సాక్షి, అమరావతి: పట్టణాల్లోని పేదలకు తక్కువ మొత్తానికి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన అమృత్ (అటల్‌మిషన్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్) పట్టణాల్లో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రోత్సాహాలు అందుబాటులోకి రానున్నాయి. సాలీనా రూ.500 ఇంటి పన్ను చెల్లించే బీపీఎల్ కుటుంబాలకు రూ.250కే కుళాయి కనెక్షన్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీలయినంత ఎక్కువ మందికి ఈ కనెక్షన్లు ఇచ్చేందుకు వీలుగా ఆయా పట్టణాల్లో రక్షిత మంచినీటి సరఫరా పథకాలను సిద్ధం చేస్తున్నారు. కనెక్షన్లు తీసుకోవాలంటూ కొన్ని పట్టణాల్లో మున్సిపల్ అధికారులు ప్రచారం కూడా ప్రారంభించారు. గ్రేటర్ విశాఖలో బీపీఎల్ కుటుంబాల వివరాలను సేకరించి కనెక్షన్లు కోసం దరఖాస్తు చేయాలని అక్కడి అధికారులు సమాచారం కూడా ఇస్తున్నారు.
వచ్చే అక్టోబర్‌లోపు కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికి అనువుగా అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2015–16లో రాష్ట్రంలోని 31 పట్టణాల్లో కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ పట్టణాల్లో రక్షిత మంచినీరు, భూగర్భ మురుగునీటి సరఫరా పథకాలను చేపట్టేందుకు రూ.2000 కోట్లు విడుదల చేసింది. ఆ పట్టణాల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఆ నేపథ్యంలోనే కుళాయి కనెక్షన్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాదాపు 16 లక్షల కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు అనువుగా ఈ పథకాలు చేపట్టారు. తెల్లరేషన్ కార్డు కలిగి, సాలీనా రూ.500 ఇంటి పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
కనెక్షన్ ఇచ్చే సమయంలో పైపులు తదితరాలకు రూ.1000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నందున బీపీఎల్ కుటుంబాలు ఎనిమిది వారాల్లో కుళాయి కనెక్షన్ డిపాజిట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. గ్రేటర్ విశాఖలో వచ్చే అక్టోబరులోపు రెండు లక్షల కనెక్షన్లు ఇచ్చేందుకు అనువుగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్ధతోపాటు మున్సిపాల్టీల్లో దరఖాస్తు చేసుకున్న వారికి కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. నరసరావుపేట మున్సిపాల్టీలో దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లో కుళాయి అమర్చుతున్నారు.
గుంటూరు జిల్లాలో దాదాపు 60 వేల కనెక్షన్లు ఇచ్చేందుకు అనువుగా రక్షిత మంచినీటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఏలూరు, మచిలీపట్నం, నెల్లూరు, అనంతపురం, కాకినాడ పట్టణాల్లోని అధికారులు బీపీఎల్ కుటుంబాలు చెల్లిస్తున్న ఇంటిపన్ను రూ.500 నుంచి రూ.750లకు పెంచితే మరి కొన్ని కుటుంబాలకు కుళాయి కనెక్షన్ పొందే అవకాశం ఏర్పడుతుందని, ఆ మేరకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పంపారు.
రూ.250కే కుళాయి కనెక్షన్
Published Mon, Jul 2 2018 4:54 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment