హెచ్‌ఎం బదిలీ వెనుక రాజకీయం?
- అన్యాక్రాంతమైన పాఠశాల స్థలాన్ని గుర్తించిన హెచ్‌ఎం
- ఒత్తిళ్లతో సస్పెండ్ చేయించిన కబ్జాదారులు
- విచారణ అనంతరం మళ్లీ పోస్టింగ్
హొసూరు: స్థానిక మున్సిపల్ పరిధిలోని ముత్తురాయన్‌జీబీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయినిపై వివాదం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ వివాదం రాజకీయ రంగును పులుముకుంటోంది. అసలు విషయాన్ని పక్కనపెట్టి బదిలీ పేరుతో ప్రధానోపాధ్యాయిని బలి చేయాలని పథకం పన్నినట్లు విశ్లేషకులు అంటున్నారు. 1957న తెలుగు ప్రాథమిక పాఠశాలను ముత్తురాయన్‌జీబీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
సర్వే 314లో 97 సెంట్లు ప్రభుత్వ భూమిలో ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. 50 నుంచి 60 మంది విద్యార్థులే ఈ పాఠశాలలో చదువుకుంటుండేవారు. గుట్టు చప్పుడు కాకుండా ఈ పాఠశాలను తమిళ పాఠశాలగా మార్చివేశారు. 2013-14లో శారదమ్మ ప్రధానోపాధ్యాయినిగా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ పాఠశాల అభివృద్ధికి ఆమె చర్యలు చేపట్టారు. 300 కంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను చేర్పించారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్లమీడియం ప్రారంభించగానే ఈ పాఠశాల ఆంగ్లమీడియం పాఠశాలగా మారింది. ఈ పాఠశాలకు ఉత్తమ పాఠశాలగా గుర్తింపు కూడా ప్రభుత్వం అందజేసింది.
పాఠశాల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయిని చేపట్టిన చర్యలలో భాగంగా పాఠశాల స్థలాన్ని కొందరు కబ్జాదారులు ఆక్రమించుకోవడం వెలుగు చూసింది. ఈ విషయం వెలుగులోకి వస్తుందని కొందరు ప్రధానోపాధ్యాయినిపై తప్పుడు ఫిర్యాదులు చేసి సస్పెండ్ చేయించారు. పాఠశాల సహ ఉపాధ్యాయులు కూడా ప్రధానోపాధ్యాయినికి సహకరించడం లేదని విమర్శలు కూడా చోటు చేసుకున్నాయి. 12.02.2015న సస్పెండ్ అయిన ప్రధానోపాధ్యాయిని విచారణ అనంతరం 29.05.2015న మళ్లీ ఉద్యోగం పొంది పాఠశాలకు రావడంతో పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లితండ్రులను ప్రేరేపించి ఆందోళన బాట చేపట్టించారు.
కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా కావడం వెలుగు చూస్తే సమస్యలు వస్తాయనే ఆలోచనతో ప్రధానోపాధ్యాయినిని తొలగిం చాలనే డిమాండ్ చేస్తున్నారని ఒక వర్గం వాదిస్తుంది. సబ్‌కలెక్టర్ విచారణ జరిపి భూకబ్జాను విడిపించి పాఠశాలను అభివదిృ చేయాలని ముత్తురాయన్‌జీబీ ప్రాంత విద్యావేత్తలు కోరుతున్నారు.