kalvakuntla vidyasagar rao
-
నా ప్రాణం ఉన్నంత వరకూ మీ వెంటే..
మల్లాపూర్ : ఎమ్మెల్యేగా ఉన్నా, లేకున్నా నా ప్రాణం ఉన్నంత వరకూ మీ వెంటే ఉంటానని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. స్థానిక కేఎంఆర్ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీ య సమ్మేళనంలో జెడ్పీ చైర్మన్ దావ వసంతతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ యన మాట్లాడుతూ, బీఆర్ఎస్ను ఓడించే శక్తి కాంగ్రెస్, బీజేపీకి లేదన్నారు. ఆ పార్టీల కుట్ర లను ఎండగడుతూ కార్యకర్తలు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని కోరారు. నియోజకవర్గంలో ఇప్పటికే 90శాతం అభివృద్ధి పనులను పూర్తిచేశానని, మిగతా పనులకు నిధుల కొరత అడ్డంకిగా మారి ఆలస్యమవుతోందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గం నుంచి తన కుమారుడు డాక్టర్ సంజయ్‌కుమార్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ చేతుల్లో పెడుతున్నానని, తనపై ఉన్న ప్రేమాభిమానాలనే సంజయ్‌పై ఉంచి ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్యే, ఖాదీబోర్డు చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యుడు.. ఇలాంటి ఏ పదవి చేపట్టినా ప్రజలు, కార్యకర్తల సేవకే వినియోగిస్తానని అన్నారు. నాయకులు సంజయ్‌కుమార్, కాటిపెల్లి సరోజన, సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గౌరు నాగేశ్, కొమ్ముల జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. -
Karimnagar: ఉగాది వేళ.. జాతకాల్లో అదృష్టం వెతుక్కుంటున్న నేతలు
సాక్షి, కరీంనగర్: తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది. శోభకృత్ నామ సంవత్సరం సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ జాతకాన్ని కొత్త పంచాంగంలో వెతుక్కుంటున్నారు. ఈ ఉగాది సాధారణ ప్రజల కంటే.. రాజకీయ నాయకులకు ఎంతో కీలకమైంది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యర్థులు, ఈసారి ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకునే ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అధికార–ప్రతిపక్ష నేతలంతా నూతన పంచాంగంలో తమ జాతకాలలో ఆదాయ వ్యయాల మాట ఎలా ఉన్నా.. రాజ్యపూజ్యంపైనే కన్నేశారు. అవమానాల మాట పక్కనబెట్టి.. రాజ్యపూజ్యం దక్కుతుందా? లేదా అన్న అంశంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే.. కరీంనగర్: బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ తీగల వంతెన, ఎమ్మారెఫ్, స్మార్ట్ సిటీ పనులతో కరీంనగర్‌పై ఫోకస్ పెట్టారు. హిందుత్వం, మార్పు అన్న ఎజెండాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి పోటీ ఎదరవనుంది. బీజేపీ నుంచి కొత్త జయపాల్‌రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మనవడు రోహిత్, నగరాధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వైస్సార్టీపీ నుంచి డాక్టర్ నగేశ్ బరిలో నిలవనున్నారు. చొప్పదండి: ప్రస్తుతం ఎమ్మెల్యే రవిశంకర్ (బీఆర్ఎస్)కు ఇంటిపోరు తప్పేలా లేదు. అదేపార్టీ నుంచి గజ్జెల కాంతం, కత్తెరపాక కొండయ్య, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ టికెట్ రేసులో ఉన్నారు. ఈసారి మేడిపల్లి సత్యం (కాంగ్రెస్) నుంచి గట్టి పోటీ ఇవ్వనున్నారు. బీజేపీ నుంచి బొడిగె శోభ, సుద్దాల దేవయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వైఎస్సార్టీపీ నుంచి అక్కెనపల్లి కుమార్ బరిలో నిలవనున్నారు. మానకొండూరు: ఇక్కడ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి బాలకిషన్‌కు ఈసారి ఇంటి పోరు తీవ్రంగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఇక్కడే నుంచే పోటీ చేసిన ఓరుగంటి ఆనంద్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, బీజేపీ గడ్డం నాగరాజు, దరువు ఎల్లన్న బరిలో నిలవనున్నారు. హుజూరాబాద్: గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఈటల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఈసారి బరిలో దిగనున్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సిరిసిల్ల: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌కు ప్రత్యర్థులు పెద్దగా లేరు. కాంగ్రెస్ నుంచి కె.కె.మహేందర్‌రెడ్డి మినహా ఇక్కడ ఆయనకు గట్టి వైరిపక్షం కానరావడం లేదు. ఈసారి బీజేపీ మాత్రం సెలబ్రెటీని రంగంలోకి దించుతారన్న ప్రచారం సాగుతోంది. రామగుండం: ప్రస్తుతం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు, ఈసారి కాంగ్రెస్ నేత ఠాకూర్ మక్కాన్ సింగ్ (కాంగ్రెస్) గట్టి పోటీ ఎదురవనుంది. వీరితోపాటు సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ (బీజేపీ) కూడా బరిలో ఉండటంతో పోరు రసవత్తరంగా మారనుంది. వేములవాడ: ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ (బీఆర్ఎస్)కు చిరకాల ప్రత్యర్థి ఈసారి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ పేరు వినిపిస్తుండగా.. తాను స్వతంత్రంగానైనా పోటీచేస్తానని అదే పార్టీ నేత తుల ఉమ ఇప్పటికే ప్రకటించారు. ఎన్నారైలు గోలి మోహన్ (ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు), మరో ఎన్నారై తోట రాంకుమార్ కూడా బరిలో నిలిచేందుకు ఆసక్తిగా ఉన్నారు. జగిత్యాల: డాక్టర్ సంజయ్ ఇప్పటికే వరుసగా గ్రామాల్లో పర్యటిస్తూ.. పల్లె నిద్ర పేరుతో ప్రజలకు చేరవవుతున్నారు. ఇక మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (కాంగ్రెస్) కూడా పోటాపోటీగా పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల భోగశ్రావణి బీజేపీ నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఉన్నారు. కోరుట్ల: ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు(బీఆర్ఎస్) వరుసగా అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు అంటూ పర్యటిస్తున్నారు. ఈసారి జువ్వాడి నర్సింగరావు (కాంగ్రెస్) గట్టి పోటీ ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారు. మార్పులు జరిగితే వీరిద్దరు కుమారులను బరిలో దింపుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ధర్మపురి: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్)కు ఈసారి గట్టి పోటీ ఉంది. ఇక్కడ నుంచి అడ్లూరి లక్ష్మణ్ (కాంగ్రెస్), మాజీ ఎంపీ గడ్డం వివేక్ (బీజేపీ) కూడా బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. పెద్దపల్లి: ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి (బీఆర్ఎస్)కి సొంత పార్టీ నుంచే తీవ్ర పోటీ ఉంది. ఎమ్మెల్యే టికెట్ కోసం.. సొంత పార్టీకే చెందిన ఎన్నారై నల్ల మనోహర్‌రెడ్డి, జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నేత విజయరమణారావు నుంచి వీరికి గట్టి పోటీ ఎదురవనుంది. బీజేపీ నుంచి గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌రావు, గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. బీఎస్పీ నుంచి దాసరి ఉష బరిలో ఉన్నారు. మంథని: ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు (కాంగ్రెస్)కు, పుట్ట మధు (బీఆర్ఎస్)కు ఈసారి హోరాహోరీ పోరు నడవనుంది. ఇక్కడ వీరిద్దరు మినహా మూడో పార్టీ అభ్యర్థులెవరూ ఇంతవరకూ ఆసక్తి చూపలేదు. -
'పోలీసులు చేసిన పని సరైనదే'
సాక్షి, జాగిత్యాల : దిశ కేసులో పోలీసులు చేసిన పని సరైనదేనని తాను భావిస్తున్నట్లు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. అటువంటి దుర్మార్గులకు శిక్ష పడితేనే ప్రజల్లో పరివర్తన వస్తుందని తెలిపారు. కళ్లముందే మహిళపై అన్యాయం జరిగినా పట్టిచ్చుకునే నాథుడే లేడని పేర్కొన్నారు. ఇప్పుడున్న పాతకాలపు చట్టాలను మార్చి ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొస్తే బాగుటుందని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసులు ఆత్మస్తైర్యం దెబ్బతిన్న రోజు ప్రజలను రక్షించేవారు కరువవుతారని విద్యాసాగర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. -
టీఆర్ఎస్కు 16 ఎంపీ సీట్లతో తెలంగాణకు మేలు
సాక్షి, మల్లాపూర్: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లను గెలుచుకోవడంతో తెలంగాణకు మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. శుక్రవారం మల్లాపూర్ మండలంలోని రేగుంట, గుండంపల్లి, చిట్టాపూర్ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డుషోల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల సంక్షేమ కోసం అహార్నిశలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని అన్నారు. పరిపాలన దక్షత, అద్భుతమైన పనితీరుతో నాలుగున్నర సంవత్సరాల్లోనే సీఎం కేసీఆర్ గణనీయమైన అభివృద్ధి సాధించి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ నిలిపారని కొనియాడారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలపై బీజేపీ దుష్ప్రచారానికి దిగుతోందని, సోషల్ మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్ర పన్నుతుందని, ప్రజలు ఆగమం కావోద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పడు జరిగే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో దేశంలో గుణాత్మకమైన మార్పుకు శ్రీకారం జరుగబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ జిల్లా సభ్యుడు దేవ మల్లయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగు రాంరెడ్డి, సర్పంచ్‌లు కుందేల్ల నర్సయ్య, దనరేకుల మల్లు, ఎంపీటీసీలు బిట్ల నరేష్, కోటగిరి జల, నాయకులు దనరేకుల సంతోష్‌యాదవ్, నిమ్మల భూమారెడ్డి, సురకంటి తిరుపతిరెడ్డి, గడ్డం శ్రీనివాస్, రంగు రామాగౌడ్, బొడ్డు రాజేష్, తక్కల్ల నరేష్‌రెడ్డి, నూతుల లక్ష్మీనారాయణ, కట్కం నర్సారెడ్డి, నేరేళ్ల మోహన్‌రెడ్డి, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వెరైటీ ప్రచారం: ఒక చేత చెప్పులు.. మరో చేత రాజీనామా
సాక్షి, జగిత్యాల : రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ముగిసి.. ప్రచార హోరు పుంజుకుంటుంది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి ఇంటింటికి వెళ్లి చెప్పులు పంచుతూ.. వెరైటీ ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. వివరాలు.. జిల్లాలోని కొరుట్ల నియోజవర్గం నుంచి ఆకుల హన్మంతు అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మంతు ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించాల్సిందిగా ఓటర్లకు మనవి చేశారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే తాను ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తానన్నారు. ఒక వేళ మాట తప్పితే పబ్లిక్‌గా తనను చెప్పు తీసుకుని కొట్టండంటూ ఓటర్లకు చెప్పులను కూడా పంచారు. హామీలను నెరవేర్చకపోతే తనను పదవి నుంచి తొలగించవచ్చంటూ..ముందే సిద్ధం చేసి పెట్టుకున్న రాజీనామా పత్రాన్ని కూడా జనాలకు చూపిస్తున్నారు. ఈ విషయం గురించి హన్మంతు మాట్లాడుతూ.. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకే తాను ఇలా ప్రచారం చేస్తున్నానంటూ తెలిపారు. అయితే కోరుట్ల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పోటీచేస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు విజయం సాధించిన విద్యాసాగర్ రావు వరుసగా నాల్గోసారి విజయం సాధించాలని ఉవ్విళూరుతుండగా.. అధికార పార్టీ అభ్యర్థి మీద విజయం సాధించాలని హన్మంతు కృషి చేస్తున్నారు. -
‘మిషన్ భగీరథే ఆ కుటుంబానికి బతుకుదెరువు’
సాక్షి, హైదరాబాద్ : ‘మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కల్వకుంట్ల కుటుంబానికి బతుకుదెరువుగా మారింది.. అందుకే రైతుల పొలాలను ఎండబెట్టి మరి ఈ ప్రాజెక్ట్‌కు నీటిని కేటాయిస్తున్నార’ని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కి విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ముప్పై సంవత్సరాలుగా కాకతీయ కెనాల్ కింద కోరుట్ల, బాల్కొండ పరిధిలోని 20కి పైగా గ్రామాల ప్రజలు వ్యవసాయం చేస్తున్నారు. ఎగువన ఎస్సారెస్పీలో 16 టీఎంసీల నీరున్నా.. రైతుల పొలాలకు నీళ్లు వదలకుండా, ప్రభుత్వం కావాలనే వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. నీళ్ల కోసం రైతులు ఆందోళన చేయకుండా ఉండేందుకు ఇప్పటికే ఎస్సారెస్పీ పరిసర గ్రామాల్లో భారీగా పోలీసుల బలగాలను మోహరించి, రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు . కేవలం ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాలైనా గజ్వేల్, సిద్ధిపేటకు నీటిని వదలడం కోసమే ఇలా చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై వ్యవసాయ మంత్రి పోచారం, కోరుట్ల స్థానిక మంత్రి కల్వకుంట్ల విద్యాసాగర్ రావ్, ఎంపీ కవిత స్పందించాలని డిమాండ్ చేశారు. రైతులు కోరుకున్నది కేవలం అర టీఎంసీ నీరు మాత్రమే.. కానీ ప్రభుత్వం మాత్రం రైతుల గోడును పట్టించుకోకుండా ఆ నీటిని మిషన్ భగీరథకు తరలిస్తుందన్నారు. కారణం ఈ ప్రాజెక్ట్ కల్వకుంట్ల కుటుంబానికి బతుకుదెరువుగా మారిందని ఆరోపించారు. తక్షణమే రైతులకు నీటిని విడుదల చేయాలని, లేని పక్షంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
ఆయన ఎమ్మెల్యే... అనుమతులు లేకుండా...
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తీరుపై విమర్శలు కరీంనగర్ : ప్రజాప్రతినిధిగా ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన ఓ ఎమ్మెల్యే అందుకు భిన్నంగా నడుచుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలు ప్రజలకే తప్ప తనకు వర్తించవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆదాయం కోసం ఏకంగా ఓ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్న ఆయన మున్సిపల్ నుంచి ఎటువంటి అనుమతు లు తీసుకోకుండానే దర్జాగా పనులు చేపడుతున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినప్పటికీ ఎమ్మెల్యే కావడంతో వారు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు మెట్పల్లి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారి పక్కన అర ఎకరం పైగా స్థలం ఉంది. మొదటి నుంచి ఆ స్థలంలోనే ఆయన నివాస భవనం ఏర్పాటు చేసుకున్నారు. నాలుగేళ్ల క్రితం అదే స్థలంలో మరో చోట విశాలమైన నూతన భవనాన్ని నిర్మించుకున్నారు. పాత నివాస భవనాన్ని కూల్చి దాని స్థానంలో ఇటీవలనే కుటుంబసభ్యుల పేరు మీద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు ఆదనంగా మరికొన్ని అంతస్తులతో సుమారు 300 గజాల స్థలంలో ఈ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా... షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం మున్సిపల్ కార్యాలయం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే పనులను మొదలు పెట్టారు. మున్సిపాలిటీల చట్టం ప్రకారం... భవనం నిర్మించేవారు ఇంజనీరింగ్ ప్లాన్‌తో ముందుగా మున్సిపల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తును టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్దారించుకున్న తర్వాత నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలి. అనుమతి పత్రాల్లేకుండా నిర్మాణం చేపట్టరాదు. కాని ఎమ్మెల్యే ఇదేమీ పట్టించుకోకుండా కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. అనుమతులు లేవు ఎమ్మెల్యే నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్‌కు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఇటీవలనే తన భార్య పేరు మీద అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి సంబంధిత స్థలాన్ని పరిశీలిస్తున్నారు. రెండ్రోజుల్లో అనుమతి పత్రం మంజూరు చేస్తాం. - శైలజ, మున్సిపల్ కమిషనర్ గతంలోనూ అంతే.. ప్రస్తుతం నిర్మిస్తున్న కాంప్లెక్స్ విషయంలోనే కాదు... నాలుగేళ్ల క్రితం నిర్మించిన నివాస భవన విషయంలోనూ ఎమ్మెల్యే మున్సిపల్ నిబంధనలను బేఖాతరు చేశారు. ఆ సమయంలో భవనానికి మున్సిపల్ నుంచి జీ+2కు అనుమతి తీసుకున్న ఆయన ఆ తర్వాత మరో అంతస్తును నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. దానిని క్రమబద్దీకరించుకోవ డానికి ఇటీవలనే బీపీఎస్ కింద దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. చోద్యం చూస్తున్న అధికారులు.. జాతీయ రహదారి పక్కనే ఎమ్మెల్యే అనుమతి లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మున్సిపల్ కమిషనర్‌తోపాటు ఇతర మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగే సమావేశాలకు తరచూ హాజరవుతుంటారు. అక్కడే గతనెల రోజులుగా పనులు జరుగుతున్న విషయం కళ్లముందు కనిపిస్తున్నా స్పందించడం లేదు. ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి సామాన్య ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించే అధికారులు ఎమ్మెల్యే విషయంలో ఉదాసీనత కనబర్చడం ఎంతవరకు సమంజసమనే విమర్శలు ఎదురవుతున్నాయి.