జాతీయ రహదారి పక్కన నిర్మిస్తున్న కాంప్లెక్స్
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తీరుపై విమర్శలు
కరీంనగర్ : ప్రజాప్రతినిధిగా ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన ఓ ఎమ్మెల్యే అందుకు భిన్నంగా నడుచుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలు ప్రజలకే తప్ప తనకు వర్తించవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆదాయం కోసం ఏకంగా ఓ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్న ఆయన మున్సిపల్ నుంచి ఎటువంటి అనుమతు లు తీసుకోకుండానే దర్జాగా పనులు చేపడుతున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినప్పటికీ ఎమ్మెల్యే కావడంతో వారు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు మెట్‌పల్లి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారి పక్కన అర ఎకరం పైగా స్థలం ఉంది. మొదటి నుంచి ఆ స్థలంలోనే ఆయన నివాస భవనం ఏర్పాటు చేసుకున్నారు. నాలుగేళ్ల క్రితం అదే స్థలంలో మరో చోట విశాలమైన నూతన భవనాన్ని నిర్మించుకున్నారు. పాత నివాస భవనాన్ని కూల్చి దాని స్థానంలో ఇటీవలనే కుటుంబసభ్యుల పేరు మీద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు.
గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు ఆదనంగా మరికొన్ని అంతస్తులతో సుమారు 300 గజాల స్థలంలో ఈ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా... షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం మున్సిపల్ కార్యాలయం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే పనులను మొదలు పెట్టారు. మున్సిపాలిటీల చట్టం ప్రకారం... భవనం నిర్మించేవారు ఇంజనీరింగ్ ప్లాన్‌తో ముందుగా మున్సిపల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తును టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్దారించుకున్న తర్వాత నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలి. అనుమతి పత్రాల్లేకుండా నిర్మాణం చేపట్టరాదు. కాని ఎమ్మెల్యే ఇదేమీ పట్టించుకోకుండా కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు.
అనుమతులు లేవు
ఎమ్మెల్యే నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్‌కు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఇటీవలనే తన భార్య పేరు మీద అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి సంబంధిత స్థలాన్ని పరిశీలిస్తున్నారు. రెండ్రోజుల్లో అనుమతి పత్రం మంజూరు చేస్తాం.
- శైలజ,
మున్సిపల్ కమిషనర్
గతంలోనూ అంతే..
ప్రస్తుతం నిర్మిస్తున్న కాంప్లెక్స్ విషయంలోనే కాదు... నాలుగేళ్ల క్రితం నిర్మించిన నివాస భవన విషయంలోనూ ఎమ్మెల్యే మున్సిపల్ నిబంధనలను బేఖాతరు చేశారు. ఆ సమయంలో భవనానికి మున్సిపల్ నుంచి జీ+2కు అనుమతి తీసుకున్న ఆయన ఆ తర్వాత మరో అంతస్తును నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. దానిని క్రమబద్దీకరించుకోవ డానికి ఇటీవలనే బీపీఎస్ కింద దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
చోద్యం చూస్తున్న అధికారులు..
జాతీయ రహదారి పక్కనే ఎమ్మెల్యే అనుమతి లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మున్సిపల్ కమిషనర్‌తోపాటు ఇతర మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగే సమావేశాలకు తరచూ హాజరవుతుంటారు. అక్కడే గతనెల రోజులుగా పనులు జరుగుతున్న విషయం కళ్లముందు కనిపిస్తున్నా స్పందించడం లేదు. ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి సామాన్య ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించే అధికారులు ఎమ్మెల్యే విషయంలో ఉదాసీనత కనబర్చడం ఎంతవరకు సమంజసమనే విమర్శలు ఎదురవుతున్నాయి.