సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పాలనా విభాగాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకేరోజు కీలక విభాగాలైన జీహెచ్‌ఎంసీ, జలమండలి, హెచ్‌ఎండీఏల బాసులను ప్రభు త్వం బదిలీ చేసింది. ప్రస్తుతం బదిలీ అయిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, జలమండలి ఎండీ దానకిశోర్, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తమతమ విభాగాల్లో పాలనా పరంగా ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రభుత్వ వేగానికి తగ్గట్టు సంస్కరణలు తీసుకువచ్చారు. ముగ్గురూ సమర్థులుగా పేరు తెచ్చుకున్నప్పటికీ, కొత్త శాఖలపై పట్టు సాధించేందుకు కొంత సమయం పట్టనుంది.
ఎన్నికల నేపథ్యంలోనే బదిలీలు..!
ముందస్తు ఎన్నికలు జరగనున్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అందుకు ఊతమిస్తూ ప్రభుత్వం వీరు ముగ్గురినీ ఒకేసారి బదిలీ చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా జనార్దన్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా చిరంజీవులు బాధ్యతలు చేపట్టి త్వరలో మూడేళ్లు పూర్తికానుంది. దానకిశోర్ రెండేళ్ల క్రితం జలమండలి ఎండీగా పగ్గాలు చేపట్టారు. జనార్దన్‌రెడ్డి హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా కూడా వ్యవహరిçస్తుండడంతో ఆయన బదిలీ తప్పదని, మిగతా ఇద్దరి బదిలీలు కూడా జరగనున్నాయనే ఊహాగానాలు కొద్దిరోజులుగా అధికార వర్గాల్లో జరుగుతున్నాయి. అయితే అది ఇప్పుడే జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. ఎన్నికలకు ముందుగా జరిగిన ఈ బదిలీలతో ఆయా విభాగాల కొత్త బాస్‌లపై గురుతర బాధ్యతలున్నాయి. ఆయా శాఖల్లో చేపట్టిన పనులను ఎన్నికల నోటిఫికేషన్ లోగా పూర్తి చేసేందుకు కృషి చేయాల్సి ఉంది. ముఖ్యమైన వాటిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, రహదారుల అభివృద్ధి, ఫ్లై ఓవర్ల నిర్మాణం వంటివి ఉన్నాయి.
అవార్డుల జనార్దన్‌రెడ్డి..
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జనార్దన్‌రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేశారు. స్వచ్ఛ భారత్ అమలుకు శ్రద్ధ వహించారు. ‘స్వచ్ఛ నమస్కారం వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. ‘చెత్తను విడదీద్దాం.. కుటుంబాలుగా కలిసుందాం, మనం మారదాం– నగరాన్ని మారుద్దాం’ వంటి నినాదాలతో జాతీయస్థాయిలో జీహెచ్‌ఎంసీకి గుర్తింపు తెచ్చారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డుతో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు స్థల సేకరణ చేసినందుకు రాష్ట్రప్రభుత్వ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, జాతీయ స్థాయిలో పలు ‡ సంస్థల నుంచి బాండ్ల జారీ, స్వచ్ఛ కార్యక్రమాలు, ఇంధన పొదుపు, ఎన్నికల నిర్వహణ తదితర కార్యక్రమాలకు పలు అవార్డులు, రివార్డులు పొందారు. బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యే సమయంలో సైతం ఆయన ఘనవ్యర్థాల నిర్వహణలో ‘నవభారత్ టైమ్స్’ అవార్డును స్వీకరించేందుకు ముంబైలో ఉన్నారు.
