వారంలో విజయవాడ మెట్రోకు టెండర్లు
మీడియాకు వెల్లడించిన ఏపీ సీఎం
సాక్షి, విజయవాడ బ్యూరో : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సివిల్ టెండర్లను వారంలో పిలుస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడిం చారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోపు పనులు ప్రారంభించాలని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ)కి సూచించి నట్లు తెలిపారు. విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టు బాధ్యతల్ని కూడా డీఎంఆర్‌సీకే అప్పగిస్తున్నట్లు చెప్పారు. రెండు ప్రాజెక్టుల్ని 2018 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని కోరామన్నారు.
శనివారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, మెట్రో ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్‌తో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సీఎం.. రాష్ట్రంలోని రెండు మెట్రో రైలు ప్రాజెక్టులపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు సవివర నివేదికను శ్రీధరన్ ఇచ్చారని, త్వరలో దానిపై కేబినెట్‌లో చర్చించి ఆమోదిస్తామన్నారు. 42.55 కిలోమీటర్ల మేర తొలి దశలో విశాఖ ప్రాజెక్టు నిర్మాణమవుతుందని తెలిపారు. దీనికి రూ. 12,725 కోట్లు ఖర్చవుతుందని డీఎంఆర్‌సీ తన నివేదికలో పేర్కొందన్నారు. ఈ ప్రాజెక్టుకు 30.22 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉందన్నారు.
జనాభా నిబంధన సడలిస్తాం: వెంకయ్య
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, మెట్రో రైళ్లకు అనుమతివ్వాలంటే 20 లక్షల జనాభా ఉండాలనే నిబంధనను విజయవాడ, విశాఖ విషయంలో సడలిస్తామని చెప్పారు. దీనిపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ర్యాంకింగ్ లేకపోవడం వల్లనే స్మార్ట్ సిటీగా విజయవాడను ఎంపిక చేయలేక పోయామన్నారు. సమావేశంలో మెట్రో ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్, డీఎంఆర్‌సీ ఎండీ మంగూసింగ్, మంత్రి నారాయణ, విశాఖ ఎంపీ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
మమ్మల్ని ఆదుకోండి : ఏపీ సీఎంకు వినతి
సమస్యలు పరిష్కరించాలని పలువురు శనివా రం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును కలిసి వినతి పత్రాలు సమర్పించారు. పేదలు, సామాన్యులను కలిసేందు కు సీఎం అవకాశం ఇవ్వడంలేదని విమర్శలొచ్చిన నేపథ్యంలో శనివారం నుంచి రోజూ 12 నుంచి 1 గంట వరకూ సందర్శకులను ఆయన కలుస్తున్నారు. తమ గ్రామంలో రోడ్లు, మురికి కాలువలు లేవని పలువురు మహిళలు సీఎంకు ఫిర్యాదు చేశారు. కాగా కళాశాలలు, యూనివర్సిటీల్లో లోపాలు గుర్తించేం దుకు ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.