tap connections
-
ఏపీలో 32.47 లక్షల కుళాయి కనెక్షన్ల లక్ష్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని నివాసాలన్నింటికీ కుళాయి కనెక్షన్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2021–22 ఆరి్థక సంవత్సరం వార్షిక ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ వార్షిక ప్రణాళికను శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్రానికి సమర్పించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 95.66 లక్షల కుటుంబాలు నివసిస్తుండగా 47.13 శాతం కుటుంబాలకు మంచినీటి కుళాయి కనెక్షన్లున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 32.47 లక్షల కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జల్‌జీవన్ మిషన్ కింద గత ఏడాదిన్నర కాలంలో 14.34 లక్షల కొళాయి కనెక్షన్లు ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 13 జిల్లాలు, 17,044 గ్రామాలను ‘హర్ ఘర్ జల్’గా రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,217 గ్రామాలను ‘హర్ ఘర్ జల్’ గా ప్రకటించారు. ఏపీకి జాతీయ కమిటీ ప్రశంస ఆంధ్రప్రదేశ్ రూపొందించిన వార్షిక కార్యాచరణ కార్యక్రమాన్ని పరిశీలించిన జాతీయ కమిటీ నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలు, షెడ్యూల్ కులాలు, తెగల వారు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలు, కరవు ప్రాంతాలు, నీరు అవసరమైన ప్రాంతాలు, సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కిందకి వచ్చే గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించింది. 2020 అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించిన 100 రోజుల కార్యాచరణ కింద 41,653 పాఠశాలలు, 42,722 అంగన్వాడీ కేంద్రాలు, 11,948 గ్రామ పంచాయతీ కార్యాలయాలు, 14,383 ఆరోగ్య కేంద్రాలకు మంచినీటిని పూర్తిగా పైపుల ద్వారా సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జాతీయ కమిటీ అభినందించింది. 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి పైపుల ద్వారా నీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ మిషన్ మార్గదర్శకాల మేరకు ఆంధ్రప్రదేశ్ 7,131 గ్రామాల్లో ఏర్పాటుచేసిన నీరు, పారిశుధ్య కమిటీలు మంచినీటి పథకాలు ఎక్కువకాలం సమర్థంగా పనిచేసేలా చూసి నీటిసమస్య పరిష్కారానికి దోహదపడే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన, నిర్వహణ, యాజమాన్య పద్ధతుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. 54,568 మందికి శిక్షణ గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులను పటిష్టం చేయడం, సరఫరాను మెరుగు పరచడం, వ్యర్థ జలాలను శుద్ధిచేసి తిరిగి వినియోగించడం వంటి అంశాలకు జల్‌జీవన్ మిషన్ ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం జిల్లా, ఉప జిల్లా స్థాయిలో 408 మంది నిపుణులను నియమించాలని ఆంధ్రప్రదేశ్ నిర్ణయించింది. ఇంజనీరింగ్ అనుభవం ఉన్న 54,568 మంది సిబ్బంది, వివిధస్థాయిల అధికారులు, గ్రామ కమిటీల సభ్యులు, స్వయంసహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. 18,536 మందికి ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పంపుల నిర్వహణల్లో శిక్షణ ఇచ్చి జల్‌జీవన్ మిషన్ కింద చేపట్టే నీటి ప్రాజెక్టుల నిర్వహణకు వినియోగించాలని నిర్ణయించింది. ప్రతి గ్రామంలో ఐదుగురు మహిళలకు నీటి నాణ్యత పరీక్ష పరికరాల వినియోగంలో శిక్షణ ఇవ్వనున్నారు. నీటి నాణ్యతను పరిశీలించడానికి రాష్ట్రంలో 9 ప్రయోగశాలలుండగా.. సబ్ డివిజన్ స్థాయిలో 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. గ్రామాల్లో మంచినీటి సరఫరా పరిశీలన, యాజమాన్యం కోసం సెన్సార్ ఆధారిత పరికరాలను వినియోగించాలని రాష్ట్రానికి జాతీయ కమిటీ సూచించింది. -
తెలుగు రాష్ట్రాలపై కేంద్రం ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ: ‘చిన్నారులకు సురక్షిత తాగునీరు’ నినాదంతో చేపట్టిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు నూటికి నూరు శాతం ప్రగతి కనబర్చడంపై జల వనరులపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. పాఠశా లలు, అంగన్వాడీలు, గిరిజన వసతి గృహాలకు సురక్షిత తాగునీటి సరఫరాపై 2020, అక్టోబర్ 2న ఈ కార్యక్రమాన్ని నిర్దేశించింది. స్థాయీ సంఘం తన 11వ నివేదికను సోమవారం పార్లమెంటుకు సమర్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో 42,655 అంగన్వాడీ కేంద్రాలకు, 41,619 పాఠశాలలకు నూటికి నూరు శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చినట్టు గుర్తించింది. 27,310 అంగన్వాడీలు, 22,882 పాఠశాలల్లో కనెక్షన్లు ఇవ్వడం ద్వారా తెలంగాణ నూటికి నూరు శాతం లక్ష్యాన్ని సాధించింది. ఈ రెండు విభాగాల్లోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే లక్ష్యాన్ని సాధించాయి. గ్రామ పంచాయతీల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు తగిన మౌలిక వసతులను సమకూర్చుకోవడంలో కూడా ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, మేఘాలయ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలు చక్కటి పనితీరు కనబరిచాయని గుర్తించింది. అయితే ఏపీలో 2018-19, 2019-20లో స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ) పథకం ద్వారా కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో వరసగా రూ. 987.39 కోట్లు, రూ. 1,034 కోట్లు ఖర్చు కాలేదని, అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది. తెలంగాణ, గోవాలకు ప్రశంసలు జల్‌జీవన్ మిషన్‌లో భాగంగా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేయడంలో తెలంగాణ, గోవా నూటికి నూరుశాతం లక్ష్యాన్ని సాధించడాన్ని స్థాయీ సంఘం ప్రశంసించింది. అయితే కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణంలో తెలంగాణ సహా పంజాబ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలు వెనుకబడ్డాయని వ్యాఖ్యానించింది. -
నల్లా.. గుల్ల
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ నల్లాలు పలు అపార్ట్మెంట్ వాసుల పాలిట శాపంగా మారుతున్నాయి. తెలిసీ తెలియక ఫ్లాట్స్కొనుగోలు చేసి..తీరా జలమండలి విజిలెన్స్ పోలీసుల తనిఖీల్లో అక్రమ నల్లాలు బయటపడితే సదరు బహుళ అంతస్తుల భవంతిలో నివసిస్తున్న అందరు ఫ్లాట్స్ ఓనర్లపై క్రిమినల్ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవలఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 150 మంది వినియోగదారులు ఈ జాబితాలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. కొనుగోలుకు ముందే సదరు భవనానికి జీహెచ్ఎంసీ నుంచి అన్నిరకాల నిర్మాణ అనుమతులు, జలమండలి నల్లా కనెక్షన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకుంటే ఈ చిక్కులు తప్పుతాయని జలమండలి అధికారులు స్పష్టం చేస్తున్నారు. అక్రమ నల్లాల దందా ఇలా... గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శరవేగంగా అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతోంది. ఆయా ప్రాంతాల్లో నిర్మితమౌతున్న బహుళ భవంతులకు నిర్మాణ విస్తీర్ణం, అంతస్తులు, ఫ్లాట్స్ సంఖ్య ఆధారంగా కనెక్షన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. జలమండలికి నిబంధనల మేరకు కనెక్షన్ చార్జీలు చెల్లించాలంటే రూ.8–10 లక్షల మధ్యన ఖర్చు అవుతుంది. అయితే కొందరు బిల్డర్లు కక్కుర్తిగా వ్యవహరించి క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో సదరు భవనానికి అక్రమ నల్లాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరికొందరు బిల్డర్లు 50 ఫ్లాట్స్ ఉన్న భవంతికి సైతం కేవలం గృహవినియోగ నల్లా 15 ఎంఎం కనెక్షన్ మాత్రమే అధికారికంగా తీసుకొని అనధికారికంగా 40 ఎంఎం నల్లాను ఏర్పాటుచేసుకుంటున్నారు. ఈ భాగోతాలన్నీ ఇటీవల జలమండలి విజిలెన్స్ పోలీసుల తనిఖీల్లో గుట్టలుగా బయటపడుతున్నాయి. కేసులపాలవుతున్నారిలా.. గ్రేటర్ పరిధిలోని 20 నిర్వహణ డివిజన్ల పరిధిలో జలమండలికి 9.80 లక్షల నల్లా కనెక్షన్లున్నాయి. ఇవి కాకుండా మహానగరంలో అక్రమనల్లాలు సుమారు లక్షకు పైగానే ఉన్నట్లు బోర్డు వర్గాల్లో బహిరంగ రహస్యమే. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సహకారంతో భూమి లోపలున్న అక్రమ నల్లాల గుట్టు తవ్విచూసినప్పుడే రట్టవుతోంది. జలమండలి సరఫరా చేస్తున్న విలువైన తాగునీటిలో సరఫరా, చౌర్యం తదితర నష్టాలు 40 శాతం మేర ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే అక్రమ నల్లాలున్న వినియోగదారులపై ఇటీవల జలమండలి విజిలెన్స్ పోలీసులు ఐపీసీ 430,379,269 సెక్షన్ల కింద సమీప పోలీస్స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదుచేస్తున్నారు. అక్రమార్కులకు భారీగా జరిమానా విధించడతోపాటు నేరం రుజువైన పక్షంలో ఐదేళ్ల వరకు జైలుశిక్ష పడుతుందని విజిలెన్స్ పోలీసులు స్పష్టంచేస్తున్నారు. ఇటీవలికాలంలో సుమారు 150 మంది వినియోగదారులపై ఇలాంటి కేసులు నమోదైనట్లు తెలిపారు. క్రమబద్ధీకరణ ఇలా... అక్రమనల్లాలు ఇప్పటికీ గుట్టుచప్పుడుగా కొనసాగుతున్న భవంతుల యజమానులు ఇప్పటికైనా కళ్లు తెరిచి జలమండలి నిర్దేశించిన రెట్టింపు కనెక్షన్ చార్జీలు(నిర్మాణ విస్తీర్ణాన్ని బట్టి), మూడేళ్లపాటు సరాసరి కనీస నీటిబిల్లును వాటర్‌బోర్డుకు చెల్లించి తమ అక్రమనల్లాలను క్రమబద్ధీకరించుకోవాలని జలమండలి అధికారులు సూచిస్తున్నారు. తాజాగా మరో గుట్టు రట్టు.. షాపూర్ నగర్‌లోని నెహ్రూనగర్‌కు చెందిన ఇంటినెంబర్– 66 భవనానికి అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్ ఉన్నట్లు సోమవారం జలమండలి విజిలెన్స్ అధికారుల తనిఖీలో గుర్తించారు. సదరు భవనానికి అక్రమ నల్లా కనెక్షన్ తొలగించడంతో పాటు సంబంధిత భవన యాజమాని జి. ప్రమీలపై జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఐపీసీ 269,430, 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిగ్గు తేలుస్తాం జలమండలి ఆదాయాని భారీగా గండికొడుతూ..గ్రేటర్ పరిధిలో పలు భవంతులకున్న అక్రమనల్లాల నిగ్గు తేల్చాలని బోర్డు విజిలెన్స్ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. అక్రమార్కులు దారికొచ్చేవరకు వరుస తనిఖీలు నిర్వహిస్తాం. వినియోగదారులు సైతం ఫ్లాట్స్ కొనుగోలుకు ముందు జీహెచ్ఎంసీ నుంచి భవన నిర్మాణ అనుమతులు, జలమండలి నల్లా కనెక్షన్ వివరాలు తనిఖీ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి. – ఎం.దానకిశోర్, జలమండలి ఎండీ -
నల్లా కనెక్షన్ల జారీకి ప్రత్యేక క్యాంపులు
సాక్షి, సిటీబ్యూరో: నూతన నల్లా కనెక్షన్ల జారీకి శివారు ప్రాంతాలు, ఔటర్ గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ అధికారులను ఆదేశించారు. శివార్లలో చేపట్టిన హడ్కో, ఔటర్ గ్రామాల్లో చేపట్టిన తాగునీటి పథకం పనులను సత్వరం పూర్తి చేయాలన్నారు. సోమవారం ఖైరతాబాద్‌లోనిజలమండలి ప్రధాన కార్యాలయంలో ఈ పథకాల పురోగతిపై సమీక్షించారు. హడ్కో, ఓఆర్ఆర్ ప్రాజెక్టుల్లో భాగంగా ఇంకా మిగిలి ఉన్న గ్యాపులు, జంక్షన్ల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల కింద నూతన నల్లా కనెక్షన్ల జారీపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 2వేల కిలోమీటర్ల ప్రధాన రహదారులపై ఉన్న మ్యాన్‌హోళ్లను రోడ్డుకు సమాంతరంగా సరిచేసే ప్రక్రియపై సంబంధిత సీజీఎంలు, జీఎంలతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఈ నెల చివరి వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జలమండలి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్లు ఎం.ఎల్లాస్వామి, డి. శ్రీధర్‌బాబు, ఆపరేషన్స్–2 డైరెక్టర్ పి.రవి, సంబంధిత ప్రాజెక్టు విభాగం సీజీఎంలు, జీఎంలు, నిర్వహణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
బడా కాంప్లెక్స్‌ల అక్రమనల్లాల గుట్టు రట్టు
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో బడా కాంప్లెక్స్లకున్న అక్రమ నల్లాల భాగోతం.. జలమండలి విజిలెన్స్ పోలీసుల తనిఖీల్లో రోజుకొకటి చొప్పున బయటపడుతుండడం కలకలం సృష్టిస్తోంది. జలమండలి పైపులైన్ నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్లు పొందిన ఓ బహుళఅంతస్తుల భవన యాజమానిపై విజిలెన్స్ పోలీసులు మంగళవారం క్రిమినల్ కేసు నమోదు చేశా రు. కేపీహెచ్‌బీ సెక్షన్ పరిధిలోని కూకట్పల్లి, ధర్మారెడ్డి కాలనీలో ఇంటి నెం.15–31–83/ఎన్ఆర్ భవనానికి రెండు లక్షలకు పైగా నీటిబిల్లు బకాయిపడడంతో సదరు భవనానికున్న (క్యాన్ నెం. 091543800) నల్లా కనెక్షన్‌ను 2017 డిసెంబర్ 12న జలమండలి అధికారులు తొలగించారు. అయినా తిరిగి బోర్డు అధికారు ల అనుమతి లేకుండా తొలగించిన నల్లా కనెక్షన్ అక్రమంగా ఏర్పాటు చేసు కున్నారు. దీనిని గుర్తించిన జలమండలి విజిలెన్స్ అధికారులు జలమండలి ఎండీ ఆదేశాల మేరకు ఈ నల్లా కనెక్షన్ తొలగించారు. సద రు భవన యజమానిపై కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 269,430, 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు జలమండలి విజిలెన్స్ విభా గం ఏసీపీ రవిచంద్రారెడ్డి తెలిపారు. జలమండలి అధికారుల అనుమతులు లేకు ండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. గ్రేటర్లో సుమారు లక్ష అక్రమ నల్లాలు..? మహానగర పరిధిలోని పలు బహుళఅంతస్తుల భవనాలు, కాంప్లెక్స్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఆస్పత్రులు, ఫంక్షన్‌హాళ్లు, పాఠశాలలు, మాల్స్‌లకు అక్రమనల్లాలు సుమారు లక్ష వరకు ఉన్నట్లు జలమండలి వర్గాల్లో బహిరంగ రహస్యమే. అయితే విజిలెన్స్ పోలీసులు తనిఖీలు జరిపినప్పుడే ఈ గుట్టు ఒక్కొక్కటిగా బయటపడుతుండడం గమనార్హం. ఈ అక్రమనల్లాల గుట్టు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లైన్మెన్లు, మీటర్రీడర్లు, మేనేజర్లు, డీజీఎంలకు తెలిసినప్పటికీ ఆయా భవనాల యజమానులతో ఉన్న మామూళ్లబంధం, సత్సంబంధాల కారణంగా అక్రమనల్లాల గుట్టు ను విజిలెన్స్ పోలీసులకు చేరవేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.విజిలెన్స్ పోలీసులు అడిగిన సమాచారం ఇచ్చేందుకు సైతం సదరు క్షేత్రస్థాయి అధికారులు విముఖత చూపుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. -
నల్లా ‘సౌ’లత్..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: నల్లా కనెక్షన్ డిపాజిట్లు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరనున్నది. మిషన్ భగీరథ పథకం ద్వారా పట్టణాలు, నగరాలకు స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం పంపు కనెక్షన్ డిపాజిట్లను రూ.100కు తగ్గించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను ప్రభుత్వం రేపో.. మాపో జారీ చేయనుంది. ఇప్పటివరకు జిల్లాలోని ఖమ్మంతోపాటు మధిర, వైరా, సత్తుపల్లి ప్రాంతాల్లో ఉన్న నివాసాలన్నింట్లో.. 50 శాతం మంది మాత్రమే పంపు కనెక్షన్లు కలిగి ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లాలోని అన్ని నివాస ప్రాంతాల్లో పంపు కనెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు సెక్యూరిటీ డిపాజిట్ ఎక్కువగా ఉండడంతో ఇంటి యజమానులు ముందుకు రాలేదు. ప్రస్తుతం డిపాజిట్లు తగ్గించడంతో నూటికి నూరు శాతం మంది పంపు కనెక్షన్లు తీసుకునే అవకాశం ఉంది. అక్రమ కనెక్షన్లను సైతం సక్రమంగా మార్చుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ద్వారా పంపు కనెక్షన్లు తీసుకోవాలంటే డిపాజిట్‌గా చెల్లించే సొమ్ము ఎక్కువగా ఉంటోంది. అయితే ప్రజలందరికీ సురక్షితమైన, మంచినీటిని అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం పంపు కనెక్షన్లకు ఉన్న డిపాజిట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి పంపు కనెక్షన్ కావాలంటే రూపాయి డిపాజిట్‌గా చెల్లిస్తే సరిపోయేది. ఇతరులు పంపు కనెక్షన్ తీసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.6,500 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే నెలకు రూ.110 చెల్లించాలి. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పంపు కనెక్షన్ కావాల్సిన వారు సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ఇక పంపు బిల్లు ప్రతినెలా రూ.110 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఖమ్మం కార్పొరేషన్లో.. నగరంలో సుమారు 4 లక్షల వరకు జనాభా ఉన్నారు.. మొన్నటి వరకు మున్సిపాలిటీగా ఉన్న పట్టణం తొమ్మిది విలీన గ్రామాలతో కార్పొరేషన్‌గా అవతరించింది. నగర పరిధిలో 63,304 గృహాలు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఇందులో 31,500 మాత్రమే పంపు కనెక్షన్లు ఉన్నాయి. కేవలం 50 శాతం మంది మాత్రమే పంపు కనెక్షన్లు కలిగి ఉన్నారు. ప్రస్తుతం డిపాజిట్‌ను రూ.100కు తగ్గించడంతో మధ్య తరగతి వర్గాలకు ఊరట లభించనున్నది. కేవలం నెలవారీ పన్ను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కార్పొరేషన్లో ఇప్పటివరకు 217 పంపు కనెక్షన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. డిపాజిట్ తగ్గడంతో వాటిని పరిష్కరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీల్లోనూ పెరగనున్న కనెక్షన్లు.. జిల్లాలోని వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీల్లో కూడా అనేక గృహాలకు పంపు కనెక్షన్లు లేవు. సెక్యూరిటీ డిపాజిట్ ఎక్కువగా ఉందనే కారణంతో అనేక మంది పంపు కనెక్షన్లు పెట్టించుకోలేదు. ప్రస్తుతం సెక్యూరిటీ డిపాజిట్ రూ.100కు తగ్గించడంతో ఈ మున్సిపాలిటీల్లో కూడా పంపు కనెక్షన్లు పెరిగేందుకు ఆస్కారం ఉంది. మధిర మున్సిపాలిటీ పరిధిలో 9,048 గృహాలు ఉండగా.. 5,205 పంపు కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. రూపాయి డిపాజిట్ కింద ఇవ్వాల్సిన కనెక్షన్లు 2,688 పెండింగ్‌లో ఉన్నాయి. వైరాను ఇటీవలే మున్సిపాలిటీగా ప్రకటించారు. ఇక్కడ 6,355 గృహాలు ఉండగా.. 2,500 పంపు కనెక్షన్లు ఉన్నాయి. సత్తుపల్లి మున్సిపాలిటీలో 7,321 గృహాలు ఉండగా.. 5,316 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ పైపులైన్ల పనులు కూడా పూర్తి కావొచ్చాయి. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే దరఖాస్తు చేసుకున్న వారికి పంపు కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఆదేశాలు రాగానే.. పంపు కనెక్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే నగరంలో అమలు చేస్తాం. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఇంటికీ కనెక్షన్లు ఇస్తాం. నగరంలో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వచ్ఛమైన నీటిని పొందాలి. – జె.శ్రీనివాసరావు, కేఎంసీ కమిషనర్ -
18 రోజుల్లో నల్లా కనెక్షన్
సాక్షి,సిటీబ్యూరో: నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ 18 రోజుల్లో నూతన నల్లా కనెక్షన్ మంజూరు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. లేని పక్షంలో సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో నిర్వహణ, ప్రాజెక్టు విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రివేళల్లో నీటి సరఫరా జరిగే ప్రాంతాలను గుర్తించి..సరఫరా వేళలను మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఔటర్‌రింగ్‌రోడ్డు లోపల ఉన్న గ్రామాల దాహార్తిని తీర్చే ఓఆర్ఆర్ తాగునీటి పథకం పనులను ఫిబ్రవరి 15లోగా పూర్తిచేయాలని..హడ్కో ప్రాజెక్టులో మిగిలిన జంక్షన్లు, గ్యాపుల పనులను తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. హడ్కో, ఓఆర్ఆర్ తాగునీటి పథకం ప్రాజెక్టులు చేపట్టిన ప్రాంతాల్లో బీపీఎల్, నాన్ బీపీఎల్ నల్లా కనెక్షన్ల జారీపై సమగ్ర సర్వే నిర్వహించి నూతన నల్లా కనెక్షన్ల ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేయాలని, వినియోగదారులకు కనెక్షన్లు ఎలా పొందాలన్న అంశంపై అవగాహన కల్పించాలని సూచించారు. బోర్డు రెవెన్యూ ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు కృషిచేయాలన్నారు. లీకేజీలు, కలుషిత జలాలపై అందే ఫిర్యాదులను 24 గంటల్లోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. సింగిల్ విండో విభాగంలో నూతన నల్లా కనెక్షన్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అమీర్‌పేట్, మెఘల్ పురా, అల్వాల్, మల్కాజ్గిరి ప్రాంతాల నుంచి అరకొర నీటి సరఫరా, లో ప్రెషర్, బిల్లింగ్, రెవెన్యూలకు సంబంధించి వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. సత్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి. రవి, ప్రాజెక్టు డైరెక్టర్ డి. శ్రీధర్ బాబు, రెవెన్యూ డైరెక్టర్ బి. విజయ్ కుమార్ రెడ్డి, పీ అండ్ ఏ డైరెక్టర్ వి.ఎల్. ప్రవీణ్ కుమార్‌లతో పాటు ఓ అండ్ ఎమ్ సర్కిల్, రెవెన్యూ, ప్రాజెక్టు విభాగాలకు చెందిన చీఫ్ జనరల్ మేనేజర్లు, జీఎమ్‌లు, డీజీఎమ్లు, మేనేజర్లు పాల్గొన్నారు. -
కుళాయి.. లేదోయి..!
భీమవరం టౌన్: అమృత్ పథకం అమలులో ఉన్న పురపాలక సంఘాల్లో పేదరికానికి దిగువన ఉన్న వారికి ఉచితంగా కుళాయి కనెక్షన్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మధ్య తరగతి వర్గాలు కుళాయి కనెక్షన్‌కు ఒకేసారి సొమ్ము చెల్లించలేని పక్షంలో 8 వాయిదాలుగా చెల్లించవచ్చని కూడా ప్రకటించింది. గతంలో దివంగతనేత వైఎస్ హయాంలో ప్రకటించిన పేదలకు రూ.200కు కుళాయి కనెక్షన్ పథకం అమలులో ఉంది. ప్రస్తుత ప్రభుత్వం పేదలకు కుళాయి కనెక్షన్ ఉచితమని అందుకు అవసరమైన రోడ్డు కటింగ్, పైప్‌లైన్ అన్ని ఖర్చులను పురపాలక సంఘాలు భరిస్తాయని ప్రకటించింది. రూ.200 కూడా చెల్లించనవసరం లేకుండా, అన్ని ఖర్చులతో కలిపి ఉచితంగా కుళాయి కనెక్షన్ అందిస్తున్నామని అధికారపక్ష నాయకులు గొప్పగానే చెప్పుకున్నారు. దిమ్మతిరుగుతున్న షరతులు ఉచిత కుళాయి కనెక్షన్ అంటూనే కొన్ని నియమనిబంధనలు కూడా ప్రభుత్వం విధించింది. జీఓ ఎంఎస్ నం.159 ది.17–05–2018 తేదీ మున్సి పల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు పరిశీలిస్తే ఇంటి పన్ను ఏడాదికి రూ.500 తక్కువ ఉన్న పేదలకు మాత్రమే ఉచిత కుళాయి కనెక్షన్ లభిస్తుంది. దీంతో నిరుపేదలకు ఉచితంగా కుళాయి దక్కుతుందో లేదో అర్థంకాని పరిస్థితి. పట్టణాల్లో గతంలోనే ఇంటి పన్నులు భారీగా పెంచారు. రూ.500లోపు అర్థసంవత్సరానికే అధిక శాతం మందికి పన్ను వస్తుంది. ఇక ఏడాదికి రూ.500 అంటే ఉచిత కుళాయి గగనంగానే కనిపిస్తోంది. ప్రభుత్వం దృష్టికి.. భీమవరం మున్సిపల్ కౌన్సిలర్లు ఉచిత కుళాయి కనెక్షన్లో ఉన్న నిబంధనలు పేదలకు ఇబ్బందికరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు కౌన్సిల్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షానికి చెందిన కౌన్సిలర్లు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. పట్టణాల్లో ఇంటి పన్ను అధికంగానే ఉందని అలాంటి సమయంలో పేదలు ఉచిత కుళాయి పొందాలంటే ఏడాదికి రూ.500లోపే ఇంటి పన్ను కలిగి ఉండాలన్న నిబంధన పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం ఇంటి పన్ను ఏడాదికి రూ.1,000 చెల్లించాలన్న నిబంధన ఉంటే పేదలకు న్యాయం జరుగుతుందని కోరారు. దీనిపై గత రెండు సమావేశాలుగా పురపాలక అధ్యక్షుడు కె.గోవిందరావు, వైస్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు, కమిషనర్ సీహెచ్ నాగనర్సింహరావు, ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని ప్రకటించారు. ప్రభుత్వ స్పందన కరువు ఇప్పటివరకూ ఈ జీఓలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఆరు నెలలకే రూ.500 ఇంటి పన్ను చెల్లించే పేదలకు గతంలో రూ.200కే కుళాయి కనెక్షన్ దక్కేవి. ఇప్పుడు ఆ అవకాశం కూడా కనుమరుగయ్యేలా కనిపిస్తోంది. ఏడాదికి రూ.500 ఇంటి పన్ను నిబంధన తొలగించి ఇప్పుడు అమలు జరుగుతున్న విధంగానే రూ.200కే కుళాయి కనెక్షన్ ఇచ్చి రోడ్డు కటింగ్ చార్జీలను కూడా పురపాలక సంఘాలే ఉచితంగా భరిస్తే బాగుంటుందని కౌన్సిలర్లు సూచిస్తున్నారు. వైఎస్ హయాం నుంచి ఇప్పటి వరకూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమాని ఇప్పటివరకూ తెల్ల రేషన్‌కార్డు కలిగి ఆరు నెలలకే రూ.500 లోపు పన్ను చెల్లించే పేదలందరికీ రూ.200కే కుళాయి కనెక్షన్ మంజూరు చేస్తున్నారు. కుళాయి కనెక్షన్ నిమిత్తం రోడ్డు కటింగ్ చార్జీలు కూడా పురపాలక సంఘాలే భరించాలని అప్పట్లో వైఎస్సార్ ఆదేశించారు. అయితే ఆర్థిక సమస్యలతో ఉన్న పురపాలక సంఘాలు రోడ్డు కటింగ్ చార్జీలు భరించలేమని చెప్పాయి. ఆ తర్వాత వైఎస్ ప్రభుత్వమే మున్సిపల్ ఉద్యోగులకు జీతాలు చెల్లించే వరం ప్రకటించింది. అయినా పురపాలకులు కుళాయి కనెక్షన్ నిమిత్తం రోడ్డు కటింగ్ చార్జీలను పేదలపైనే భారం మోపారు. ఏడాదికి రూ.1,000 పన్ను చెల్లించే పేదలు, మధ్యతరగతి కుటుంబాలు కూడా రూ.200కే కుళాయి కనెక్షన్ పొందేగలిగే అవకాశం ఏర్పడింది. కాని ఇప్పటి ప్రభుత్వం ఏడాదికి రూ.500 ఇంటి పన్ను చెల్లించేవారికి మాత్రమే ఉచిత కుళాయి అని చెప్పడం వలన చాలా మందికి ఈ అవకాశం దక్కేలా కనిపించడం లేదు. -
రూ.250కే కుళాయి కనెక్షన్
సాక్షి, అమరావతి: పట్టణాల్లోని పేదలకు తక్కువ మొత్తానికి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన అమృత్ (అటల్‌మిషన్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్) పట్టణాల్లో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రోత్సాహాలు అందుబాటులోకి రానున్నాయి. సాలీనా రూ.500 ఇంటి పన్ను చెల్లించే బీపీఎల్ కుటుంబాలకు రూ.250కే కుళాయి కనెక్షన్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీలయినంత ఎక్కువ మందికి ఈ కనెక్షన్లు ఇచ్చేందుకు వీలుగా ఆయా పట్టణాల్లో రక్షిత మంచినీటి సరఫరా పథకాలను సిద్ధం చేస్తున్నారు. కనెక్షన్లు తీసుకోవాలంటూ కొన్ని పట్టణాల్లో మున్సిపల్ అధికారులు ప్రచారం కూడా ప్రారంభించారు. గ్రేటర్ విశాఖలో బీపీఎల్ కుటుంబాల వివరాలను సేకరించి కనెక్షన్లు కోసం దరఖాస్తు చేయాలని అక్కడి అధికారులు సమాచారం కూడా ఇస్తున్నారు. వచ్చే అక్టోబర్‌లోపు కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికి అనువుగా అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2015–16లో రాష్ట్రంలోని 31 పట్టణాల్లో కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ పట్టణాల్లో రక్షిత మంచినీరు, భూగర్భ మురుగునీటి సరఫరా పథకాలను చేపట్టేందుకు రూ.2000 కోట్లు విడుదల చేసింది. ఆ పట్టణాల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఆ నేపథ్యంలోనే కుళాయి కనెక్షన్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాదాపు 16 లక్షల కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు అనువుగా ఈ పథకాలు చేపట్టారు. తెల్లరేషన్ కార్డు కలిగి, సాలీనా రూ.500 ఇంటి పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. కనెక్షన్ ఇచ్చే సమయంలో పైపులు తదితరాలకు రూ.1000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నందున బీపీఎల్ కుటుంబాలు ఎనిమిది వారాల్లో కుళాయి కనెక్షన్ డిపాజిట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. గ్రేటర్ విశాఖలో వచ్చే అక్టోబరులోపు రెండు లక్షల కనెక్షన్లు ఇచ్చేందుకు అనువుగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్ధతోపాటు మున్సిపాల్టీల్లో దరఖాస్తు చేసుకున్న వారికి కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. నరసరావుపేట మున్సిపాల్టీలో దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లో కుళాయి అమర్చుతున్నారు. గుంటూరు జిల్లాలో దాదాపు 60 వేల కనెక్షన్లు ఇచ్చేందుకు అనువుగా రక్షిత మంచినీటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఏలూరు, మచిలీపట్నం, నెల్లూరు, అనంతపురం, కాకినాడ పట్టణాల్లోని అధికారులు బీపీఎల్ కుటుంబాలు చెల్లిస్తున్న ఇంటిపన్ను రూ.500 నుంచి రూ.750లకు పెంచితే మరి కొన్ని కుటుంబాలకు కుళాయి కనెక్షన్ పొందే అవకాశం ఏర్పడుతుందని, ఆ మేరకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పంపారు. -
రూపాయి నల్లా కనెక్షన్ జారీలో దళారులకు చెక్
సాక్షి, సిటీబ్యూరో: నిరుపేదలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ జారీలో దళారుల ప్రమేయానికి చెక్ పెట్టేందుకు జలమండలి సిద్ధమైంది. ఇప్పటికే కుత్భుల్లాపూర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో రూపాయి నల్లా కోసం దళారులను ఆశ్రయించి కొందరు రూ.2 వేలకుపైగా ఖర్చుచేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో....బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. నిరుపేదలు నివాసం ఉండే బస్తీలకు జీహెచ్ఎంసీ రిసోర్స్ సిబ్బంది, స్వయం సహాయక బృందాల మహిళలు నేరుగా దరఖాస్తులు తీసుకెళ్లి లబ్దిదారుల ఎదుటే పూర్తి వివరాలను దరఖాస్తులో పొందుపరచడంతోపాటు వారి నుంచి సంబంధిత అఫిడవిట్ (ప్రమాణ పత్రం), తెల్ల రేషన్‌కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను సేకరించనున్నారు. ఈమేరకు వారికి అవసరమైన శిక్షణనివ్వాలని నిర్ణయించారు. దీంతో నిరుపేదలకు జలమండలి సెక్షన్, డివిజన్ కార్యాలయాలు, స్కానింగ్, ఇంటర్నెట్ కేంద్రాల చుట్టూ తిరిగే అవస్థలు తప్పుతాయి. ఇక ఎవరైనా దళారులు డబ్బులు డిమాండ్‌చేసిన పక్షంలో జలమండలి కస్టమర్ కేర్ నెంబరు 155313కి ఫిర్యాదుచేయాలని బోర్డు వర్గాలు తెలిపాయి. నేడు కుత్భుల్లాపూర్‌లో శిక్షణ నిరుపేదలకు ఇచ్చే ఒక్క రూపాయి నల్లా కనెక్షన్ దరఖాస్తులను పూర్తిచేయడం, అవసరమైన దరఖాస్తుల స్వీకరణ వంటి అంశాలపై కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో రిసోర్స్ పర్సన్స్, స్వయం సహాయక బృందాల సభ్యులకు జలమండలి ఆధ్వర్యంలో బుధవారం శిక్షణనివ్వనున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటీకే గుర్తించిన 27 బస్తీల్లో దాదాపు 10వేల కుటుంబాలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ శిక్షణ అనంతరం మహిళ గ్రూపు సభ్యులు బస్తీల్లోని గృహ యాజమానుల దగ్గరికి నేరుగా వెళ్లి ఒక్క రూపాయి నల్లా పథకాన్ని వివరిస్తారు. -
ఇంటింటికీ కుళాయి..ఎప్పటికోయి..!
జంగారెడ్డిగూడెం రూరల్: వేసవి ప్రారంభంలోనే జిల్లావాసుల గొంతెండిపోతోంది. ఒక పక్క ఎండలు ముదురుతున్నాయి. వేసవిలో ఏర్పడే నీటి ఎద్దడిని నివారించేందుకు చేపట్టాల్సిన పనులు సైతం ప్రణా ళికల స్థాయిలోనే ఉన్నాయి. తాగునీటి సమస్యను తీర్చేందుకు చేపట్టాల్సిన ఇంటింటికీ కుళాయి పథకం ప్రణాళిక దశలోనే ఉంది. జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టుగా పేరున్న జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎ ర్రకాలువ జలాశయం మంచినీటి పథకాలు ముందుకు సాగడం లేదు. ఇంకెంత కాలం జిల్లావాసులు తాగునీటి ఎద్దడిని అధిగ మించేందుకు గతేడాది గ్రామస్థాయి నుంచి ఇంటింటా కుళాయిలు ఏర్పాటు చేసేం దుకు జిల్లా యంత్రాంగం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. జిల్లాలో ముంపు మండలాలు కుక్కునూరు, వేలేరుపాడు మినహా 46 మండలాల పరిధిలో సమగ్ర ప్రణాళికలు రూపొందించారు. ఈ పథకం ఇంకా కార్యరూపం దాల్చలేదు. సర్వే మొదలైందని అధికారులు చెబుతున్నారు. మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉందని అంటున్నారు. రూ.4.71 కోట్లతో యాక్షన్ ప్లాన్ వేసవిలో తాగునీటి ఎద్దడిని గుర్తించి ఆయా గ్రామాల్లో అవసరాన్ని తీర్చే క్రమంలో భాగంగా ఆర్డబ్ల్యూఎస్ శాఖ రూ.4 కోట్ల 71 లక్షల యాక్షన్ ప్లాన్‌ను రూపొం దించింది. 377 గ్రామాల్లో నీటి అవసరాలు తీర్చేందుకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఎర్రకాలువపై నీటి పథకాలసాకారం ఎప్పటికో.. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం ఏడాదంతా నీటితో కళకళలాడుతుంది. మెట్ట రైతులకు సాగునీటి అవసరార్థం నిర్మించిన ఈ జలాశయ నీటిని శుద్ధి చేసి గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి అందించాలనే లక్ష్యంతో గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా రూ.5 కోట్ల నిధులతో మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. జలాశయం నీటిని ఇక్కడ నిర్మించిన ట్యాంకుల ద్వారా ఫిల్టర్ చేసి జంగారెడ్డిగూడెం మండలంలో 21 పంచాయతీల్లోని గ్రామాలను నీటిని అందించేందుకు ఈ పథకాన్ని ఏర్పాటుచేశారు. అయితే అనుకున్న లక్ష్యం మేర తాగునీరు గ్రామాలకు అందటం లేదు. ఈ మంచినీటి పథకం ప్రారంభించి ఏళ్లు దాటుతున్నా పూర్తిస్థాయిలో తాగునీటి అందడం లేదు. 8 గ్రామాలకు 5 లక్షల లీటర్ల నీటిని మాత్రమే జలాశయం అందిస్తున్నారు. ఎ.పోలవరం, చిన్నంవారిగూడెం, పిషరీస్ కాలనీ, చల్లావారిగూడెం, తాడువాయి, మాన్నతగూడెం, జొన్నవారిగూడెం మంగిశెట్టిగూడెం, గొల్లగూడెం గ్రామాలకు మరికొద్ది రోజుల్లో నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఈ గ్రామాలకు కూడా నీటి సరఫరా జరిగితే మరో 5 లక్షల లీటర్ల నీరు పంపిణీ అవుతోంది. దీంతో పలుగ్రామాల్లో మంచినీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇదే జలాశయం నుంచి జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకి మంచినీటి అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. రూ.88 కోట్లలో 10 శా తం నగరపంచాయతీ, 10 శాతం ప్రభుత్వం, మిగిలిన 80 శాతం ఏషియన్ బ్యాం కు రుణంతో పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. పథకంలో భాగంగా ట్యాంకులు నిర్మించి 41 లక్షల లీటర్ల ఎర్రకాలువ జలాశయం నీటిని స్టోర్ చేస్తారు. అయితే ప్రస్తుతం ఈ పథకం ప్రారంభం కావడానికి మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. సర్వే మొదలైంది ఇంటింటికీ కుళాయి కనెక్షన్ ఏర్పాటుపై సర్వే మొదలైంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు మునిగిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ మండలాలు మినహా జిల్లా అంతా ఈ పథకం వర్తిస్తుంది. డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నాం. మరో నెల, రెండు నెలల్లో పూర్తయి అందుబాటులోకి ఈ పథకం రానుంది. ఈ వేసవిలో తాగునీటి అవసరాల కోసం రూ.4.71 కోట్లతో యాక్షన్ ప్లాన్ రూపొందించాం.– అమరేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ -
రూ.1కే నల్లా కనెక్షన్లు!
సాక్షి,సిటీబ్యూరో: మహా నగరంలో నిరుపేదలకు రూ.1కే నల్లా కనెక్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. కానీ స్టోరేజి రిజర్వాయర్లు, పైపులైన్ వ్యవస్థ అందుబాటులో ఉన్న పేదలకే ఈ మహా భాగ్యం దక్కనుంది. ప్రధాన నగరంలో సుమారు 10 లక్షల నిరుపేద కుటుంబాల దాహార్తిని తీర్చేందుకు సుమారు రూ.200 కోట్ల అంచనా వ్యయంతో 20 భారీ స్టోరేజి రిజర్వాయర్లను తక్షణం నిర్మించాల్సిన అవసరం ఉందని జలమండలి గుర్తించింది. వీటిని ఎక్కడ నిర్మించాలనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించింది. మహా నగరంలో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్లలో మంచినీటి సరఫరా వ్యవస్థ కోసం హడ్కో మంజూరు చేసిన రూ.1900 కోట్ల రుణంతో 55 స్టోరేజి రిజర్వాయర్లను (283 మిలియన్ లీటర్ల సామర్థ్యంగలవి) నిర్మిస్తున్నారు. ఈ పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా పూర్తి కానున్నాయి. ఇదే తరహాలో ప్రధాన నగరంలో రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రభుత్వం చేయూతనందిస్తే పేదల దాహార్తిని తీర్చే అవకాశం ఉంది. నగరంలో సుమారు మూడు వేల మంది బీపీఎల్ కుటుంబాల వారు రూ.1కే నల్లా కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. పెరుగుతున్న తాగునీటి అవసరాలు నగరంలో జనాభాతో పాటు తాగునీటి అవసరాలు పెరుగుతున్నాయి. 2021 నాటికి ప్రధాన నగరంలో 626 మిలియన్ లీటర్ల తాగునీరు అవసరమని జలమండలి అంచనా. ప్రస్తుతం 396 మిలియన్ లీటర్ల నీటి నిల్వకు అవసరమైన స్టోరేజి రిజర్వాయర్లు మాత్రమే ఉన్నాయి. మరో 230 మిలియన్ లీటర్ల నీటిని నిల్వ చేసి ఆ రిజర్వాయర్ల పరిధిలోని కాలనీలు, బస్తీలకు సరఫరాకు చేసేందుకు 20 స్టోరేజి రిజర్వాయర్లు నిర్మించాలని జలమండలి ప్రతిపాదించింది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే ఆ ప్రాంతాల నిరుపేదల దాహార్తి సమూలంగా తీరనుంది. ప్రతిపాదించిన రిజర్వాయర్ల సామర్థ్యం మిలియన్ లీటర్లలో 1.ప్రకాశ్‌నగర్ 3 2.మారేడ్‌పల్లి 5 3.హుస్సేన్‌సాగర్ 14 4.చిలకలగూడ 13 5.అడిక్‌మెట్ 8 6.నారాయణగూడ 8 7.రెడ్‌హిల్స్ – 8.ఆసిఫ్‌నగర్ 16 9.షేక్‌పేట్ 18 10.బంజారాహిల్స్ 31 11.జూబ్లీహిల్స్ 50 12.మీరాలం 4 13.మిశ్రిగంజ్ 4 14.అలియాబాద్ 4 15.జహానుమా 3 16.మైసారం 4 17.చాంద్రాయణగుట్ట 4 18. రియాసత్‌నగర్ 6 19.చంచల్‌గూడ 20 20.ఆస్మాన్‌ఘడ్ 15