ముఖ్యమంత్రివి పిచ్చిమాటలు
కడప కార్పొరేషన్: రాయల సీమలో కరువు నివారణకు నియోజకవర్గాలకు ఐపీఎస్ అధికారులు, మండలాలకు గ్రూప్–1 ఆఫీసర్లను నియమిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు. ఇంకా ఎవరిని మభ్యపెట్టడానికి ఈ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఇక్కడి వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో రాయలసీమ కార్మిక, కర్షక సేవా సమితి అధ్యక్షులు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అ«ధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, ఆమ్‌ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ పెద్దన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సీమలో పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం రెయిన్‌గన్‌లు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. నాలుగు రోజుల దాటితే ఆర్టీపీపీ విద్యుదుత్పత్తికి నీళ్లు ఉండవని, బ్రహ్మంసాగర్, మైలవరంలో కూడా నీళ్లు లేవన్నారు. దీనికి ఏరకమైన గన్‌లు ఉపయోగిస్తారని ఎద్దేవా చేశారు. విభజనతో సీమ సర్వనాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర కరువు ప్రాంతమైన రాయలసీమ పట్ల ప్రభుత్వానికి సరైన ఆలోచన లేదని, పుష్కరాలకు ఇచ్చిన ప్రాముఖ్యత కూడా సీమ కరువు పట్ల లేకపోవడం దురదృష్టకరమన్నారు. రాయలసీమలోని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపతికన పూర్తి చేయాలని, ఉక్కుపరిశ్రమను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా రైతాంగం ఆవేదన, ఆగ్రహాన్ని ఈ ధర్నా ద్వారా తెలియజెప్పాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ రాయలసీమ పట్ల ముఖ్యమంత్రి వైఖరి అత్యంత దారుణంగా ఉందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ తరతరాలుగా రాయలసీమకు అన్యాయమే జరుగుతోందని, సీమ సమస్యలపై అసెంబ్లీలో గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్‌ఆర్‌సీపీ ధర్నా నిర్వహించడం శుభపరిణామమన్నారు. కాంగ్రెస్ నాయకుడు ఎస్‌ఏ సత్తార్ మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధి కోసం ఎలాంటి ఉద్యమానికైనా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఆమ్‌ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ పెద్దన్న మాట్లాడుతూ కోస్తాలో టీడీపీకి ఓట్లు వేశారు కాబట్టే ముఖ్యమంత్రి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారని ఇది మంచి విధానం కాదని తెలిపారు.