
పోలీసుల దెబ్బలకు అపస్మారక స్థితిలో ఉన్న పెంచల ప్రసాద్
సాక్షి, ఆత్మకూరు : ఓ విషయమై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ యువకుడిపై దొంగతనం నేరం ఆరోపిస్తూ తీవ్రంగా కొట్టడంతో అతను అపస్మారకస్థితిలోకి వెళ్లిన ఘటన ఏఎస్‌పేట మండలంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకుల కథనం మేరకు.. మండలంలోని అనుమసముద్రం గ్రామ అంబేడ్కర్ కాలనీకి చెందిన పచ్చా పెంచలప్రసాద్ ఉపాధి హామీ పథకంలో వీఆర్‌ఓగా కర్నూలు జిల్లాలో పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో నెలరోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. తన ఇంట్లోని మహిళను కొందరు వీడియో తీస్తున్న విషయంపై ఫిర్యాదు చేసేందుకు పెంచలప్రసాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. (‘నేను స్పెషలాఫీసర్‌ని.. ఇది నా ఐడీ’)
అయితే అతడిని ఎస్సై సుమారు రెండుగంటలపాటు స్టేషన్‌లోనే కూర్చోబెట్టాడు. దొంగతనం నేరం ఆరోపిస్తూ తనను ఎస్సై, కానిస్టేబుల్ తీవ్రంగా కొట్టారని ప్రసాద్ ఆరోపిస్తున్నాడు. అతను స్పృహ తప్పడంతో ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద పోలీసులే చికిత్స చేయించారు. అక్కడి నుంచి ఆత్మకూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి పంపించి చేతులు దులుపుకున్నట్లు బంధువులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పెంచలప్రసాద్ తల్లిదండ్రులు కొడుకుని మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. దళిత సంఘాల నాయకులు ప్రసాద్‌ను పరామర్శించారు. అతనికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. (గ్యాంగ్‌వార్: వారిపై నగర బహిష్కరణ వేటు )