అధికారుల అత్యుత్సాహం
విమర్శలకు గురవుతున్న ఆక్రమణల తొలగింపు
వసూళ్ల కోసమేనని ఆరోపణలు
మంగళగిరి :ఆక్రమణల తొలగింపులో అధికారుల అత్యుత్సాహం విమర్శలకు గురవుతోంది. కొందరికి అనుకూలంగా మరి కొందరికి వ్యతిరేకంగా వ్యవహరించడమే ఇందుకు కారణం.
బేరసారాలకు వ్యూహంతో...
అయితే కొంతకాలంగా మున్సిపల్ అధికారులు పాలకులు అక్రమకట్టడాలు, అక్రమణలు తొలగింపులో వ్యవహరిస్తున్న తీరు మాత్రం కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విధంగా ఉన్నాయి. రోడ్ల ఆక్రమణలను తొలగించలేని మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది లేని అపార్ట్‌మెంట్లలోని సెల్లార్‌లో దుకాణాలను తొలగించేందుకు పూనుకోవడం అవి పట్టణంలో ఎంపిక చేసిన అపార్ట్‌మెంట్ల దుకాణాలను మాత్రమే తొలగించాలని ప్రయత్నిండం పలు అనుమానాలకు తావిస్తోంది. ముందుగా అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్ల యజమానులను ఒకరిద్దరిని తమకు అనుకూలంగా ఉన్న వారితో సెల్లార్‌లోని దుకాణాల ద్వారా తమకు ఇబ్బందులు వున్నాయని వాటిని తొలగించాలని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయించడం, అనంతరం పట్టణప్రణాళిక అధికారులను పంపి తొలగించేంచాలని ఆదేశాలు జారీచేస్తున్నట్లు సమాచారం. తొలగింపునకు వచ్చిన అధికారులు యాజమాన్యానికి కొంత సమయం ఇవ్వడం ఆసమయంలో యాజమాన్యంతో అధికారులు పాలకులు బేరాలు కుదుర్చుకుని మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గుర్తించిన అక్రమ కట్టడాలపై...
పట్టణంలో 42 కుపైగా అక్రమకట్టడాలను గుర్తించిన అధికారులు వాటిని పట్టించుకోని అధికారులు నూతనంగా కొన్ని చోట్ల నిర్మిస్తున్న భవనాల వద్ద చేస్తున్న హడావుడి ఆశ్చ్యరం కలిగిస్తోంది. అధికారపార్టీ కౌన్సిలర్లు కొందరు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా నాలుగు, ఐదు అంతస్తులు భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకోని అధికారులు సామాన్యుడు రేకుల షెడ్డు నిర్మాణానికి పునాది తీసినా అనుమతులు లేకుండా పునాది ఎలాతీస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనులు నిలుపుదల చేయిస్తున్నారు.
పాలకుల ప్రసన్నం ఉంటే...
ఇక పాలకులకు ఆమ్యామ్యా ముడితే ఎలాంటి అనుమతులు లేకున్నా నిర్మాణాలు చేస్తున్నా అటు వైపు చూడని పట్టణప్రణాళికా విభాగం అధికారులు పాలకులు తమ వ్యతిరేకులు అనుకున్న వారి భవనాల పనులు ఆపటానికి మాత్రం ఆగమేఘాలపై వెల్తుండడం విశేషం. కొద్ది రోజులుగా ఇందిరానగర్‌తో పాటు పార్కురోడ్‌లో నిర్మిస్తున్న రెండు భవనాలు యజమానులు తమను కలవలేదని వెంటనే భవననిర్మాణాలను నిలపాలని ఆదేశించడంతో అధికారులు జేసీబీలతో వెళ్లి నిర్మాణాలను కూల్చేందుకు పూనుకున్నారు. దీంతో స్థానికులు అడ్డం తిరగడం వాగ్వాదానికి దిగడం షరామామూలైంది.
సమన్యాయం పాటించాలి
పట్టణంలో అక్రమకట్టడాలన్నింటిని తొలగించాలని లేదంటే వారితో పాటు తమకు అనుమతి ఇవ్వాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో అధికారులు వెనుతిరగకతప్పట్లేదు. పట్టణంలో ప్రణాళిక ప్రకారం భవననిర్మాణాలు అధికారులు చర్యలు తీసుకోవడంలో తప్పులేదు. కాని పాలకుల అవినీతితో పాటు వారి కక్ష కట్టినధోరణిలో కొన్ని భవనాలను ఎంపిక చేసుకుని వారిని ఇబ్బంది పెట్టడం మాని, నిభందనల ప్రకారం నడుచుకుని మున్సిపల్ ఆదాయాన్ని పెంచి పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతున్నారు.