సాక్షి,సిటీబ్యూరో: మహా నగరంలో నిరుపేదలకు రూ.1కే నల్లా కనెక్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. కానీ స్టోరేజి రిజర్వాయర్లు, పైపులైన్ వ్యవస్థ అందుబాటులో ఉన్న పేదలకే ఈ మహా భాగ్యం దక్కనుంది. ప్రధాన నగరంలో సుమారు 10 లక్షల నిరుపేద కుటుంబాల దాహార్తిని తీర్చేందుకు సుమారు రూ.200 కోట్ల అంచనా వ్యయంతో 20 భారీ స్టోరేజి రిజర్వాయర్లను తక్షణం నిర్మించాల్సిన అవసరం ఉందని జలమండలి గుర్తించింది. వీటిని ఎక్కడ నిర్మించాలనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించింది.
మహా నగరంలో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్లలో మంచినీటి సరఫరా వ్యవస్థ కోసం హడ్కో మంజూరు చేసిన రూ.1900 కోట్ల రుణంతో 55 స్టోరేజి రిజర్వాయర్లను (283 మిలియన్ లీటర్ల సామర్థ్యంగలవి) నిర్మిస్తున్నారు. ఈ పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా పూర్తి కానున్నాయి. ఇదే తరహాలో ప్రధాన నగరంలో రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రభుత్వం చేయూతనందిస్తే పేదల దాహార్తిని తీర్చే అవకాశం ఉంది. నగరంలో సుమారు మూడు వేల మంది బీపీఎల్ కుటుంబాల వారు రూ.1కే నల్లా కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
పెరుగుతున్న తాగునీటి అవసరాలు
నగరంలో జనాభాతో పాటు తాగునీటి అవసరాలు పెరుగుతున్నాయి. 2021 నాటికి ప్రధాన నగరంలో 626 మిలియన్ లీటర్ల తాగునీరు అవసరమని జలమండలి అంచనా. ప్రస్తుతం 396 మిలియన్ లీటర్ల నీటి నిల్వకు అవసరమైన స్టోరేజి రిజర్వాయర్లు మాత్రమే ఉన్నాయి. మరో 230 మిలియన్ లీటర్ల నీటిని నిల్వ చేసి ఆ రిజర్వాయర్ల పరిధిలోని కాలనీలు, బస్తీలకు సరఫరాకు చేసేందుకు 20 స్టోరేజి రిజర్వాయర్లు నిర్మించాలని జలమండలి ప్రతిపాదించింది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే ఆ ప్రాంతాల నిరుపేదల దాహార్తి సమూలంగా తీరనుంది.
ప్రతిపాదించిన రిజర్వాయర్ల సామర్థ్యం
మిలియన్ లీటర్లలో
1.ప్రకాశ్‌నగర్ 3
2.మారేడ్‌పల్లి 5
3.హుస్సేన్‌సాగర్ 14
4.చిలకలగూడ 13
5.అడిక్‌మెట్ 8
6.నారాయణగూడ 8
7.రెడ్‌హిల్స్ –
8.ఆసిఫ్‌నగర్ 16
9.షేక్‌పేట్ 18
10.బంజారాహిల్స్ 31
11.జూబ్లీహిల్స్ 50
12.మీరాలం 4
13.మిశ్రిగంజ్ 4
14.అలియాబాద్ 4
15.జహానుమా 3
16.మైసారం 4
17.చాంద్రాయణగుట్ట 4
18. రియాసత్‌నగర్ 6
19.చంచల్‌గూడ 20
20.ఆస్మాన్‌ఘడ్ 15