సోషల్ అడిట్, పబ్లిక్ టాయ్‌లెట్స్, షీ టాయ్లెట్స్, ఫిర్యాదుల పరిష్కారానికి సోషల్ మీడియా, దోమలపై అవగాహనకు మస్కిటోయాప్, మాంసం దుకాణాల్లో ప్లాస్టిక్ నిషేధం, వివిధ ప్రభుత్వ విభాగాలతో కన్జర్వెన్స్ సమావేశాలు, ‘చెత్తకు విడాకులు, మాఇంటినేస్తం’ వంటి వందకుపైగా వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. పౌరులకు సత్వర సేవలకు టౌన్‌ప్లానింగ్‌లో ఆన్‌లైన్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు, ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సుల చెల్లింపు, పే అండ్ ప్లే, పారిశుధ్య కార్మికులకు బయోమెట్రిక్ హాజరును ఈయన ప్రారంభించారు. నోట్ల రద్దు సయంలో ఆన్‌లైన్ చెల్లింపులతో ఎక్కువ పన్ను వసూలు చేసిన కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ అగ్రగామిగా నిలవడంలో కీలక పాత్ర పోషించారు. జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే ఏ కమిషనర్ హయాంలో జరగని విధంగా అవినీతి ఆరోపణలపై యాభై మంది అధికారుల సస్పెన్షన్లు, అరెస్టులు ఈయన హయాంలోనే జరిగాయి. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఎక్కువకాలం కొనసాగిందీ ఈయనే. జీహెచ్‌ఎంసీ నుంచి హెచ్‌ఎండీఏకు బదిలీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీతో, స్వచ్ఛ కార్యక్రమాలతో విడదీయరాని అనుబంధం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. అన్నివర్గాల ప్రజలు, ఉద్యోగులు, వివిధ ప్రభుత్వశాఖలతో కలిసి పనిచేసే అవకాశం లభించిందన్నారు.
దానకిశోర్‌కు ప్రమోషన్..
జలమండలి మేనేజింగ్ డైరెక్టర్‌గా రెండేళ్లకు పైగా సేవలందించిన దానకిశోర్ బోర్డుపై తనదైన ముద్రవేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు తాగునీటి నాణ్యతను మెరుగుపరిచేందుకు అన్ని స్టోరేజీ రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ ఏర్పాటు చేశారు. దీంతో జలమండలి నల్లా నీటికి ఐఎస్‌ఓ ధ్రువీకరణ లభించింది. వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం జల్‌యాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్ మాధ్యమాల్లో ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు వాటిని సత్వర పరిష్కారానికి కృషి చేశారు. ఆయా సమస్యలను పరిష్కరించిన విధానంపై వినియోగదారుల నుంచి ప్రతిస్పందన తెలుసుకునేందుకు థర్డ్‌పార్టీ ఏజెన్సీలను రంగంలోకి దించారు. అరకొర తాగునీరు, కలుషిత జలాలు, ఉప్పొంగే మ్యాన్‌హోళ్లు, అధిక నీటి బిల్లుల మోత.. ఇలా సమస్య ఏదైనా 24 గంటల్లో పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. గోదావరి మొదటి దశ పథకాన్ని శరవేగంగా పూర్తిచేసి సగం నగరానికి దాహార్తిని దూరంచేయడం విశేషం. ఇరుకు వీధుల్లోనూ తేలికగా పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు 70 మినీ జెట్టింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. వీటి రాకతో నగరంలో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలకు భరోసా లభించడంతో పాటు ఉప్పొంగే మురుగు సమస్యలు గణనీయంగా తగ్గాయి. ఈ యంత్రాల వినియోగంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ కార్యాలయంతో పాటు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ప్రశంసించింది. ఆయన పనితీరును ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ సహా పలువురు దేశ, విదేశీ ప్రతినిధులు ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం అత్యంత కీలకమైన ‘బల్దియా బాస్’గా నియమించింది.
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి..
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు తనవంతు కృషి చేస్తానని జీహెచ్‌ఎంసీ కొత్త కమిషనర్‌గా నియమితులైన దానికిశోర్ అన్నారు. స్వచ్ఛ కార్యక్రమాల అమలుతోపాటు నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన పనులు సత్వరం పూర్తి చేసేందుకు కృషి చేస్తానన్నారు.
హెచ్‌ఎండీఏపై చిరంజీవి మార్క్
హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా మూడేళ్లు సేవంలందించిన చిరంజీవులు సంస్థలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలో నగరానికి మణిహారంలా నిలిచిన ఔటర్‌రింగ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కోకాపేట్ భూ వివాదంలో హెచ్‌ఎండీఏకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. ఉప్పల్ భగాయత్ ప్లాట్ల వేలం, డీపీఎంఎస్ విధానానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఈయన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కమిషనర్ అండ్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా బదిలీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment