంక్షేమ శాఖల కార్యాలయాల్లో రోజువారీ కార్యక్రమాలు ఎక్కడివక్కడ స్తంభించిపోయాయి. వివిధ సమస్యల పరిష్కారం, దరఖాస్తుల సమర్పణ, సందేహ నివృత్తి కోసం వచ్చే లబ్ధిదారులతో కనీసం మాట్లాడకుండానే సిబ్బంది వారిని వెనక్కు పంపుతున్నారు. ‘తన దరఖాస్తులో చిన్న తప్పు ఉందని, దానిని సవరించాలని ప్రసాదరావు అనే ఓ నిరుపేద విద్యార్థి సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయానికి ఇటీవల వెళ్లగా.. ‘నెట్ పనిచేయడంలేదు. నాలుగు రోజుల తర్వాత రండి’.. అని తిప్పి పంపారు. ఆయన అక్కడే తనకు తెలిసిన ఉద్యోగి దగ్గరకు వెళ్లి వాకబు చేస్తే.. ‘సీఎంఓ ముఖ్యమైన సమాచారం అడిగింది. అందువల్ల అందరూ ఆ పనిలో ఉన్నారు. ఇతర పనులేవీ చూడరు. నాలుగు రోజుల తర్వాత వస్తే మాట్లాడతా..’ అని చెప్పి పంపించారు. ఇది ఒక్క ప్రసాదరావు పరిస్థితే కాదు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అన్ని శాఖల్లో ఇదే పరిస్థితి.
ముందు నుయ్యి.. వెనక గొయ్యి
ఇదే విషయమై ఒక ఐఏఎస్ అధికారి వద్ద ప్రస్తావించగా.. ‘ఏం చేస్తాం. మేం అశక్తులుగా మారాం. కార్యాలయాలకు వచ్చిన వారి సమస్యలు తీర్చాల్సిందిపోయి టీడీపీ సేవలో తరించాల్సి వస్తోంది. ఐదేళ్లలో ఏయే పథకాల కింద ఎంతమంది లబ్ధిపొందారో గణాంకాలు చెప్పమంటే చెప్పగలం కానీ.. ఎవరెవరు ఎంతెంత ప్రయోజనం పొందారో పేర్లతో సహా ఇవ్వాలంటే పాత డేటా అంతా వెతకాలి. కంప్యూటర్లలో ఉన్నా అంతా ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. సీఎంఓ వారు తెలుగులో పంపాలని ఆదేశించారు. దీనిని ట్రాన్స్‌లేట్ చేయాలి. సిబ్బంది కొరతతో ఇప్పటికే అల్లాడుతుంటే ఇప్పుడు ఈ సంబంధంలేని పని పెట్టారు. మా పరిస్థితి ముందు గొయ్యి.. వెనక నుయ్యి అన్నట్లుగా ఉంది’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
ఇంతటి బరితెగింపు ఎన్నడూ చూడలేదు
‘అధికార పార్టీకి సీఎంఓ అధికారులు అనుకూలంగా ఉండటం సహజమే. అయితే, ఎన్నికల్లో పార్టీ ప్రచార కార్యక్రమాలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకునేంత బరితెగింపు గతంలో ఎన్నడూలేదు. ఆర్టీజీఎస్‌లో కొంతమంది కన్సల్టెంట్లు కూర్చుని ప్రచార సామగ్రికి డిజైన్లు రూపొందిస్తున్నారు. ఇప్పట్లా ప్రభుత్వ ఆఫీసులను ప్రైవేటు సంస్థలుగా, అధికార పార్టీ ప్రచార కార్యాలయాలుగా మార్చిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు’.. అని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.
సర్కారు సొమ్ముతో టీడీపీ ప్రచారమా!?
ప్రభుత్వ సొమ్ముతో టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. ఎన్నికల షెడ్యూలు వచ్చిన వెంటనే ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి పేరు, ఫొటోతో ప్రభుత్వం లేఖలు పంపించరాదు. ఇలా పంపడం ఎన్నికల నిబంధనావళిని తుంగలో తొక్కడమే. అయితే, సీఎంఓ మౌఖిక ఆదేశాల మేరకు ఈ ఐదేళ్లల్లో ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన వారికి ముఖ్యమంత్రి డిజిటల్ సంతకాలతో కూడిన లేఖలను ఇంటింటికీ పంచుతున్నారు. దీనిని అధికారులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment