సారు... కానరారు..
మామూలుగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దేశ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా వారానికో, రెండు వారాలకోసారైనా హైదరాబాద్ కొచ్చి ప్రత్యేకంగా విలేకరుల సమావేశం పెట్టడం అనవాయితీ. గతంలో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలోనూ వారంతంలో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఆయన తప్పనిసరిగా విలేకరుల సమావేశాలు నిర ్వహించేవారు. ఈ విషయంలో ఎందుకో ఈ మధ్య నెల రోజులుగా పూర్తి నల్లపూస అయిపోయారు. వారం వారమో.. కనీసం రెండు వారాలకైనా హైదరాబాద్‌కు వస్తున్నారు కానీ, విలేకరుల సమావేశాలు నిర్వహించడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. దీనిపై ఇప్పుడు మీడియా వర్గాల్లోనూ, రాజకీయ నేతలలోనూ ఆసక్తి చర్చ జరుగుతోంది.
బీజేపీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై ఇటీవల ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆడియో టేపుల ఆరోపణలు రావడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం పోలీసు వాహానాల కొనుగోలు అంశంలో వివాదం వంటి కారణంగానే ఆయన ఈ మధ్య కాస్త మీడియా దూరంగా ఉంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మోడీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మే 29న ఆయన అధికారికంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ తరువాత మే 31నే ‘ఓటుకు కోట్లు’ కేసు వెలుగులోకి రావడంతోనే మిత్రపక్షానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడలేకే మీడియాకు దూరంగా ఉంటున్నారని ఆయన వెనుక సెటైర్లు ఊపందుకున్నాయి.