నంద్యాలఅర్బన్: పట్టణ శివారు ప్రాంతం నందమూరినగర్‌లో శుక్రవారం మున్సిపల్ సిబ్బంది చేపట్టిన ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న కట్టడాల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. వివరాలిలా ఉన్నాయి..రోడ్ల విస్తరణలో భాగంగా మున్సిపల్ అధికారులు ప్రధాన రహదారికి ఇరువైపులా కట్టడాలను తొలగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉదయం పనులు ప్రారంభించారు. అయితే తమకు ముందస్తు సమాచారం లేకుండా ఎలా కట్టడాలను కూల్చివేస్తారంటూ స్థానికులు అడ్డుకున్నారు. ఈక్రమంలో మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు కట్టడాలు తొలగిస్తున్నామని సిబ్బంది చెప్పినా స్థానికులు పనులు చేయడానికి అంగీకరించలేదు. ఉన్నఫలంగా మరుగుదొడ్లు, బాత్‌రూంలు తొలగిస్తే ఎలా అంటూ సిబ్బందిని ప్రశ్నించారు. మరోవైపు కట్టడాల తొలగింపులో సిబ్బంది చూపుతున్న వివక్షపై నిలదీశారు. అధికార పార్టీ మద్దతుదారుల ఇళ్ల వద్ద ఒకలాగా, సామాన్యుల ఇళ్ల వద్ద ఒకలాగ కట్టడాలను కూల్చివేస్తున్నారని స్థానిక మహిళలు ఆరోపించారు. ఈక్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసుల పర్యవేక్షణలో కూల్చివేత కార్యక్రమం కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment