ఆ నాయకుల చేతుల్లో పావులు
∙ మున్సిపల్ అధికారులపై టీడీపీ కౌన్సిలర్ జయచంద్రారెడ్డి ధ్వజం
∙ పనితీరు మార్చుకోకపోతే శాంతియుత మౌన దీక్ష
తాడిపత్రి టౌన్ : తాడిపత్రి మున్సిపల్ అధికారులు మున్సిపాలిటీకి సంబంధం లేని రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారారని, వారి మాటలు విని తనపై వివక్ష చూపుతున్నారని 23వ వార్డు మున్సిపల్ టీడీపీ కౌన్సిలర్ భూమిరెడ్డి జయచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో «ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలో ఆ నాయకుల ధన దోపిడీ జరగకుండా చర్యలు తీసుకోవాలని, తనపై కోపం తన వార్డు ప్రజలపై చూపవద్దని కోరుతూ సోమవారం ఆయన మున్సిపల్ మేనేజర్ సాంబశివరావును కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సూచనలతో అప్రజాస్వామ్యబద్దంగా మూడు నెలల పాటు తనను కౌన్సిల్ నుంచి అధికారులు బర్తరఫ్ చేశారన్నారు.
తన వార్డులో పింఛన్లు, పక్కాగృహాల మంజూరుకు సంబం ధించి లబ్ధిదారుల వివరాలు అడిగితే మున్సిపాలిటీకి సంబంధం లేని ఒక రాజకీయ నాయకుడికి ఇచ్చామని, అతన్ని అడిగి తెలుసుకోవాలని చెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 23వ వార్డులోని కాల్వగడ్డ వీధిలో డ్రైనేజీ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని మున్సిపల్ ఈఈ, ఎస్‌ఈ, ఏఈలకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. తన వార్డు కు సంబంధించిన సమాచారాన్ని తనకు ఇవ్వాలని, సంక్షేమ పథకాలను అర్హులైన తనవార్డు ప్రజలకు కూడా మంజూరు చేయాలని అధికారులను కోరారు. పనితీరు మార్చుకోకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రజాస్వామ్యయుతంగా శాంతియుత మౌన దీక్ష చేపడతానని హెచ్చరించారు.