ఏళ్లకు ఏళ్లుగా ఇక్కడే.. ఎందుకో?
ఎక్కడికి, ఎవరూ కదల్చలేరనే భరోసా
సదుపాయాలు, ఆదాయాలతో తిష్ట
జీహెచ్‌ఎంసీలో విచిత్ర పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ విభాగాల్లో బదిలీలు జరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీలోనూ బదిలీల పర్వం ప్రారంభమైంది. ఇప్పటి వరకు దాదాపు పదిమంది మున్సిపల్ కమిషనర్లు, ఇతర త్రా విభాగాల్లో ఒకరో, ఇద్దరివో బదిలీలు మాత్రమే జరిగాయి తప్ప కీలక విభాగాల్లో ఉన్న వారివి జరగలేదు. వారితో పాటు సీనియర్లుగా ఎంతోకాలంగా ఇక్కడే పాతుకుపోయిన ఉన్నతస్థాయిల్లోని వారి బదిలీలూ జరగలేదు. వారిలో చాలా మంది తామిక్కడే ఉంటామని, తమనెవరూ కదల్చలేరని సన్నిహితుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అందుకు కారణం మున్సిపల్ శాఖలో తమ హోదాకు తగిన పోస్టులు రాష్ట్రంలో ఇతర కార్పొరేషన్లలో ఖాళీ లేనందున తమను ఎక్కడికీ పంపలేరని చెబుతున్నారు. రాష్ట్రంలోని పెద్ద కార్పొరేషన్లకు ఐఏఎస్ అధికారులు కమిషనర్లుగా ఉన్నందున, తమను ఎక్కడికీ ఎవరూ కదల్చలేరని భరోసాగా ఉన్నారు. అంతేకాదు బదిలీలు 40 శాతానికి మించి జరగరాదనే నిబంధనతోనూ అన్ని స్థాయిల పోస్టులను పరిగణనలోకి తీసుకొని తమను కదల్చలేరని పదేళ్లకుపైగా పని చేస్తున్నవారు సైతం నమ్మకంగా ఉన్నారు. వారే కాదు.. ఎంటమాలజీ వంటి విభాగాల్లోని వారిది సైతం అదే ధీమా. సీనియర్ ఎంటమాలజిస్టు పోస్టు లు రాష్ట్రంలో చాలా స్వల్పంగా మాత్రమే ఉన్నందున తాము ఇక్కడే ఉంటామని ధీమాగా ఉన్నారు.
కదలరు అంతే..
జీహెచ్‌ఎంసీలో దాదాపు రెండేళ్లు పనిచేసినా చాలు ఎవరైనే సరే ఇక్కడినుంచి ఇంకెక్కడికీ కదలరు. అందుకు కారణం ఇక్కడ లభించే సదుపాయాలు, పై ఆదాయాలు ఇంకెక్కడా లభించవు. అందుకే పదోన్నతులను సైతం కాదనుకొని ఇక్కడే ఉంటున్నవారు. ఉండేందుకు ప్రయతి్నస్తున్న వారూ ఉన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో కమిషనర్ స్థాయి వారికి, క్షేత్రస్థాయి పర్యటనలు ఉండేవారికి మాత్రమే వాహన సదుపాయం ఉంటుంది. ఇక్కడైతే సూపరింటెండెంట్‌లకు, అంతకంటే దిగువ స్థాయి వారికి సైతం వాహన సదుపాయం ఉంటుంది. అంతేకాదు.. కార్యాలయం నుంచి కాలు బయట పెట్టని వారికి సైతం వాహన సదుపాయం ఉంటుంది. దాన్ని మరోలా వినియోగించుకొని నెలవారీ ఆదాయం పొందుతున్న వారూ తక్కువేం లేరు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా వివిధ వై¿ోగాలకు అవకాశం ఉన్నందున, వాటికి అలవడిన వారు ఇక్కడి నుంచి కదలడం లేదు.
వచ్చేవారే.. వెళ్లేవారు లేరు
ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యుటేషన్లపై బల్దియాకు వచ్చిన వారు సైతం ఇక్కడి నుంచి కదలనే కదలరు. డిప్యుటేషన్లు ముగిసినా, ఏళ్లకేళ్లుగా తిష్టవేసిన ఎందరో ఉన్నారు. యూసీడీ విభాగం నుంచి మొదలు పెడితే ఇలాంటి వారికీ లెక్కేలేదు. బదిలీల సమయంలో సైతం వారిని కదల్చలేకపోతున్నారంటే వారి ‘పవర్’ ఏమిటో అంచనా వేసుకోవచ్చు. మున్సిపల్ శాఖకు చెందిన వారు ఎందరో కొందరు బదిలీ అవుతున్నప్పటికీ, ఇతర విభాగాల వారు మాత్రం కావడం లేదంటే వారి హవా ఎంతో ఊహించుకోవచ్చు.
