సాక్షి, జగిత్యాల : రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ముగిసి.. ప్రచార హోరు పుంజుకుంటుంది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి ఇంటింటికి వెళ్లి చెప్పులు పంచుతూ.. వెరైటీ ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. వివరాలు.. జిల్లాలోని కొరుట్ల నియోజవర్గం నుంచి ఆకుల హన్మంతు అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మంతు ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించాల్సిందిగా ఓటర్లకు మనవి చేశారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే తాను ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తానన్నారు.
ఒక వేళ మాట తప్పితే పబ్లిక్‌గా తనను చెప్పు తీసుకుని కొట్టండంటూ ఓటర్లకు చెప్పులను కూడా పంచారు. హామీలను నెరవేర్చకపోతే తనను పదవి నుంచి తొలగించవచ్చంటూ..ముందే సిద్ధం చేసి పెట్టుకున్న రాజీనామా పత్రాన్ని కూడా జనాలకు చూపిస్తున్నారు. ఈ విషయం గురించి హన్మంతు మాట్లాడుతూ.. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకే తాను ఇలా ప్రచారం చేస్తున్నానంటూ తెలిపారు. అయితే కోరుట్ల నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పోటీచేస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు విజయం సాధించిన విద్యాసాగర్ రావు వరుసగా నాల్గోసారి విజయం సాధించాలని ఉవ్విళూరుతుండగా.. అధికార పార్టీ అభ్యర్థి మీద విజయం సాధించాలని హన్మంతు కృషి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment