ఎలా తాగాలి..?
ఎలా తాగాలి..?
Published Thu, Jul 21 2016 11:31 PM | Last Updated on Tue, Oct 16 2018 6:44 PM
ఆత్మకూరులోని హిల్‌రోడ్డులో పాచినీరు సరఫరా
ఆత్మకూరురూరల్ : పట్టణంలోని హిల్‌రోడ్డు సమీపంలో యాదవవీధి, దిగువ ప్రాంతాల్లో గత 20 రోజులుగా కలుషిత తాగునీరు సరఫరా అవుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నీరులో పాచి, తదితర కలుషిత పదార్థాలు వస్తున్నాయని, దీనికితోడు మరుసటిరోజుకు మురుగువాసన వస్తోందని మహిళలు చెబుతున్నారు. నిల్వ చేసుకున్న నీటిపై మరుసటిరోజు జిడ్డులా ఏర్పడి కనీసం వినియోగించేందుకు కూడా వీలుకావడంలేదు. సమస్యను మున్సిపల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయింది. కౌన్సిలర్ సైతం పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నాయి.
ఆత్మకూరు మున్సిపాలిటీగా రూపాంతరం చెందడంతో రూ.102 కోట్లతో సోమశిల ప్రాజెక్టు నుంచి పైపులైను ద్వారా నీరు సరఫరా అయ్యేలా ఏర్పాటుచేశారు. నీరు శుద్ధి చేసేందుకు శివారుల్లో ఫిల్టర్ ఏర్పాట్లు సైతం చేశారు. అయినా పలు ప్రాంతాల్లో ఇలా కలుషిత జలాలు సరఫరా అవుతుండటంతో పట్టణవాసులు మండిపడుతున్నారు. ఇటీవల పంటవీధి పరిసరాలలోని రామిరెడ్డి శీనయ్య వీధిలో ఇలాగే కలుషిత జలాలు సరఫరా అయ్యాయి. మున్సిపల్ అధికారులు అన్ని ప్రాంతాల్లో పరిశీలించి కలుషిత జలాల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
Advertisement