ఏళ్లకేళ్లుగా..
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ హోదాలో కొనసాగుతున్న వారు ఎందరో ఉన్నారు. వీరిలో ఇరవయ్యేళ్లకుపైగా ఇక్కడే ఉంటున్నవారు ఎందరో ఉన్నారు. అంతేకాదు.. 30 నుంచి 40 ఏళ్లుగా నగరంలోనే ఉంటున్నవారు కూడా ఉన్నారంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు. సీనియర్లయిన తమను ఎక్కడకూ పంపలేరని భావిస్తున్న వారు ఇతర ప్రాంతాల్లో తమ హోదాకు తగ్గ పోస్టుల్లేవంటున్నారు. కానీ.. ఇతర విభాగాల నుంచి ఇక్కడికి డిప్యుటేషన్‌పై వస్తుండగా లేనిది మున్సిపల్ శాఖ నుంచి ఇతర విభాగాలకు ఎందుకు డిప్యుటేషన్లపై వెళ్లడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది. అన్నింటికీ ఒకటే సమాధానం. సదుపాయాలు.. పై ఆదాయం. ప్రత్యేక చాంబర్లు. అందుకే వచ్చేవారు తప్ప వెళ్లేవారు కనబడటం లేదు. గతంలో ఇద్దరు ముగ్గురు అధికారులు మాత్రం అలా ఇతర విభాగాలకు వెళ్లారు. అలా మిగతా వారెందుకు వెళ్లరో వారితోపాటు ఉన్నతాధికారులకే తెలియాలి.
బల్దియాకు భారం..
స్టాఫింగ్ ప్యాటర్న్‌పై ప్రసాదరావు కమిటీ సిఫార్సుల మేరకు జీహెచ్‌ఎంసీలో ఆరుగురు అడిషనల్ కమిషనర్లు మాత్రమే ఉండాలి. కానీ ప్రస్తుతం డజను మంది ఉన్నారు. గతంలో ఐదారుగురు అడిషనల్ కమిషనర్లు మాత్రమే అన్ని విభాగాలనూ నిర్వహించేవారు. ప్రస్తుతం అధికారులు పెరిగారు. పనులు తగ్గాయి. పనులు తగ్గినందున సమర్థంగా పని చేస్తున్నారా అంటే అదీ లేదు. ఎస్టేట్స్, అడ్వర్టయిజ్‌మెంట్స్, ట్రేడ్‌లైసెన్స్‌ల వంటి విభాగాల ద్వారా జీహెచ్‌ఎంసీకి రావాల్సిన ఆదాయంలో ఇరవై శాతం కూడా రావడం లేదంటే పరిస్థితిని అంచనా వేసుకోవవచ్చు. సీనియర్లు, పెద్ద హోదాల వల్ల వారి జీతభత్యాలు, సదుపాయాల కల్పనతో జీహెచ్‌ఎంసీకి ఆర్థిక భారం పెరుగుతోంది. అయినా.. మేమింతే. ఇక్కడే ఉంటామంటున్న వారిని ఎవరైనా కదల్చగలరా? వేచి చూడాల్సిందే!
ప్రసాదరావు కమిటీ
సిఫారసుల మేరకు సర్కిల్ కార్యాలయాలను 12 నుంచి 30కి పెంచారు. అయిదు జోన్లను ఆరుగా చేశారు. ప్రధాన కార్యాలయంలో 11 మంది అడిషనల్ కమిషనర్లను 6కు తగ్గించాలని సిఫారస్ చేస్తే ప్రస్తుతం డజను మంది ఉన్నారు. బదిలీలపై వచ్చేవారితో ఈ సంఖ్య ఇంకా పెరగనుంది. టౌన్ న్‌ప్లానింగ్, రెవెన్యూ, హెల్త్, ఎస్టేట్స్, అడ్వర్టయిజ్‌మెంట్స్ తదితర విభాగాలను బలోపేతం చేయాల్సి ఉందని కమిటీ సూచించింది. కానీ మెరుగవలేదు.
Comments
Please login to add a commentAdd a comment