అపరిశుభ్ర వాతావరణంలో మాంసం విక్రయాలు చేస్తున్న దృశ్యం
మెదక్ మున్సిపాలిటీ : జిల్లా కేంద్రంలో మాంసం విక్రయాలు విచ్చల విడిగా కొనసాగుతున్నాయి. అనారోగ్యంతో మృత్యువాత పడే స్థితిలో ఉన్న జీవాలను చౌక ధరలకు కొనుగోలు చేసి, వాటిని కోసి విక్రయిస్తున్నారు. మరికొందరు మాంసం వ్యాపారులు గొర్రెలను కోసి మేక పొట్టేలుగా నమ్మించి అంటగడుతున్నారని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో 50 నుండి 60 వరకు మాంసం దుకాణాలున్నాయి.
కిలో మాంసం ధర రూ.400ల వరకు విక్రయిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న గొర్రెలు, మేకలను కటికలు అతి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. వధశాల లేకపోవడంతో ఇంటి వద్దనే అపరిశుభ్ర వాతావరణంలో వాటిని వధించి మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఆడ గొర్రెల మాంసాన్ని పొట్టేలుగా నమ్మించి అమ్ముతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఎలాంటి మాంసం అమ్ముతున్నారో ప్రజలకు తెలియడం లేదు.
పశువైద్యాధికారి ధ్రువీకరణ చేశాకే ఆరోగ్యంగా ఉన్న గొర్రెలు, మేకలను వధశాలలో కోయాలి. కానీ వధశాల లేకపోవడంతో కటికలు తమ ఇష్టమైన ప్రదేశాల్లో మూగజీవాలను కోసి ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు. వెటర్నరీ అధికారులు, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపంతో అపరిశుభ్రమైన మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. ఇది ప్రజారోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది.
అనుమతి లేకుండా మేకపోతుల మాసం విక్రయం మెదక్ జిల్లా కేంద్రం కావడంతో మాంసం విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి.
అయితే మాంసం వ్యాపారులు నిబంధనలు పాటించకుండా విక్రయాలు జరుపుతున్నారని వినియోగదారులు విమర్శిస్తున్నారు. నిబంధనల ప్రకారం మాంసం విక్రయదారులు తమ ఇష్టానుసారం గొర్రె పోతులు, మేక పోతులను వధించడానికి వీల్లేదు. పశువైద్యులు పరీక్షించాకే వధించాల్సి ఉంటుంది. కానీ వ్యాపారులు అలాంటి నిబంధనలు పాటించకుండా అనారోగ్యంతో చనిపోయే స్థితిలో ఉన్న గొర్రెలు, మేకలను కోస్తూ మాంసం విక్రయాలు చేస్తున్నారని, ఈ విషయంలో వెటర్నరీ, మున్సిపల్ అధికా రులు లంచాలు తీసుకుంటూ నాణ్యతను పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.
వైద్య పరీక్షల మాటే లేదు
జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో సుమారు లక్ష మేర జనాభా ఉండగా ఒక్క వధశాల కూడా లేకపోవడం గమనార్హం. వ్యాపారులు గొర్రెలు, మేకలు తీసుకొచ్చాక, డాక్టర్లు వాటిని పరిశీలించి, పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని ధృవీకరించిన తరువాతే వాటిని వధించాలి. అనంతరం వైద్యులు మరోసారి పరీక్షలు చేసి, క్షుణ్నంగా పరిశీలించి, వాటి మాంసం సురక్షితమైందని ముద్ర వేయాలి. ఆ తరువాతే మాంసాన్ని దుకాణాల్లో పెట్టి విక్రయించాల్సి ఉంది. గ్రామాల్లో నాణ్యమైన ఆరోగ్యవంతమైన మాంసం దొరుకుతుందని ప్రజలు నమ్ముతారు.
పండుగలు, శుభకార్యాల సందర్భంగా మాంసం వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. నాణ్యతతోపాటు తూకం వేయడంలోనూ వ్యాపారులు ప్రజలను మోసం చేస్తున్నారు. మార్కెట్‌లో అమ్మకం చేసే మాంసంపై ఈగలు, దోమలు వాలకుండా దోమ తెరలు వాడాల్సినప్పటికీ కనీస నిబంధనలు పాటించడం లేదు. ఇప్పటికైనా మున్సిపల్, వెటర్నరీ అధికారులు స్పందించి మాంసం విక్రయదారులు నిబంధనలు పాటించి, ప్రజల ఆరోగ్యాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
మున్సిపల్ అధికారులే చూసుకోవాలి
మాంసం విక్రయం విషయాలను మున్సిపల్ అధికారులు చూసుకోవాలి. వారే డాక్టర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. మున్సిపాలిటీ అధికారులు వధశాల ఏర్పాటు చేసి అక్కడ మూగజీవాలను పరిశీలించి కోసేందుకు అనుమతులు ఇవ్వాలి. – అశోక్‌కుమార్, జిల్లా వెటర్నరీ అధికారి, మెదక్
పట్టించుకునే దిక్కేది..?
అధికారులు ఆరోగ్యమైన గొర్రెలు, మేకలు పరిశీలించకుండానే విక్రయదారులు అనారోగ్యానికి గురైన జీవాలను వధిస్తూ మాంసం విక్రయిస్తూ..ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. విక్రయదారులు తమ ఇష్టానుసారంగా నాణ్యతలను పాటించకుండా మాంసం విక్రయిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. – విజయ్, మెదక్
వధశాల లేకపోవడంతోనే..
మెదక్ పట్టణంలో మాంసం విక్రయానికి వధశాల లేకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతుంది. మున్సిపాలిటీకి సంబం«ధించి వధశాల ఉంటే అక్కడే ఒక డాక్టర్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వెటర్నరి డాక్టర్ సర్టిఫై చేసిన తరువాత ఆరోగ్యవంతమైన జీవాలను కోసి అమ్మాల్సి ఉంటుంది.
– సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్, మెదక్
Comments
Please login to add a commentAdd a comment