చంద్రబాబు దిగొచ్చే వరకు పోరాటం
- అఖిలపక్ష నేతల అల్టిమేటం
- కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
- కార్మిక నాయకల అరెస్టు..
కర్నూలు(హస్పిటల్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగొచ్చే వరకు పోరాటం ఆపబోమని అఖిలపక్ష నేతలు, మున్సిపల్ జేఏసీ నాయకులు హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్‌ను మట్టడించారు. మున్సిపల్ జేఏసీ జిల్లా కన్వీనర్ వైవీ రమణ ఆధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైఎస్‌ఆర్‌సీపీ, వామపక్షాల నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ 14 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం కనీసం చర్చలకు పిలువకపోవడం దారుణమన్నారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్త బంద్‌కు సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లాలోని 11 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని, వారంతా ఆమరణ నిరాహారదీక్షలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
చెత్తాచెదారంతో కర్నూలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చెత్తను తీసుకుపోయి అధికార పార్టీ నాయకుల ఇళ్ల వద్ద పడేస్తే సమస్య ఏమిటో తెలుస్తుందన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు కంపుకొడుతున్నా ప్రభుత్వానికి చెవికెక్కడంలేదన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో ఊదరగొట్టి.. అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని ఎద్దేవా చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గఫూర్ మాట్లాడుతూ కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడును వెంటనే గద్దెదిగాలన్నారు. స్వచ్ఛాంద్రప్రదేశ్‌ను చెత్తంద్రాప్రదేశ్‌గా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి , ఎఐటీయూసీ రాష్ట్ర నాయకుడు మనోహర్ మాణిక్యం, ఐద్వా రాష్ట్ర నాయకురాలు నిర్మల, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, మునెప్ప తదితరులు మద్దతు ప్రకటించారు. ఏఐటీయూసీ నాయకులు రామకృష్ణారెడ్డి, ప్రభాకర్, సీపీఎం నాయకులు పుల్లారెడ్డి, రాముడు, అంజిబాబు, ఆనంద్, వైఎస్‌ఆర్‌టీయూసీ నగర అధ్యక్షులు నరసింహులు యాదవ్, ఎస్సీ సెల్ నాయకులు కిషన్, ట్రేడ్ యూనియన్ నాయకులు రమణ, పులి జాకోబ్, రాఘవేంద్రనాయుడు, సహదేవుడు, సలీం, నాయకులు రాధాకృష్ణా, స్వాములు పాల్గొన్నారు.
అరగంట సేపు తోపులాట..
కలెక్టరేట్ ముట్టడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ జేఏసీ నాయకులు, కార్మికులు కలెక్టరేట్ ప్రధాన గేట్లను తోచుకుని లోపలికి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. స్పెషల్ పార్టీ పోలీసులు వీరిని అడ్డుకున్నారు. అరగంట సేపు కార్మికులు, పోలీసుల మధ్య తీవ్రంగా తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కార్మిక నాయకులను అరెస్ట్ చేసి మూడో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలియడంతో కార్మికులు అక్కడికి చేరుకుని పోలీస్ స్టేషన్ ఆవరణంలోనే ధర్నా చే పట్టారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసిన వారిని విడుదల చేశారు.