‘అమృత్’ పరిధిలోకి సిరిసిల్ల
► మురికి నీటి శుద్ధి ప్లాంటు ఏర్పాటు
► జూన్‌లో ఢిల్లీకి సిరిసిల్ల కౌన్సిలర్ల బృందం
► కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్
సిరిసిల్ల : కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘అమృత్’ పథకం పరిధిలోకి సిరిసిల్లను చేర్పించేందుకు కృషి చేస్తున్నామని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని కార్మికవాడల్లో శనివారం ఉదయం 6.30 నుంచి 10.30 గంటల వరకు కాలినడకన పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సిరిసిల్ల కార్మికవాడల్లోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ‘అమృత్’లో సిరిసిల్లకు స్థానం లభిస్తే ఏటా పట్టణాభివృద్ధికి కోట్లాది నిధులు మంజూరవుతాయని చెప్పారు. శివారు గ్రామాలను పట్టణంలో విలీనం చేసే ప్రతిపాదనను పరిశీలించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.
పట్టణ జనాభా లక్ష వరకు ఉంటే కేంద్రం ద్వారా ఎక్కువ నిధులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. జూన్‌లో సిరిసిల్ల కౌన్సిలర్ల బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడిని కలుస్తామన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, వైస్ చైర్మన్ తవుటు కనకయ్య, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పార్టీ నాయకులు చీటి నర్సింగారావు, మంచె శ్రీనివాస్, సయూద్‌ఖాన్, దార్నం లక్ష్మీనారాయణ, గూడూరి ప్రవీణ్, కొమిరె సంజీవ్, గడ్డం నర్సయ్య, మున్సిపల్ కమిషనర్ సుమన్‌రావు, కౌన్సిలర్లు దార్నం అరుణ, గుండ్లపల్లి పూర్ణచందర్, బత్తుల వనజ, డీఈఈ ప్రభువర్ధన్‌రెడ్డి, ఏఈ రవికుమార్ ఉన్నారు.
తెలంగాణ రెజిమెంట్ పోలీస్ ఏర్పాటు
తెలంగాణ రెజిమెంట్ పోలీస్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుందని ఎంపీ తెలిపారు. సిరిసిల్లలో కానిస్టేబుల్ శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ఉదయం మానేరు తీరంలో కలిసి మాట్లాడారు. యువత కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, యువశక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలిపారు. తెలంగాణ రెజిమెంట్ పోలీస్ వ్యవస్థను నెలకొల్పేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. సిరిసిల్ల టౌన్ సీఐ జి.విజయ్‌కుమార్, ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, ‘సెస్’ వైస్‌చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.