ఇక ‘సార్వత్రిక’ సమరం
సాక్షి, నెల్లూరు: మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు దాదాపు పూర్తవడంతో ఇక అందరి దృష్టి సార్వత్రిక సమరంపై పడింది. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు, అభ్యర్థిత్వాలు ఖరారు చేసుకున్న వారు ప్రచారంలో, టికెట్ రేసులో ఉన్నవారు లాబీయింగ్‌లో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం 11 గంటలకు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. సెలవులు మినహాయిస్తే మిగిలిన రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
నేటి నుంచి 19వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. నెల్లూరు ఎంపీ స్థానానికి సంబంధించి కలెక్టరేట్‌లో, తిరుపతి ఎంపీ స్థానానికి సంబంధించి నెల్లూరులోని జెడ్పీ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. నెల్లూరు సిటీ అభ్యర్థులు స్థానిక కార్పొరేషన్‌కార్యాలయం, కోవూరు, ఉదయగిరి, సూళ్లూరుపేట, వెంకటగిరిలకు సంబధించి అక్కడి తహశీల్దార్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు.
నెల్లూరు రూరల్, ఆత్మకూరు, గూడూరు, కావలి నియోజకవర్గాలకు సంబంధించి సంబంధిత ఆర్డీఓ కార్యాలయాల్లోనూ, సర్వేపల్లి నియోజకవర్గం అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు వెంకటాచలం తహశీల్దార్ కార్యాలయంలోనూ ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఐదు రోజులే..
నామినేషన్ల సమర్పణకు పేరుకు ఎనిమిది రోజులు సమయం ఉన్నప్పటికీ అం దులో మూడు రోజలు సెలవులు పోతున్నాయి. మిగిలిన ఐదు రోజుల్లో తమ పేరు న ఎప్పుడు మంచి ముహూర్తం ఉందోనని చూసుకునే పనిలో అభ్యర్థులు తలమునకలవుతున్నారు. మరోవైపు తమ పార్టీ అధిష్టానాల వద్ద అభ్యర్థిత్వాలు ఖరారు చేసుకున్న వారు ప్రచారంలో నిమగ్నం కాగా, ఆశావహులు మాత్రం టికెట్ రేసులో బిజిబిజీగా ఉన్నారు. అదే సమయంలో నామినేషన్లు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
రిటర్నింగ్ అధికారులు వీరే
నెల్లూరు, తిరుపతి ఎంపీ స్థానాలతో పాటు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నియమించింది. నెల్లూరు ఎంపీ స్థానానికి కలెక్టర్ ఎన్.శ్రీకాంత్, తిరుపతి లోక్‌సభకు జాయింట్ కలెక్టర్ జి.రేఖారాణి రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. నెల్లూరు సిటీకి తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్ విజయచందర్, నెల్లూరు రూరల్‌కు స్థానిక ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, ఉదయగిరికి డ్వామా పీడీ గౌతమి, వెంకటగిరికి డీఆర్‌డీఏ పీడీ చంద్రమౌళి, కోవూరుకు జెడ్పీ సీఈఓ జితేంద్ర, సర్వేపల్లికి పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కలెక్టర్ జి.మల్లికార్జున, కావలి, గూడూరు, ఆత్మకూరు నియోజకవర్గాలకు సంబంధిత ఆర్డీఓలు వెంకటరమణారెడ్డి, కె.శ్రీనివాసరావు, కోదండరామిరెడ్డి, సూళ్లూరుపేటకు నాయుడుపేట ఆర్డీఓ ఎంవీ రమణ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు.
ఖరారు కాని లెక్కింపు కేంద్రాలు
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అధికారులు ఎంపిక చేసిన కేంద్రాల వివరాలను ఇప్పటికే కలెక్టరేట్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించారు. ఎన్నికల కమిషన్ ఆమోదించిన తర్వాత ఆ వివరాలను వెల్లడించనున్నారు.