సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్‌ఐ పోస్టుల భర్తీ కోసం ఈనెల 14, 15 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని పోలీస్ నియామక మండలి నిర్ణయించింది. ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లు, డిస్క్రిప్టివ్ విధానంలో రెండు పేపర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. మెయిన్స్‌కు మొత్తం 31,193 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారిలో పురుషులు 27,590 మంది, మహిళలు 3,603 మంది ఉన్నారు.
మెయిన్స్ పరీక్షలను విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను ఈ నెల 6 నుంచి 12 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని రాష్ట్ర పోలీసు నియామక మండలి చైర్మన్ అతుల్ సింగ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పేపర్–1(డిస్క్రిప్టివ్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకు పేపర్–2(డిస్క్రిప్టివ్) నిర్వహిస్తారు.
15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పేపర్–3(ఆబ్జెక్టివ్), మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పేపర్–4(ఆబ్జెక్టివ్) నిర్వహించనున్నారు. slprb. ap. gov. in వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను లేదంటే ఈమెయిల్ mail& slprb@ap.gov.in ద్వారా సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment