కార్మికుల పొట్టకొట్టొద్దు
రిలే దీక్షలు చేపట్టిన నగరపాలక సంస్థ కార్మికులు
ఈ జీవో కార్మికుల కడుపుకొట్టేదే..
దీక్షనుద్దేశించి ప్రసంగించిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.సామ్రాజ్యం
ఒంగోలు క్రైం : మున్సిపల్, నగరపాలక సంస్థ కార్మికుల పొట్టకొట్టే జీవో నంబర్-279ని వెంటనే రద్దు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్థానిక ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయం ముందు యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలను ప్రారంభించిన యూనియన్ రాష్ర్ట అధ్యక్షురాలు కె.సామ్రాజ్యం దీక్షలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ఫెడరేషన్ పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తారన్నారు. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన జీవో 279ని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. అప్పటి నుంచి కార్మికుల పొట్టకొట్టే జీవోను రద్దు చేయాలని అనేక సార్లు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. దశలవారీగా ఆందోళనలు చేస్తున్నా కనీసం ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి.వెంకట్రావు మాట్లాడుతూ రెండు నెలల నుంచి ఆందోళనలు చేస్తున్నా చలనం లేదన్నారు. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు, మున్సిపల్ ఉన్నతాధికారులకు, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. చర్చల ద్వారా కూడా సమస్యను విన్నవించారన్నారు. దశలవారీగా ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ జిల్లా కార్యదర్శి కొర్నిపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో 13వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపడతామని, అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి స్తామని హెచ్చరించారు. ఆ తరువాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టాలని ఇప్పటికే మున్సిపల్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ(జెఏసి) నిర్ణయించిందని గుర్తు చేశారు. రిలే దీక్షల్లో యూనియన్ నాయకులు కె.గోపి, కె.చిననాగేశ్వరరావు, కె.రవి, కె.బాలకృష్ణ, కె.చినయాకోబు, కసుకుర్తి వెంకాయమ్మ, రాగిరాములు, సుజాత, ఆర్.సుందరం, వెంకటేశ్వర్లు, కె.రామకృష్ణ, టి.విజయ, కె.మోహనరావు, ఎన్.కోటయ్య, ఎస్.నాగేశ్వరరావు, మెండెం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.