సొమ్మొకరిది.. సోకొకరిది
సొమ్మొకరిది.. సోకొకరిది
Published Sat, Apr 15 2017 8:44 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
► 20 ఏళ్లుగా బడాబాబుల చేతుల్లో మున్సిపల్ షాపులు
► కార్పొరేషన్‌కు తక్కువ అద్దె చెల్లింపు
► బయటి వ్యక్తుల నుంచి ఎక్కువ బాడుగ వసూళ్లు
నెల్లూరు సిటీ: సొమ్మొకొరిది.. సోకొకరిది అన్నట్లుగా తయారైంది నగరపాలక మున్సిపల్ షాపుల పరిస్థితి. 20 ఏళ్లకుపైగా కొందరి కబంధ హస్తాల్లో మున్సిపల్ షాపులు కొనసాగుతున్నాయి. షాపు లీజుదారులకు అధికార పార్టీ నేతల అండదండలు కొనసాగుతున్నాయి. ఫలితంగా రెవెన్యూకు రావాల్సిన ఆదాయానికి గండికొడుతున్నారు. మున్సిపల్ షాపులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సైతం వెనుకంజ వేస్తున్నారు.
కార్పొరేషన్ పరిధిలో 14 మున్సిపల్ కాంప్లెక్స్‌లు
కార్పొరేషన్ పరిధిలోని 14 మున్సిపల్ కాంప్లెక్స్‌లలో 234 షాపులు ఉన్నాయి. వీటిలో 64 షాపులు 20 ఏళ్లకు పైగా కొందరి చేతుల్లో ఉన్నాయి. మరో 100 నుంచి 120 షాపులకు పదేళ్లుగా కొందరు బినామీలుగా వ్యవహరిస్తున్నారు. షాపు లీజుకు తీసుకొని మూడేళ్లు దాటితే వేలం నిర్వహించాలనే నిబంధన అమలు కావడంలేదు. కొన్నిసార్లు వేలం నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులు యత్నించగా, బడాబాబులు, అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. దీంతో వేలం నిర్వహించకుండా లీజుదారుడికే కట్టబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
లీజుదారుడొకరు.. బాడుగకు ఉండేది మరొకరు
మున్సిపల్ షాపులను లీజుకు తీసుకున్న వారు మాత్రమే షాపును నిర్వహించాల్సి ఉంది. అయితే లీజుదారుడు కార్పొరేషన్‌కు తక్కువ బాడుగ చెల్లిస్తూ బయటి వ్యక్తికి ఎక్కువ బాడుగలకు ఇస్తున్నారు. చిన్నబజార్, డైకస్‌రోడ్డు, మద్రాస్ బస్టాండ్, గాంధీబొమ్మ సెంటర్‌లోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో కొందరు షాపులను వేలంలో రూ.ఐదు వేల నుంచి రూ.ఏడు వేలకు దక్కించుకొని, వేరే వ్యక్తులకు రూ.10 వేల నుంచి రూ.15 వేల బాడుగకు ఇస్తున్నారు. దీంతో కార్పొరేషన్ ఆదాయానికి రూ.లక్షల మేర గండిపడుతోంది.
వేలం నిర్వహణకు అడ్డంకులు
గతంలో కమిషనర్ మూర్తి కార్పొరేషన్ పరిధిలో 25 ఏళ్ల లీజు దాటిన 65 షాపులకు వేలం నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. వేలం తేదీని సైతం ప్రకటించారు. అయితే ఆయా షాపుల లీజుదారులు కోర్టును ఆశ్రయించడంతో ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇది జరిగి ఏడాదిన్నర కావస్తున్నా, వేలం దిశగా ముందుకెళ్లడంలేదు. ఇద్దరు రెవెన్యూ ఆఫీసర్లు విధులు నిర్వర్తిస్తుండగా, వీరిలో ఒకరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందుగా షాపును సీజ్ చేసి, వారి వద్ద నుంచి అధిక మొత్తంలో నగదును డిమాండ్ చేస్తున్నారు. తానడిగిన మొత్తాన్ని ఇస్తే షాపును తెరిచేందుకు అనుమతులు వస్తాయంటూ బెదిరింపుల పర్వానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
Advertisement
Advertisement