మారథాన్ రన్ బహుమతి ప్రదానోత్సవంలో సీఎం చంద్రబాబు
{పారంభించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
విజయవాడ స్పోర్ట్స్ : ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను క్రీడలు, పరుగుల ద్వారా యువత సమకూర్చుకోవాల్సి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో డీప్ (డిసీజ్ ఎరాడి కేషన్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ ప్రివెన్షన్ ) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి మారథాన్ రన్ బహుమతి ప్రదానోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత రోజులో కనీసం ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల మేరకు పరిగెట్టి ఆరోగ్యవంతులు కావాలన్నారు. రన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్లు చెప్పారు. విజేతలకు నగదు చెక్కులను అందజేశారు. తొలుత రన్‌ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ప్రారంభించారు. రన్‌లో పాల్గొనేవారంతా ఉదయం ఐదు గంటలకే స్టేడియానికి చేరుకున్నారు. ఉదయం 6.15 గంటలకు హాఫ్ మారథాన్ రన్‌ను నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏడు గంటలకు కేంద్రమంత్రి ఎం.వెంకయ్య నాయుడు, రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, సినీ హీరో శర్వానంద్ జెండా ఊపి 10కే, 5కే రన్‌లను ప్రారంభించారు.
రన్‌లో పాల్గొనేవారికి టీ-షర్ట్, స్నాక్స్, టైమింగ్ చిప్‌తో కూడిన రిబ్‌ను అందజేశారు. హాఫ్ మారథాన్‌లో కొందరు ప్రొఫెషనల్ రన్నర్లతో పాటు హైదరాబాద్, ఇతర నగరాల నుంచి లాంగ్ డిస్టెన్స్ రన్నర్లు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది, రాష్ట్ర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏడున్నర వేల మంది రన్‌లో పాల్గొన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. హాఫ్ మారథాన్‌లో తక్కువ మంది పాల్గొనగా, 10కే, 5కే రన్‌లో పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు కృష్ణా, గుంటూరు కలెక్టర్లు బాబు.ఎ, కాంతిలాల్ దండే, శాప్ చైర్మన్ పీఆర్ మోహన్, యువజన, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, శాప్ ఎండీ జి.రేఖారాణి, సినీ హీరోలు రామ్, శర్వానంద్, నాగశౌర్య, చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, రన్ డెరైక్టర్లు డీప్ సంస్థ ప్రతినిధులు డాక్టర్ ఎన్.మురళి, డాక్టర్ మధు, డాక్టర్ రాకేష్, గజల్ శ్రీనివాస్, రన్ నిర్వాహక కమిటీ సభ్యుడు కె.పట్టాభిరామ్, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్.పురుషోత్తం పాల్గొన్నారు.
విజేతలు వీరే
హాఫ్ మారథాన్ రన్‌లో పురుషుల విభాగంలో లెంలెం మిక్కియాస్ (ఇథియోపియా), శ్యామల్ కమాయ్ మొహుతు (కెన్యా), బి.శ్రీను (విజయనగరం), మహిళా విభాగంలో నేహాసింగ్, జ్యోతి జె.చౌహాన్ , పద్మావతి వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. మొదటి స్థానంలో నిలిచిన వారు రూ.80 వేలు చొప్పున గెలుచుకున్నారు. హాఫ్ మారథాన్ వెటరన్ పురుషుల విభాగంలో పప్పు నారాయణ, సునీల్ గౌద్, చక్రధర్ నన్నపనేని, మహిళా విభాగంలో జాక్యులెన్ బబితా విజేతలుగా నిలిచారు. 10కే రన్‌లో మెల్ల మెర్జ్‌జీబో ఎలిము, ఇర్రిమాన్, ఖరమూర్‌సింగ్, మహిళా విభాగంలో వినయపియం, వి.ప్రియాంక, జె.సంగీత, 10కే రన్ వెటరన్ విభాగంలో ఎ.కుమార, ఎం.తియోపిలోస్, యు.ఏడుకొండలు, మహిళా విభాగంలో వి.లక్ష్మిశ్రీ, కె.జ్యోతి వరుస స్థానాల్లో నిలిచారు.
మారథాన్‌లో కలెక్టర్ కాంతిలాల్‌దండే
తాడేపల్లి రూరల్ : అమరావతి మారథాన్ రన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద ఉదయం 5.30 గంటలకు 5కె, 10కె, హాఫ్ మారథాన్ రన్ మూడు బృందాలుగా ప్రారంభమైంది. 5కె రన్ విజయవాడలో ముగియగా, 10కె, హాఫ్ మారథాన్ గుంటూరు జిల్లాలోకి ప్రవేశించాయి. జిల్లా ముఖద్వారం సీతానగరం వద్ద 10కె రన్ ముగియగా, అమరావతి కరకట్ట మార్గంలో ఉన్న ప్రకృతి ఆశ్రమం వద్ద హాఫ్ మారథాన్ ముగిసింది. హాఫ్‌మారథాన్‌లో గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే పాల్గొన్నారు. సీతానగరం ప్రకాశం బ్యారేజీ వద్ద అడిషనల్ జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరరావు, ఆర్‌డీవో భాస్కరనాయుడు, డీఈవో శ్రీనివాసులురెడ్డి, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, కమిషనర్ శివారెడ్డి, తదితరులు కలెక్టర్‌కు స్వాగతం పలికారు.
అడిషనల్ ఎస్పీ భాస్కరరావు నేతృత్వంలో డీఎస్పీ గోగినేని రామాంజ నేయులు, సీఐలు హరికృష్ణ, బ్రహ్మయ్య, ఎస్‌ఐ వినోద్‌కుమార్ తదితరులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 10.30 వరకు బ్యారేజీపై రాక పోకలు నిలిపివేయడంతో సీతానగరం, ఉండవల్లి సెంటర్, కెఎల్ కాలనీలకు చెందిన ప్రజలు, రాజధాని ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పరుగుతో ఆరోగ్యం
Published Mon, Jan 11 2016 12:55 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement