కన్నేస్తే కాజేస్తారు
భీమవరం టౌన్ : మునిసిపల్ రిజర్వ్‌డ్ స్థలాలపై భూబకాసురుల కన్ను పడింది. ఒకటా రెండా వందల కోట్ల రూపాయల విలువైన స్థలాలు ఉండటంతో వీటిని ఆక్రమించేందుకు నెమ్మనెమ్మదిగా ముందుకు వస్తున్నారు. జాగా ఉంటే పాగా వేసేద్దాం అంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
భీమవరంలో 72 స్థలాలు
భీమవరం మునిసిపాలిటీకి 72 రిజర్వ్‌డ్ స్థలాలు ఉన్నాయి. వీటి విస్తీర్ణం సుమారు 34 ఎకరాలు ఉండగా విలువ రూ.340 కోట్లకుపైనే ఉంది. పట్టణంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో కూడా ఈ స్థలాలు ఉన్నాయి. అయితే మునిసిపాలిటీ వీటిని పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆక్రమణదారుల కన్ను పడింది. ఖాళీ స్థలంలో ముందుగా రెండు గెడలు పాతడం, చిన్న బడ్డీ పెట్టడం అలాగే పాతుకుపోవడం జరుగుతుంది. తర్వాత మోటార్ సైకిళ్లు పార్కింగ్, మొక్కలు పెంపకం అంటూ ప్రారంభించి షెడ్లు వేయడం ద్వారా ఆక్రమించుకుంటున్నారు. వీటిని ఎవరైనా మునిసిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేసే వరకూ విషయం బయటకు రావడం లేదు.
చర్యలు శూన్యం
తాజాగా ఈ నెల 12న హౌసింగ్ బోర్డు 9వ వార్డులో సుమారు రూ.3 కోట్ల విలువైన 17 సెంట్ల స్థలం కబ్జాకు గురైంది. ఇక్కడ నిర్మాణం కూడా చేపట్టారు. కౌన్సిలర్ వేండ్ర విజయదుర్గ, ఆమె సోదరుడు సూర్యప్రకాశ్‌రావు సమాచారం అందించడంతో మునిసిపల్ అధికారులు స్థలాన్ని కాపాడుకోగలిగారు. ఇప్పటికే కౌన్సిల్ సమావేశాల్లో పలుమార్లు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు పట్టణంలో మునిసిపాలిటీ రిజర్వ్‌డ్ స్థలాలు, వాటికి రక్షణకు తీసుకుంటున్న చర్యలపై గళం విప్పినా పాలకుల్లో స్పందన లేదు. మునిసిపల్ స్థలాల చుట్టూ ఫెన్సింగ్‌లు వేసి, అక్కడ బోర్డులు ఏర్పాటుచేయాలని డీఎంఏ ఆదేశాలు జారీ చేసినా ఫలితం శూన్యం. ఇంతేకాకుండా స్థలాల పరిరక్షణ కోసం ఏటా బడ్జెట్‌లో లక్షలాది రూపాయలు కేటాయిస్తున్నా ఒక్క పనీ జరగడం లేదు. దీంతో స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి.
ప్రహరీలకు ప్రతిపాదనలు
మునిసిపల్ ఆస్తులను ఆక్రమించేందుకు ఎవరూ ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఒక్క సెంటు కూడా ఆక్రమణకు గురికానివ్వం. 14 ఆర్థిక సంఘం నిధులతో మునిసిపల్ రిజర్వ్‌డ్ స్థలాలకు ప్రహరీ గోడలు నిర్మించేందుకు ప్రతిపాదనలు చేస్తున్నాం.
- కొటికలపూడి గోవిందరావు , మునిసిపల్ ఛైర్మన్ , భీమవరం