సాక్షి, అమరావతి: ఎస్సై అభ్యర్థుల ‘ఎత్తు’ వివాదం కీలక మలుపు తిరిగింది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు తమ ‘ఎత్తు’ను సరిగా కొలవలేదంటూ పలువురు అభ్యర్థులు చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఎస్సై రాత పరీక్ష ఫలితాల వెల్లడిపై సింగిల్ జడ్జి విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తివేసింది.
మంగళవారం కోర్టు హాలులో నిర్వహించిన ఎత్తు పరీక్ష ఫలితాలు, రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు గతంలో నిర్వహించిన ఫలితాలతో సరిపోలడంతో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుపై ఆరోపణలు చేస్తూ కోర్టుకొచ్చిన పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభ్యర్థులు ప్రభుత్వ వైద్యుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తెచ్చి.. కోర్టు ముందుంచడంపైనా మండిపడింది.
ఈ పత్రాల యథార్థతపై దర్యాప్తు చేయాలని గుంటూరు ఐజీ పాలరాజును ఆదేశించింది. ఆ వైద్యులను విచారించాలని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేంద్ర, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎత్తు, ఛాతీ కొలతలపై వివాదం
ఎస్సై నియామక ప్రక్రియకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షల్లో భాగమైన ఎత్తు, ఛాతీ చుట్టుకొలతను హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా కొలిచిన అధికారులు తమను అనర్హులుగా ప్రకటించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఆరుగొళ్లు దుర్గాప్రసాద్, మరో 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2018 నోటిఫికేషన్‌లో ఎత్తు విషయంలో అర్హులుగా ప్రకటించిన తమను తాజా నోటిఫికేషన్‌లో అనర్హులుగా ప్రకటించారని ఆరోపించారు.
వాదనలు విన్న సింగిల్ జడ్జి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఎస్సై నియామకాల కోసం గత నెలలో నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలను తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు వెల్లడించవద్దంటూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ నియామక బోర్డు ధర్మాసనం ముందు అప్పీల్ చేశాయి.
దీనిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ నరేంద్ర ధర్మాసనం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుపై చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే రూ.లక్ష జరిమానా విధిస్తామని, అందుకు సిద్ధమైన అభ్యర్థులే ఎత్తు పరీక్షకు హాజరు కావాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పిటిషన్ దాఖలు చేసిన 24 మందిలో 19 మంది పరీక్షకు హాజరవుతున్నామని, రూ.లక్ష జరిమానా చెల్లించేందుకు సిద్ధమంటూ లిఖితపూర్వకంగా కోర్టుకు తెలిపారు.
రూ.లక్ష చొప్పున కట్టాల్సిందే
కాగా.. న్యాయస్థానంలో కొలతలకు హాజరైన అభ్యర్థులు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుపై తాము చేసిన ఆరోపణలు అవాస్తవం అని తేలితే రూ.లక్ష జరిమానా చెల్లిస్తామని రాసిచ్చిన నేపథ్యంలో ఆ మొత్తం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. తమకు అంత స్థోమత లేదని కొందరు అభ్యర్థులు చెప్పడంతో.. కోర్టు అంటే తమాషాగా ఉందా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. రూ.లక్ష చొప్పున చెల్లించాల్సిందేనని.. లేదంటే జైలుకెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.
న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్‌పై ఆగ్రహం
మంగళవారం న్యాయస్థానంలోనే అభ్యర్థుల ఎత్తును ధర్మాసనం కొలిపించింది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కొలతలు సరిగానే ఉన్నాయని స్పష్టం చేసింది. అభ్యర్థుల తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్ స్పందిస్తూ.. పిటిషనర్లు నిబంధనల ప్రకారం ఉండాల్సినంత ఎత్తు ఉన్నారని ధ్రువీకరిస్తూ ప్రభుత్వ వైద్యులు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారంటూ వాటిని ధర్మాసనం ముందుంచారు.
వాటిని పరిగణనలోకి తీసుకోవాలని నవ్వుతూ కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టునే శంకిస్తారా? అంటూ చీవాట్లు పెట్టింది. కోర్టు అంటే నవ్వులాటగా ఉందా అంటూ శ్రవణ్‌కుమార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును తేలిగ్గా తీసుకుంటే పర్యవసానాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంది.
Comments
Please login to add a commentAdd a comment