సాక్షి ప్రతినిధి, నెల్లూరు : స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే చట్టం అమలుకావడంతో గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అనేక మంది మహిళలు తెర మీదకు వచ్చారు. జిల్లాలోని 940 పంచాయతీల్లో 933 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 465 మంది మహిళా సర్పంచ్‌లు ఎన్నికయ్యారు. వీరిలో కొన్నిచోట్ల రిజర్వేషన్ల కేటగిరీలో సర్పంచ్ కుర్చీలు దక్కించుకున్న మహిళల స్థానంలో పురుషులే పాలన సాగిస్తున్నారు. మెజారిటీ పంచాయతీల్లో మాత్రం మహిళా పాలనే సాగుతోంది. ఈ పరిస్థితుల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న అన్ని పార్టీల నాయకులకు మున్సిపల్ ఎన్నికల శరాఘాతం తగిలింది.
ఈ ఎన్నికల్లో నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, గూడూరు, కావలి మున్సిపాలిటీల్లో మొత్తం 218 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 107 స్థానాలు మహిళలకు రిజర్వ్ కాగా, 111 స్థానాలు పురుషులకు దక్కాయి. ఇందులో ఆత్మకూరు, కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి చైర్‌పర్సన్ స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. గూడూరు చైర్‌పర్సన్ జనరల్, నెల్లూరు మేయర్ పదవులు బీసీ జనరల్ అయ్యాయి. ఈ రకంగా నగర, పట్టణ పాలనలో ఈ సారి మహిళలకు కీలక పాత్ర పోషించబోతున్నారు.
రిజర్వ్‌డ్ స్థానాల్లో ఆయా కేటగిరీలకు చెందిన మహిళలకు కొరత ఏర్పడటంతో రాజకీయ పార్టీలు వారినే తమ అభ్యర్థులుగా నిలిపేందుకు పోటీ పడుతున్నాయి. ఇదే సందర్భంలో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలకు కూడా రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో కూడా మహిళలు తమ సత్తా చాటబోతున్నారు. జిల్లాలో 583 ఎంపీటీసీ స్థానాలకు గాను 301 స్థానాలు మహిళలకు దక్కాయి. 46 జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలకు(జెడ్‌పీటీసీ) 23 మహిళలకు రిజర్వ్ అయ్యాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ పదవుల మీద ఆశతో రాజకీయం చేసుకుంటున్న చాలామందికి మహిళా రిజర్వేషన్లు షాక్ ఇచ్చాయి. ఇప్పటికే రాజకీయ రంగంలో వున్న వారు తమ కుటుంబ సభ్యులను బరిలోకి దించబోతున్నారు.
పాలనలో సగం
Published Sat, Mar 8 2014 2:48 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement