మళ్లీ గలీజుదందా!
మున్సిపల్ దుకాణాల బహిరంగ వేలంలో కొత్త ట్విస్ట్
* 100 శాతం పెంచి పాత వారికే ఇస్తారంటా..
* పోతూ.. పోతూ పాత కమిషనర్ నిర్ణయం
* 30 ఏళ్లు వారికే ఇవ్వాలని జీఓ వచ్చిందంట
కోదాడటౌన్ : కోదాడ పురపాలక సంఘానికి చెందిన దుకాణాల సముదాయ బహిరంగ వేలం విషయంలో పాలకులు, అధికారులు పట్టణ ప్రజలకు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకు వేలం వేస్తాం అదిగో.. ఇదిగో అంటూ చెప్పిన అధికారులు తెరవెనుక వేరే రాజకీయం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాత కమిషనర్ ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లడానికి ముందు దుకాణాల లీజు దారుల నుండి 100 శాతం అద్దెలు పెంచి ఏప్రిల్ 1 నుండి వసూలు చేయాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. కౌన్సిలర్లు మొదలుకొని అధికారుల వరకు కుమ్మక్కై అడుగడుగునా బహిరంగ వేలానికి మొకాలడ్డుతూ లీజుదారుల కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తెరపైకి కొత్త విషయం
మున్సిపల్ దుకాణాల వేలం విషయంలో తాజాగా వెలుగులోకి వస్తున్న సమాచారం ప్రకారం కొందరు లీజు దారులు కొత్త విషయాన్ని తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కొత్త జీఓ తెచ్చిందని దాని ప్రకారం ఒక సారి లీజు దక్కించుకున్న వారు 30 ఏళ్ల వరకు దానిపై హక్కులు ఉంటాయని చెబుతున్నారు. వాస్తవానికి ప్రతి రెండు లేదా మూడేళ్లకు ఒకసారి వేలం వేసి దుకాణాలను కేటాయించాల్సి ఉండగా మరీ 30 సంవత్సరాల మాటేమిటో విషయం అర్థం కావడం లేదని పలువురు విపక్ష కౌన్సిలర్లు అంటున్నారు. అసలు ఆ జీఓ ఎపుడు వచ్చింది? దాని అర్థం ఏమిటి? ఎవరికి వర్తిస్తుంది? అసలు అది అసలు జీఓనేనా? ముందు తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా జనవరిలో జరిగిన పాలకవర్గ సమావేశంలో పాతవారికే ఇపుడు ఉన్న అద్దెలపై 100 శాతం పెంచి దుకాణాలను కేటాయించాలని తీర్మానం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. విపక్ష కౌన్సిలర్లు మాత్రం ఈ విషయం అసలు మాకు తెలియదని, దీనిపై తమకు పూర్తి వివరాలను ఇవ్వాలని వారం క్రితం జరిగిన సమావేశంలో ప్లోర్‌లీడర్ దండా వీరభద్రం కోరారు.
గుడ్‌విల్ తీసుకొని ఇతరులకు..
దుకాణాల వేలం విషయం పక్కన పెడి తే దీనిలో వ్యాపారులు అనేక ఉల్లంఘనలకు పా ల్పడ్డట్లు తెలుస్తోంది. గతం లో లీజుకు తీసుకున్న వారిలో సగానికి పైగా వ్యాపారులు ఈ దుకాణాలను లక్షల రూపాయల గుడ్‌విల్ కింద ఇతరులకు అమ్ముకున్నారు. వాస్తవానికి లీజుదారుడు ఇతరులకు దుకాణాన్ని ఇస్తే వెంటనే లీజు ర ద్దువుతుంది. దీన్ని లీజు అగ్రిమెంట్‌లో ప్ర ముఖంగా పేర్కొంటారు. అంతే కాకుండా ఎటువంటి మార్పులు, చేర్పులు చేయకూడదు. కానీ, పలువురు వ్యాపారులు తమ దుకాణాలను రెండుగా విభజించి ఇతరులకు అద్దెకు ఇచ్చారు.
కొందరు రెండు షాప్‌లను కలిపి ఒకటి చేశారు. ఈ మార్పులను దొడ్డిదారిని రికార్డుల్లో కూడా నమోదు చేయించారంటే ఈ వ్యవహారంలో సిబ్బంది చేతివాటం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. లీజు అగ్రిమెంట్ కాగితాలు ఒక్కసారి బయటకు తీస్తే ఆ వ్యవహారం బయటపడే అవకాశం ఉన్నా దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. కారణం ఇదంతా బహిరంగ రహస్యమే కాబట్టి.
100 శాతం పెంచినా తక్కువే..
దుకాణాల వేలం జరగకుండా అడ్డుకోవడానికి లీజుదారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయడం వెనక అనేక కారణాలే ఉన్నాయి. ఈ దుకాణాల అద్దెల్లో ఉన్న తేడాతో పాటు షాప్‌లు పట్టణ నడిబొడ్డున ఉండడం, ఈ ప్రాంతంలో నిత్యం రద్దీ ఉండడం కారణమని తెలుస్తోంది. ఇక్కడ ఒక్కో షాప్ అద్దె రూ.20 నుంచి రూ.25 వేల వరకు ఉన్నది. కానీ, మున్సిపల్ దుకాణాల అద్దె మాత్రం కేవలం రూ.3 నుంచి రూ.5 వేల వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ లెక్కన తాజాగా అద్దెలను 100 శాతం పెంచినా అది రూ.5 నుంచి రూ.6వేలు కూడా దాటదు. అంతే కాదు లక్షల రూపాయలు అడ్వాన్‌సగా చెల్లించినా షాప్ అద్దెకు దొరకడం కష్టమే.
పాత కమిషనరే నిర్ణయం తీసుకున్నారు
కమినర్‌గా బాలోజీనాయక్ ఉన్న సమయంలోనే సాయికృష్ణ థియేటర్ రోడ్డులో ఉన్న దుకాణాల అద్దెపై 100 శాతం పెంచి ఏప్రిల్-2016 నుంచి వసూళ్లు చేయాలని ఆదేశించారు. జనవరి నెలలో జరిగిన పాలకవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొత్త కమిషనర్ వచ్చారు. ఈ విషయాన్ని మరోసారి ఆయన దృష్టికి తీసుకెళ్లి వారి నిర్ణయం ప్రకారం నడుచుకుంటాం.
- బుచ్చిబాబు, మున్సిపల్ మేనేజర్