సాక్షి, సిటీబ్యూరో: నిరుపేదలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ జారీలో దళారుల ప్రమేయానికి చెక్ పెట్టేందుకు జలమండలి సిద్ధమైంది. ఇప్పటికే కుత్భుల్లాపూర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో రూపాయి నల్లా కోసం దళారులను ఆశ్రయించి కొందరు రూ.2 వేలకుపైగా ఖర్చుచేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో....బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. నిరుపేదలు నివాసం ఉండే బస్తీలకు జీహెచ్‌ఎంసీ రిసోర్స్ సిబ్బంది, స్వయం సహాయక బృందాల మహిళలు నేరుగా దరఖాస్తులు తీసుకెళ్లి లబ్దిదారుల ఎదుటే పూర్తి వివరాలను దరఖాస్తులో పొందుపరచడంతోపాటు వారి నుంచి సంబంధిత అఫిడవిట్ (ప్రమాణ పత్రం), తెల్ల రేషన్‌కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను సేకరించనున్నారు. ఈమేరకు వారికి అవసరమైన శిక్షణనివ్వాలని నిర్ణయించారు. దీంతో నిరుపేదలకు జలమండలి సెక్షన్, డివిజన్ కార్యాలయాలు, స్కానింగ్, ఇంటర్నెట్ కేంద్రాల చుట్టూ తిరిగే అవస్థలు తప్పుతాయి. ఇక ఎవరైనా దళారులు డబ్బులు డిమాండ్‌చేసిన పక్షంలో జలమండలి కస్టమర్ కేర్ నెంబరు 155313కి ఫిర్యాదుచేయాలని బోర్డు వర్గాలు తెలిపాయి.
నేడు కుత్భుల్లాపూర్‌లో శిక్షణ
నిరుపేదలకు ఇచ్చే ఒక్క రూపాయి నల్లా కనెక్షన్ దరఖాస్తులను పూర్తిచేయడం, అవసరమైన దరఖాస్తుల స్వీకరణ వంటి అంశాలపై కుత్బుల్లాపూర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయంలో రిసోర్స్ పర్సన్స్, స్వయం సహాయక బృందాల సభ్యులకు జలమండలి ఆధ్వర్యంలో బుధవారం శిక్షణనివ్వనున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటీకే గుర్తించిన 27 బస్తీల్లో దాదాపు 10వేల కుటుంబాలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ శిక్షణ అనంతరం మహిళ గ్రూపు సభ్యులు బస్తీల్లోని గృహ యాజమానుల దగ్గరికి నేరుగా వెళ్లి ఒక్క రూపాయి నల్లా పథకాన్ని వివరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment