మెదక్‌పై చలిపులి పంజా విసురుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
మెదక్: మెదక్‌పై చలిపులి పంజా విసురుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గురువారం నాటికి ఉష్ణోగ్రతలు 12.7 డిగ్రీలకు చేరింది. బుధవారం 18 సెంటీగ్రేడ్‌లుగా ఉన్న ఉష్ణోగ్రత ఒక్కరోజులోనే అమాంతం 5 డిగ్రీల మేర పడిపోయింది. దీంతో పట్టణ ప్రజలు గజగజ వణికిపోతున్నారు.
ఉదయం 5 గంటలకే మైదానానికి వెళ్లే వారు, పేపర్‌బాయ్‌లు, పాల వ్యాపారులు, హోటల్ వ్యాపారులు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చలితో నానా అవస్థలు పడుతున్నారు. ఇక సాయంత్రం వేళల్లోనూ బయటకొచ్చేందుకు జనం భయపడుతున్నారు. ఒకవేళ ఎవరైనా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే మంకీ క్యాప్‌లు, స్వెట్టర్‌లు ధరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడం...అందరూ స్వెట్టర్లు కొనేందుకు ఉత్సాహం చూపడంతో పట్టణంలో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది.